గుర్రంగడ్డ వద్ద మరపడవ
కృష్ణవేణి .. జీవనవాణి
Published Tue, Aug 9 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
జిల్లాలో 295 కిలోమీటర్ల పొడవునా కృష్ణానది ప్రవహిస్తోంది.. నదీతీరం వెంట గ్రామాలు దీనిపైనే ఆధారపడ్డాయి.స్వాతంత్య్రానంతరం ఈ నది వెంట వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు.. వీటి ద్వారా సాగునీటితోపాటు దాదాపు సగం పట్టణాలు, పల్లెలకు తాగునీటిని అందిస్తున్నారు.. ఇలా పాలమూరు ప్రజల జీవనవేదంగా మారింది.
జూరాల : మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న మహాబలేశ్వరంలో ప్రారంభమైన కృష్ణానది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా సముద్రంలో విలీనమవుతుంది. ఇది కర్ణాటక నుంచి జిల్లాలోకి మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం కృష్ణావద్ద ప్రారం¿¶ మవుతుంది. గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు వరకు నదీ ప్రవహిస్తోంది. నదీతీరంలో ఉన్న గ్రామాల మత్స్యకారులు తరతరాలుగా చేపల వేటలో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు బావులు, బోర్ల ద్వారా వివిధ పంటలను సాగు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గుర్రంగడ్డ దీవి ప్రజలు ఈ నదీ ప్రవాహంపైనే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల, జటప్రోలు మొదలుకుని శ్రీశైలం వరకు టూరిజం బోట్లు, కొల్లాపూర్ నుంచి రాయలసీమ వైపు ఉన్న ఆత్మకూరు వరకు నిత్యం జనాన్ని తరలించే బోట్లపై ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 1981లో కష్ణానదిపై జూరాల ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి 1996లో పూర్తిచేసింది. దాదాపు 7.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా 2005లో జలయజ్ఞం ద్వారా నాలుగు ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ఈ ప్రాజెక్టులతో సగం జిల్లా సస్యశ్యామలంగా మారేలా కష్ణానది నీళ్లు పారనున్నాయి. జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి భారీ తాగునీటి పథకాలను నిర్మించడం ద్వారా సగం జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలు, గ్రామాల ప్రజలకు తాగునీటిని అందించే రక్షిత పథకాలను నిర్మించారు, ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు. గతేడాది కష్ణానదికి వరద రాకపోవడంతో ప్రాజెక్టులకు నీళ్లు రాక పట్టణాలకు తాగునీరందక, నదిలో ప్రవాహం లేక చేపలు దొరకక వేలాది కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రస్తుత ఏడాది నైరుతి రుతుపవనాల ప్రారంభం నుంచే వర్షాలు కురుస్తుండటంతో కష్ణానదిలో ప్రవాహం బాగా ఉండటంతో రైతులు, మత్స్యకారులు బోట్లపై ఆధారపడిన కుటుంబాలు, ప్రజల తాగునీటి అవసరాలు తీరనున్నాయి.
ఏయే ప్రాజెక్టులు
కృష్ణానదిపై 1981లో ధరూరు మండలం రేవులపల్లి వద్ద జూరాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. చివరకు ఇది 1996లో ప్రారంభమైంది. ప్రాజెక్టు రిజర్వాయర్, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ద్వారా రెండేసి లక్షల ఎకరాలకు, కోయిల్‌సాగర్ ద్వారా 50వేల ఎకరాలకు సాగునీటిని అందించే పథకాలు చేపట్టారు. ఈ ఏడాది నుంచే వీటిద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వబోతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మితమైంది. ఈ పథకం ద్వారా 3.3లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు. ఇలా ప్రాజెక్టుల ద్వారా 8.87లక్షల ఎకరాలకు కృష్ణానది నీళ్లను అందించే పథకాలు నిర్మించారు. గద్వాల, మక్తల్, వనపర్తి, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్, అలంపూర్ నియోజకవర్గాల్లోని భూములకు కష్ణానది నీళ్లు అందనున్నాయి.
మత్స్య సంపదకు నిలయం
కృష్ణానది జిల్లాలో అడుగిడిన ప్రాంతం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు దిగువన వరకు మత్స్యసంపద పుష్కలంగా ఉంది. దీనిపై నదీతీర గ్రామాలు, పట్టణాల్లోని మత్స్యకారులు ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్నారు. వేలాది కుటుంబాలు కృష్ణానది మత్స్యసంపదపై ఆధారపడి జీవిస్తూ కృష్ణానది ప్రవాహాన్నే నమ్ముకున్నారు. మక్తల్, గద్వాల, అలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని నదీతీర గ్రామాల్లో వందలాది కుటుంబాలకు చెందిన వారు పుట్టిలలో ప్రజలను నదికి రెండువైపులా ఒడ్డుకు చేర్చుతూ వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నారు. తరాలుగా జీవిస్తున్న కుటుంబాలు ఇప్పటికీ అదే పుట్టి ప్రయాణాన్నే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నారు. కొత్తగా మర పడవలు వచ్చాయి. గద్వాల మండలం గుర్రంగడ్డ దీవి ప్రజలను ఒడ్డుకు చేర్చేందుకు ప్రభుత్వం మరబోటును అందజేసింది. అలాగే సోమశిల ప్రాంతంలోనూ మరబోట్లను ఉపయోగిస్తూ మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల ప్రజలను ఆవలి ఒడ్డులకు చేరుస్తున్నారు. నదీతీర గ్రామాల రైతులు నది నీటిని బోర్లు, బావులు, మోటార్ల ద్వారా పొలాలకు మళ్లించుకుని పంటలను పండిస్తున్నారు. కష్ణానది ప్రవాహంపై టూరిజం, పర్యాటకాన్ని అభివద్ధి చేసేందుకు గత ప్రభుత్వాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం కొల్లాపూర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు నల్లమల అడవిలో అందాలను చూస్తూ ప్రయాణించేలా టూరిజం బోట్లను ఏర్పాటు చేసింది. గద్వాల మండలం జమ్ములమ్మ రిజర్వాయర్ వద్ద టూరిజం అధికారులు మర, సైక్లింగ్‌బోట్లను ఏర్పాటు చేశారు. నదీతీరంలో పర్యాటక వసతిగహాలను నిర్మించారు. ఇలా పర్యాటకంపై వందలాది కుటుంబాలు జీవిస్తుండగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.
నది నుంచి తాగునీరు
జూరాల ప్రాజెక్టు వద్ద నిర్మితమైన భారీ తాగునీటి పథకాల ద్వారా గద్వాల, అలంపూర్, మక్తల్, మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తి, జడ్చర్ల, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు కష్ణానది నీటిని ఇప్పటికే పలు పట్టణాలకు అందిస్తున్నారు. మరికొన్ని పట్టణాలు, గ్రామాలకు రెండేళ్లలో పూర్తిస్థాయిలో తాగునీటిని అందించనున్నారు.
Advertisement
Advertisement