Visakhapatnam Weather Forecast
-
అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణం
సాక్షి, విశాఖపట్నం: మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు పగటిపూట రోకండ్లు పగిలే ఎండ.. మరోవైపు విపరీతమైన ఈదురు గాలులు, అకాల వర్షాలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. రాబోయే ఐదురోజుల్లో ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. అంతేకాదు.. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తాయని తెలిపింది. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలిదుమారం వీస్తుందని, అలాగే క్రికెట్ బాల్ సైజ్లో వడగండ్ల వానకు ఆస్కారం ఉందని హెచ్చరించింది. మరోవైపు పగటి పూట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. గాలి విచ్ఛిన్నం, ద్రోణుల ప్రభావంతో వాతావరణంలో ఈ తరహా మార్పులు సంభవిస్తుయని పేర్కొంది వాతావరణ కేంద్రం. -
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న అల్పపీడన ద్రోణి కూడా సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఎత్తులో స్థిరంగా ఉంది. వీటి ప్రభావంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. 13 జిల్లాల్లో సగటున 2.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 9.9, శ్రీకాకుళంలో 9 మి.మీ సగటు వర్షపాతం రికార్డయ్యింది. విశాఖపట్నంలో 5.6 మి.మీ, కృష్ణా జిల్లాలో 5, తూర్పుగోదావరిలో 4.9, పశ్చిమగోదావరిలో 4.2, ప్రకాశం జిల్లాలో 2.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. (చదవండి: లోకేశ్.. పిచ్చి ప్రేలాపనలు వద్దు) శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో అత్యధికంగా 116.5 మి.మీ (11.6 సెంటీమీటర్లు) వర్షం కురిసింది. విజయనగరం జిల్లా మెరకముడిదంలో 71.3, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 64.8, ప్రకాశం జిల్లా టంగుటూరులో 62.8, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 53.8, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో 52.3, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 51.3, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో 49.8, శ్రీకాకుళం జిల్లా బుర్జలో 47.8, కర్నూలు నగరంలో 47 మి.మీ వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజులు కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ వర్షాలు, అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం ఉత్తరాంధ్రలో, గురువారం ఉత్తరాంధ్రతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
కోస్తా జిల్లాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
విశాఖ : కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా సగటున ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలు పెరిగింది. ఇక కృష్ణాజిల్లా మచిలీపట్నంలో 37 డిగ్రీలు నమోదు అయ్యింది. మరో రెండ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఈ ఏడాది వర్షాలు మాత్రం అనుకున్న స్థాయిలో పడటం లేదు. మరోవైపు సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు దాటినా వర్షపాతంలో భారీ లోటు నమోదు కావడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఇప్పటికే విత్తనాలు వేసి వరుణుడి కోసం రైతులు ఆకాశంవైపు దీనంగా చూస్తున్నారు. ఇటీవల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొద్దిమేర వర్షాలు పడినా అవి నాట్లు వేసేందుకు సరిపోవని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం మన రాష్ట్రంపై ఎంత వరకు ఉంటుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది బలపడేందుకు కనీసం రెండు మూడు రోజులు పడుతుందని చెప్పారు. రాష్ర్టంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అన్ని ప్రాంతాల్లోనూ పొడి వాతావరణమే నమోదైంది. ఆదిలాబాద్లో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం కూడా రాష్ర్టం లోని అన్ని ప్రాంతాల్లోనూ పొడి వాతావరణమే ఉండవచ్చని భారత వాతావరణశాఖ(ఐఎండీ) బులెటిన్లో పేర్కొంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, పొగమంచు కురుస్తుందని తెలిపింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 29, 18 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.