సాక్షి, వరంగల్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల ముసురులా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షాకాలం ఆరంభం తర్వాత తొలిసారిగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద క్రమంగా వరద పెరుగుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి ప్రాణహిత వరద పోటెత్తడంతో 35 గేట్లు ఎత్తి 165,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ కి గోదావరితో పాటు ఇంద్రావతినది వరద భారీగా వచ్చి చేరుతుండడంతో 33 గేట్లు ఎత్తి లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు.
వర్షం కారణంగా భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 8.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగ, కొన్నాయిగూడెంలో అత్యధికంగా 9.84 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వాజేడు మండలం బొగత జలపాతంకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాద స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతోంది జలపాతం వద్దకు పర్యటకుల సందర్శనను ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.
(కిలో కూరగాయలు రూ.20కే!.. ఎక్కడో తెలుసా!)
ఉప్పొంగిన వాగులు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాల ప్రజలు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కుమ్రంబీమ్ జిల్లా లో పెన్ గంగా, ప్రాణహిత పరివాహక ప్రాంతాలలో కలెక్టర్ హెమంత్ బోర్కడే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
కాగా, ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో అతిభారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
(ఇండియానే కాదు, చైనాను కూడా వర్షాలు వణికిస్తున్నాయి)
Comments
Please login to add a commentAdd a comment