రేకులపల్లి వద్ద వరద ముంపునకు గురైన మామిడి తోట
–లోయర్ జూరాల వరదనీటిలో మునిగిన పంటలు
–రైతులను ముందుగా హెచ్చరించని అధికారులు
జూరాల :కృష్ణానది వరద పెరగడంతో లోయర్ జూరాల డ్యాం స్పిల్‌వే వద్ద నీటిమట్టం పెరగడంతో వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల మండలం రేకులపల్లి వద్ద లోయర్ జూరాల స్పిల్‌వే గోడపై ఒక్కసారిగా 2.50లక్షల క్యూసెక్కుల వరద రావడంతో నీటిమట్టం పెరిగింది. నదీతీరం వెంట ఉన్న పొలాల్లోకి నీళ్లు వెళ్లడంతో పంటలన్నీ నీటమునిగాయి. మునుగుతున్న పంటలను రైతులు కాపాడుకోలేకపోయారు. మామిడి తోటలు, మిరపతోట, పత్తి తోటలు, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, కందులు పంటలు వరద ముంపునకు గురయ్యాయి. పశువుల కోసం వేసుకున్న పాకలు కూడా నీటిలో మునిగిపోవడంతో రైతులు నష్టపోయారు. జూరాల ప్రాజెక్టు నుంచి బీచుపల్లి వరకు నదీతీరంలో వేసిన బోర్లను రైతులు తొలగించలేదు. ఒక్కసారిగా నదిలో వరద పెరగడంతో బోర్లు మునిగిపోయాయి. లోయర్ జూరాల స్పిల్‌వే గోడకు దిగువన కుడివైపున నదీతీరంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్ ముంపునకు గురైంది. కృష్ణానది వరద వస్తుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు రెండురోజుల ముందుగా హెచ్చరించినా రెవెన్యూ అధికారులు మాత్రం గ్రామాల్లో దండోరా వేయించలేకపోయారు. ఒకరోజు ముందే రెండెకరాల్లో మిరపనారును నాటించిన రైతు విజయమోహన్‌రెడ్డి రూ.లక్ష నష్టపోయారు. ఈ విషయమై గద్వాల ఆర్డీఓ కార్యాలయ ఏఓ వీరభద్రప్పను వివరణ కోరగా.. గ్రామాధికారులకు దండోరా వేయాల్సిందిగా ఆదేశించామని, వేయించని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
వరద వస్తుందని చెప్పలేదు
రెండు రోజుల ముందే వరద వస్తుందన్న సమాచారం ఉన్నా అధికారులు గ్రామంలో దండోరా వేయించలేదు. ఇది తెలియక గురువారం రోజే రెండెకరాల్లో మిరప పైరును నాటి నష్టపోయాను. నదీతీరంలో ఉన్న మోటార్లు, పాకలను తరలించుకోలేకపోయాం.
– విజయమోహన్‌రెడ్డి, రైతు, రేకులపల్లి
రైతుల ఆందోళన
ఆత్మకూర్ : దిగువ జూరాల విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను నిలుపుతున్న నేపథ్యంలో ఎగువన ఉన్న పంటపొలాలు శుక్రవారం నీట మునిగాయి. ఆత్మకూర్ మండల పరిధిలోని మూలమల్ల గ్రామశివారులోని సర్వే నంబర్ 277నుంచి 301వరకు సుమారు 55ఎకరాల్లో పంటలు నీట మునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జన్కో నిర్మాణం కోసం తమభూములు ఇవ్వలేదని, తమకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ నాయకులు ప్రసాద్, మోష, సర్పంచ్ సురేందర్, భీమన్న డిమాండ్ చేశారు.