సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న అల్పపీడన ద్రోణి కూడా సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఎత్తులో స్థిరంగా ఉంది.
వీటి ప్రభావంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. 13 జిల్లాల్లో సగటున 2.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 9.9, శ్రీకాకుళంలో 9 మి.మీ సగటు వర్షపాతం రికార్డయ్యింది. విశాఖపట్నంలో 5.6 మి.మీ, కృష్ణా జిల్లాలో 5, తూర్పుగోదావరిలో 4.9, పశ్చిమగోదావరిలో 4.2, ప్రకాశం జిల్లాలో 2.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
(చదవండి: లోకేశ్.. పిచ్చి ప్రేలాపనలు వద్దు)
శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో అత్యధికంగా 116.5 మి.మీ (11.6 సెంటీమీటర్లు) వర్షం కురిసింది. విజయనగరం జిల్లా మెరకముడిదంలో 71.3, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 64.8, ప్రకాశం జిల్లా టంగుటూరులో 62.8, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 53.8, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో 52.3, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 51.3, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో 49.8, శ్రీకాకుళం జిల్లా బుర్జలో 47.8, కర్నూలు నగరంలో 47 మి.మీ వర్షపాతం నమోదైంది.
రాబోయే రెండు రోజులు కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ వర్షాలు, అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం ఉత్తరాంధ్రలో, గురువారం ఉత్తరాంధ్రతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment