రాష్ట్రవ్యాప్తంగా వరుణుడు విరుచుకుపడ్డాడు. చాలాచోట్ల ఇటీవలికాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో కుండపోత వానలు కురిశాయి. వాగులు ఉప్పొంగాయి, చెరువులు మత్తడి దూకాయి.. ఊళ్లకు ఊళ్లే నీటమునిగాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కొన్నిచోట్ల చెరువులు, చిన్నతరహా ప్రాజెక్టులకు గండ్లు పడ్డాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల గేట్లు ఎత్తడంతో.. మూసీలో ప్రవాహం పెరిగింది. దీనితో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. – సాక్షి నెట్‌వర్క్
ఉమ్మడి వరంగల్: జల విలయం
అతి భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాను జల విలయం వణికించింది. వరంగల్ నగరం నీటిలో తేలియాడుతోందా అన్నట్టుగా మారిపోయింది. గోకుల్‌నగర్, విద్యానగర్, క్రాంతినగర్, నంది తారనగర్, రాజాజీనగర్, రాంనగర్, కిషన్‌పుర ప్రాంతాలన్నీ కాలనీలన్నీ ముంపునకు గురయ్యాయి. దూపకుంట, గాడిపెల్లి, గుంటూరుపల్లి నుంచి పెద్ద ఎత్తున వరద తూర్పు కోటకు చేరింది.
అగర్త చెరువు మత్తడి పడడంతో నాగేంద్ర నగర్, కాశికుంట, విద్యానగర్, లక్ష్మీనగర్, శాకరాసికుంట, శాంతినగర్, ఎస్‌ఆర్‌ఆర్ తోట మీదుగా వరద ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ నగర్, రామన్నపేట, పోతన రోడ్డు ప్రాంతాల్లోని కాలనీల వాసులు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ములుగు రోడ్డు జంక్షన్‌లో నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
♦ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జడివాన అలజడి సృష్టించింది. టేకుమట్ల–రాఘవరెడ్డిపేట మధ్య చలివాగుపై ఉన్న బ్రిడ్జి పిల్లర్ ఒకటి కూలిపోయింది. గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రధాన ప్లాంటులోకి నీరు చేరింది. గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచింది.
♦ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జంపన్నవాగు రెండు వంతెనలపై నుంచి సుమారు 20 అడుగుల ఎత్తున వరద ప్రవహిస్తోంది. మేడారం సమ్మక్క–సారలమ్మ గుడి ప్రాంతం, మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం గ్రామాలు నీటమునిగాయి. అక్కడికి వచ్చిన భక్తులు, గ్రామస్తులను బోట్లతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరాపురం, అల్లంవారి ఘణపురం, చెల్పాక, బన్నాజీబంధం, ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముత్యంధార జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన 84 మంది పర్యాటకులను ఎన్‌డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీం సిబ్బంది కాపాడారు. జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. 13 చెరువులకు గండ్లు పడ్డాయి.
ఉమ్మడి కరీంనగర్: జడివాన దెబ్బ
భారీ వానకు కరీంనగర్ పట్టణంలో పలు కాలనీలు నీటమునిగాయి. రెండు ఇళ్లు కూలిపోయాయి. జమ్మికుంటలో హౌసింగ్ బోర్డ్ కాలనీ నీట మునిగింది. వరద ప్రభావంతో జమ్మికుంట, వీణవంక పట్టణాలకు గురువారం సాయంత్రం దాకా ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. సిరిసిల్ల జిల్లాలో మానేరు పరవళ్లు తొక్కుతోంది.
పట్టణ శివార్లలోని పెద్ద బోనాల చెరువు తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జగిత్యాల జిల్లా బీమారం మండలం రాజలింగంపేటలో గోవిందరాజుల చెరువు తెగింది. ముగ్గురు యువకులు నీటి ఉధృతిలో చిక్కుకోవడంతో కాపాడేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. కోరుట్లలో బాత్‌రూమ్ గోడకూలి విజేత అనే మహిళ మృతి చెందింది.
ఉమ్మడి ఆదిలాబాద్: గ్రామాలన్నీ జలదిగ్బంధం
భారీ వర్షం, వరదలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికించాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సిరికొండ, బజార్‌హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్‌లలో వాగులు ఉప్పొంగాయి. బోథ్, ఇంద్రవెల్లి మండలాల్లో రోడ్లు, వంతెనలు కోతకు గురవడంతో 50కిపైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మంచిర్యాల, చెన్నూరు పట్టణాల్లో లోతట్టు కాలనీలు నీట మునగడంతో ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. నిర్మల్, భైంసా పట్టణాల్లో పలు కాలనీలు నీటమునిగాయి. జిల్లా పరిధిలో కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులు ఆందోళనకర పరిస్థితికి చేరాయి. భైంసా మండలంలోని సిరాల చిన్నతరహా ప్రాజెక్టుకు గండిపడింది.
