నైరుతి రుతుపవనాలతో గత 20వ తేదీ నుంచి జూరాల ప్రాజెక్టుకు ప్రారంభమైన ఇన్‌ఫ్లో వరద మూడు రోజులు తగ్గింది
నైరుతి రుతుపవనాలతో గత 20వ తేదీ నుంచి జూరాల ప్రాజెక్టుకు ప్రారంభమైన ఇన్‌ఫ్లో వరద మూడు రోజులు తగ్గింది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. రిజర్వాయర్‌కు 1465క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కష్ణానదిపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.31 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
అల్మట్టి ప్రాజెక్టుక దిగువన కర్ణాటక రాష్ర్టంలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ కేవలం 15.55 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వరద 766 క్యూసెక్కులు వచ్చిచేరుతోంది. నారాయణపూర్‌కు దిగువన మన రాష్ట్రంలో ఉన్న జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ కేవలం 2.88 టీఎంసీలు ఉంది.
నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 1465 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కష్ణానదికి ఉపనది తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 110.86 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ కేవలం 3.66 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో 428 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వచ్చిచేరుతుంది. తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి 207 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.