మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు, జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
గద్వాల: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు, జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఇక్కడి నుంచి భారీస్థాయిలో నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. గతరెండు నెల లుగా నైరుతి రుతుపవనాలు ఆశించినస్థాయిలో వర్షాలు కురియకపోవడంతో కృష్ణా, తుంగభద్ర నదులకు నీళ్లు రాలే దు. ప్రస్తుతం ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జూరాల గేట్లను ఎత్తడంతో శ్రీశైలం రిజర్వాయర్‌కు వరదనీరు చేరుతోంది.
ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలో కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్ నాలుగుగేట్లను తెరచి 61వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువప్రాం తాల నుంచి 73,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రాజెక్టులో 12 గేట్లు తెరిచి 74,800 క్యూసెక్కుల నీటిని మన రాష్ట్రం లోని జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న ఇన్‌ఫ్లోతో పాటు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 1.40లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిచేరుతోంది. దీంతో జూరాల 18 గేట్లను తెరచి 1.26లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా మరో 43వేల క్యూసెక్కులను వదలిపెడుతున్నారు. ఇలా జూరాల నుంచి మొత్తం 1.69లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో శ్రీశైలం రిజర్వాయర్‌కు వెళ్తోంది. తుంగభద్ర నదిపై రాజోళి వద్ద ఉన్న సుంకేసుల బ్యారేజీకి ఎగువప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో 35వేల క్యూసెక్కులు వస్తుండగా రెండు వేల క్యూసెక్కులను కేసీ కాల్వకు విడుదల చేస్తూ మిగతా 33వేల క్యూసెక్కులను ఏడుగేట్లను ఎత్తివేసి శ్రీశైలం రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులపై ఉన్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 2.02 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో శ్రీశైలం రిజర్వాయర్‌కు వెళ్తుంది.