ఉమ్మడి ఖమ్మం: ముంచెత్తిన వరద
భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాను వరద ముంచెత్తింది. మున్నేరు నీటి మట్టం 30 అడుగులు దాటడంతో వరద ఖమ్మం నగరంలో ఇరవై కాలనీలు నీట మునిగాయి. దాదాపు మూడు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పద్మావతినగర్, వెంకటేశ్వరనగర్‌లలో వరదలో చిక్కుకున్నవారిని ఎన్డీఆర్‌ఎఫ్ రక్షించారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్‌కు చెందిన పెండ్ర సతీశ్ (23) వరదలో గల్లంతయ్యాడు.
ఉమ్మడి మెదక్: పలుచోట్ల కుండపోత
భారీ వర్షాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పలుచోట్ల కుండపోత వానలు పడ్డాయి. హుస్నాబాద్ పట్టణంలో బస్టాండ్ నీట మునిగింది. చేర్యాల మండలం వీరన్నపేట వద్ద జాతీయ రహదారి డైవర్షన్ తెగిపోవడంతో సిద్దిపేట– జనగామ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మోయతుమ్మెదవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సిద్దిపేట–హుస్నాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమ్మడి నల్లగొండ: రాకపోకలు బంద్
నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని ఆలేరు పెద్దవాగు, రత్నాలవాగు, బిక్కేరు, గొలనుకొండ, కొలనుపాక, చిన్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వలిగొండ, బీబీనగర్‌లో పలు చెరువులు, కాల్వలకు గండ్లు పడి పొలాలు నీటమునిగాయి. యాదగిరిగుట్టలోని గండిచెరువు, భువనగిరి మండలం అనాజిపురం చెరువుల కింద పొలాల్లోకి వాన నీరు చేరింది. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మండలాల పరిధిలోని జూలూరు, రుద్రవెల్లి, వలిగొండ మండలం భీమలింగం కత్వ, సంగెం– బొల్లేపల్లి మధ్య వంతెనలపై నుంచి మూసీ నది ప్రవహిస్తుండటంతో అధికారులు వాటిపై రాకపోకలు నిలిపివేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌లో భీమునికుంట అలుగుపోయడంతో దుబ్బగూడెం గ్రామం జలమయం అయింది. అర్వపల్లి మండలం కోడూరు, కొమ్మాల మధ్య, తిరుమలగిరి మండలం వెలుగుపల్లి–కేశవాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమ్మడి నిజామాబాద్: వరదకు తడిసి..
నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దయింది. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. చెరువులు అలుగు పారడంతో రోడ్లు తెగిపోయాయి. లోలెవల్ వంతెనలు మునిగాయి. ఆర్మూర్ వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపైకి భారీగా వరద చేరి రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది.
నందిపేట మండలం కుద్వాన్‌పూర్ చెరువు అలుగు వద్ద చేపల వేట కోసం వెళ్లిన కౌల్పూర్ గ్రామస్తుడు వరదలో గల్లంతయ్యాడు. కామారెడ్డి జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, తాడ్వాయి, మాచారెడ్డి, పాల్వంచ, పెద్ద కొడప్‌గల్, లింగంపేట మండలాల్లో వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
విజయవాడ– హైదరాబాద్ హైవేపై రాకపోకలు బంద్
వాహనాల దారిమళ్లింపు
కోదాడ రూరల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతికి బ్రిడ్జిపై నుంచి నీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దీంతో నేషనల్ హైవేపై విజయవాడ నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలను సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద దారి మళ్లిస్తున్నారు. కోదాడ నుంచి హుజూర్‌నగర్, మిర్యాలగూడ మీదుగా గుంటూరు వెళ్లి విజయవాడకు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి మీదుగా పంపిస్తున్నారు.
వరద ప్రవాహం తగ్గే వరకు ఈ సూచనలు తప్పకుండా పాటించాలని పోలీసులు సూచించారు. కాగా, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద గురువారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు.. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మైలవరం, తిరువూరు, ఖమ్మం మీదుగా మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment