హరీ కృష్ణ..
హరీ కృష్ణ..
Published Mon, Mar 20 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
–కృష్ణా డెల్టాలో 59 వేల ఎకరాలు సాగుకు దూరం
–మూడేళ్లుగా బీళ్లుగానే..
–24 వేల మంది రైతుల జీవితాలు ఛిన్నాభిన్నం
–కూలీలు, భవన నిర్మాణ కార్మికులుగా మారిన వైనం
–పట్టించుకోని పాలకులు
ఏలూరు (మెట్రో) :
ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిన జిల్లాలో కృష్ణాడెల్టా పరిధిలోని రైతులు కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు. సాగు నీరు రాక.. వేసిన ఆరుతడి పంటలు చేతికి రాక వేల మంది రైతులు కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, తాపీ పనివారుగా మారుతున్నారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా మిగిలిపోయారు.
59 వేల ఎకరాల్లో సాగు హుష్‌కాకి
జిల్లాలో అత్యధిక మండలాల్లోని రైతులు గోదావరి డెల్టా సాగునీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఏలూరు, పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాల్లోని రైతులు సాగునీటి కోసం పూర్తిగా కృష్ణా నది నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడాలి. ఈ మండలాల్లో 59 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. 24 వేల మంది రైతులు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం వరకూ వారు కూడా బాగానే సాగు చేస్తూ జీవనం సాగించేవారు. మూడేళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఖరీఫ్ కూడా ఉండటం లేదు. దీంతో కొందరు రైతులు అపరాల సాగు చేస్తూ వ్యవసాయాన్ని వదలలేక నష్టమో, కష్టమో భరిస్తుంటే దాదాపు 20 వేల మంది రైతులు, వారి కుటుంబాలు సాగును వదిలి కూలి పనుల బాట పట్టాల్సి వచ్చింది. కొందరు సమీపంలోని ఏలూరు నగరం వైపు తాపీ పనులకు వచ్చి జీవనం సాగిస్తుంటే, మరికొందరు ఉపాధి హామీ పనులతోనే జీవనం సాగిస్తున్నారు.
ప్రయత్నాలు విఫలం
గతేడాది పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు వెళ్తున్న సాగునీటిని జానంపేట వద్ద పైపుల ద్వారా (సైఫ¯ŒS సిస్టం) ఎత్తిపోసే యత్నాలు చేశారు. అయితే ఈ నీటి ద్వారా కేవలం 2 వేల 300 ఎకరాలను మాత్రమే కాపాడగలిగారు. ఈ యత్నాలు పూర్తిస్థాయిలో ఫలించకపోవడంతో ఇక ప్రభుత్వం కూడా ఈ డెల్టా వైపు కన్నెత్తి చూడటం లేదు. పూర్తిస్థాయిలో పట్టిసీమ నీటిని మళ్లిస్తే కృష్ణా డెల్టాలో పంటలు పండే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం కళ్లప్పగించి చూడటం తప్ప ఏమాత్రం కనికరించడం లేదు.
ఆరుతడి పంటలతో అవస్థలే
గత ఏడాది 15 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలైన మినుములు, పెసలు సాగు చేసేందుకు కొందరు రైతులు యత్నించినా తెగుళ్ల కారణంగా ఈ పంటలు చేతికిరాకుండానే పోయాయి. సాక్షాత్తూ తెగుళ్ల వల్ల కోల్పోయిన పంటలను చేతపట్టుకుని అధికార పార్టీ నేతలే జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ రైతులకు న్యాయం చేయాలని కోరారు. అయినా ఫలితం శూన్యం.
Advertisement
Advertisement