‘జూరాల’లో కాలిన టర్బయిన్లు | Turbains burnt in Jurala power plant | Sakshi
Sakshi News home page

‘జూరాల’లో కాలిన టర్బయిన్లు

Published Wed, Aug 28 2013 3:12 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

‘జూరాల’లో కాలిన టర్బయిన్లు - Sakshi

‘జూరాల’లో కాలిన టర్బయిన్లు

గద్వాల (మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా జూరాల జలవిద్యుత్ కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో మూడు టర్బయిన్లు కాలిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా 2,3,5 టర్బయిన్లు పూర్తిగా.. 6వ టర్బయిన్ పాక్షికంగా కాలిపోయాయి. దీంతో జెన్‌కోకు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లయింది. గ్రిడ్ నుంచి రివర్స్ విద్యుత్ సరఫరా కావడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని జెన్‌కో అధికారులు తెలిపారు. నాలుగు టర్బయిన్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి కనీసం ఏడాది పడుతుందని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు.
 
  గత నెల 21నే తొలిసారి ఆరు టర్బయిన్ల ద్వారా పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటిద్వారా 200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి సమయంలో సాంకేతిక లోపం కారణంగా 2, 3, 5, 6 టర్బయిన్లు ఒక్కసారిగా నిలిచిపోయాయి. సమీపంలోని వెల్టూరు గ్రిడ్‌కు లింక్ ఉన్నందున రివర్స్ విద్యుత్ సరఫరా కావడంతో మూడు టర్బయిన్లు(2,3,5) కాలిపోగా, 6వ టర్బయిన్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. 1, 4 టర్బయిన్లు యథావిధిగా పనిచేస్తున్నాయి.
 
 ఈ రెండు టర్బయిన్లకు విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద ఉన్న 11కెవీ సబ్‌స్టేషన్‌తో అనుసంధానం ఉన్నందున రివర్స్ విద్యుత్ సరఫరా అయినప్పటికీ కాలిపోకుండా నిలిచిపోయాయి. మిగతా నాలుగు టర్బయిన్లకు సబ్‌స్టేషన్‌తో అనుసంధానం లేకపోవడంవల్లనే కాలిపోయాయని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే టర్బయిన్లలో వైరింగ్ పూర్తిగా కాలిపోయి ఉండకపోవచ్చని, కేవలం ప్యానల్స్ మాత్రమే కాలిపోయి ఉంటాయని జెన్‌కో అధికారులు భావిస్తున్నారు. బుధవారం టర్బయిన్లను ఓపెన్ చేస్తేకాని నష్టాన్ని అంచనా వేయలేమంటున్నారు. ఒప్పందం ప్రకారం సీఎంఈసీ రెండేళ్లపాటు ఈ టర్బయిన్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే టర్బయిన్ల ఏర్పాటు ఆలస్యమైన నేపథ్యంలో చైనా కంపెనీ ఇచ్చిన వారంటీ గత ఏడాదితో ముగిసింది. దీంతో ప్రస్తుతం జూరాల జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద నష్టాన్ని జెన్‌కోనే భరించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
 
 సాంకేతిక లోపమే కారణం: ఆదిశేషు, జెన్‌కో డెరైక్టర్
 సాంకేతిక లోపంతో టర్బయిన్లు నిలిచిపోయాయి. రివర్స్ విద్యుత్ సరఫరావల్ల కాలిపోయాయి. చైనా నిపుణులతో ఇప్పటికే సంప్రదించాం.  త్వరలోనే నిపుణులను పిలిపించి వీలైనంత త్వరగా టర్బయిన్లను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతాం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement