
శ్రీశైలం జలాశయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో వరదతో శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి చేరిక పెరిగింది. నీటిమట్టం డెడ్ స్టోరేజీ (854 అడుగులు)ని దాటింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో జూరాల నుంచి 1,52,368 క్యూసెక్కులు, తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యారేజీ ద్వారా 1,61,988 క్యూసెక్కులు.. కలిపి 3,14,256 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటిమట్టం 854 అడుగులకు, నిల్వ 90 టీఎంసీలకు పెరిగింది.
ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 125 టీఎంసీలు అవసరం. వరద ఉద్ధృతి ఇదేస్థాయిలో కొనసాగితే ఆరు రోజుల్లో శ్రీశైలం నిండే అవకాశముంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో తుంగభద్రలో వరద స్థిరంగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు కూడా నిండి ఉండటంతో వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు. దీనితో మరో రెండు, మూడు రోజులు శ్రీశైలంలోకి ప్రస్తుత స్థాయిలోనే ప్రవాహం కొనసాగనుంది.
శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు 31,784 క్యూసెక్కులు (రోజుకు 2.75 టీఎంసీలు) వదులుతోంది. ఇక నాగార్జునసాగర్‌కు దిగువన వర్షాలు తెరిపి ఇవ్వడంలో పులిచింతల ప్రాజెక్టులోకి వరద తగ్గింది. ప్రకాశం బ్యారేజీకి కూడా ప్రవాహం 11,081 క్యూసెక్కులకు పడిపోయింది. కృష్ణా డెల్టా కాల్వలకు 3,700 క్యూసెక్కులు వదులుతూ మిగతా 7,381 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment