పశ్చిమ గోదావరి జిల్లా తీపర్రులో నీటమునిగిన అరటితోట
సాక్షి,అమరావతి/సాక్షి విశాఖపట్నం/అనంతపురం అగ్రికల్చర్/మోతుగూడెం/కొరిటెపాడు (గుంటూరు): రాష్ట్రంలో మరో రెండు రోజులు (సోమవారం, మంగళవారం) విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, విశాఖ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపాయి.
► ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉంది.
► ఉత్తర బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.
► ఈ నెల 18 వరకు మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
► గత 24 గంటల్లో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా.. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
► భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి జలాశయం ప్రధాన డ్యామ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.
కృష్ణా జిల్లాలో పెసర పంటకు నష్టం
► కృష్ణా జిల్లాలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల పరిధిలో ఈ ఏడాది సుమారు 10 వేల ఎకరాలకు పైగా పెసర పంట సాగు చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెసర పంట నేలవాలింది. రోజుల తరబడి నీటిలో ఉండటంతో పెసరకాయలకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్నేరుకు వరద పెరిగింది. పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ తల్లి ఆలయ సమీపంలోని గృహాల్లోకి వరదనీరు చేరింది.
► కంచికచర్ల మండలంలో కస్తవ, లక్ష్మయ్య, ఏనుగు గడ్డ, నల్లవాగులు పొంగాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గండేపల్లి లంక భూముల్లో పత్తి, జామాయిల్, వరి పొలాలన్నీ నీటమునిగాయి.
Comments
Please login to add a commentAdd a comment