వాటర్‌గ్రిడ్ సర్వేకు రూ.105 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ పనుల సర్వేకు ప్రభుత్వం రూ.105 కోట్లు విడుదల చేసింది. సర్వే పనులు తొందరగా పూర్తి చేసి సమాంతరంగా గ్రిడ్ పనులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో వాటర్‌గ్రిడ్‌పై అధికారులు నివేదించిన ప్రాథమిక అంచనాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వానికి ఈ పథకం అత్యంత ప్రాధాన్యమైందని, ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచి నీటిని అందించాలన్నారు.
జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పాలేరు, కిన్నెరసాని, వైరా, రామప్ప, ఎల్‌ఎండీ, ఏఎండీ, కడెం, ఎల్లంపల్లి, కొమురంభీం, ఎస్సారెస్పీ, గడ్డెన్న, నిజాంసాగర్, మంజీర తదితర ప్రాజెక్టుల నుంచి పైపులైన్ల ద్వారా రాష్ట్రంలోని 25 వేల హాబిటేషన్లకు తాగునీటిని అందించాలన్నారు. మొత్తం 1.32 లక్షల కిలోమీటర్ల పొడవైన పైపులైన్ అవసరమవుతుందన్నారు. ఏరకం పైపులైను ఎంత కావాలో అంచనాలు రూపొందించి టెండర్లు పిలిచి వర్క్‌ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు.
పైపులూ తెలంగాణలోనే తయారు చేసేలా కంపెనీలను ఒప్పించాలని.. దీంతో రవాణా సులభం అవుతుందన్నారు. పైపుల తయారీ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సహకారం అంది స్తామన్నారు. గ్రామాల్లో కరెంటు మోటర్లు బిగిం చాలని చెప్పారు. గ్రిడ్‌కు అవసరమయ్యే విద్యుత్తుకు ప్రతిపాదనలను, సబ్‌స్టేషన్లకు సంబంధించి అంచనాలను రూపొందించాలన్నారు.
ఇన్‌టేక్ వద్ద, నీటిని శుద్ధి చేసే ప్లాంట్ల వద్ద సబ్‌స్టేషన్లను నిర్మించాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని తాగునీటికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నందున నీటి పారుదల శాఖ సమన్వయంతో పని చేయాలన్నారు. సమ్మర్ స్టోరేజీట్యాంకుల బాధ్యత ఆ శాఖకు అప్పగించారు. గ్రిడ్ పనుల నాణ్యత పరిశీలనకు సీఈ స్థాయి అధికారి సారథ్యంలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని సూచించారు.