సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం మన రాష్ట్రంపై ఎంత వరకు ఉంటుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది బలపడేందుకు కనీసం రెండు మూడు రోజులు పడుతుందని చెప్పారు. రాష్ర్టంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అన్ని ప్రాంతాల్లోనూ పొడి వాతావరణమే నమోదైంది. ఆదిలాబాద్‌లో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం కూడా రాష్ర్టం లోని అన్ని ప్రాంతాల్లోనూ పొడి వాతావరణమే ఉండవచ్చని భారత వాతావరణశాఖ(ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, పొగమంచు కురుస్తుందని తెలిపింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 29, 18 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.