![Andhra Pradesh: Summer Season Sudden Heavy Rains Effect On 16 Districts - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/21/Untitled-4.jpg.webp?itok=LICql5qJ)
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలోని 16 జిల్లాలపై ప్రభావాన్ని చూపాయి. నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, విజయనగరం, వైఎస్సార్, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, పార్వతీపురం మన్యం, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఏలూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని 119 మండలాల పరిధిలో 372 గ్రామాల్లో భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా వర్షాలు, పిడుగులకు 951 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
ప్రాథమిక అంచనాల ప్రకారం.. సుమారు 20 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికార యంత్రాంగం తేల్చింది. పలుచోట్ల విద్యుత్ లైన్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. పిడుగులు పడే అవకాశం కాగా మరో మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతర్గత తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్గఢ్ వరకు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణల మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
ఫలితంగా రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. కాగా సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
Comments
Please login to add a commentAdd a comment