జూరాల, సింగూరు భద్రతపై కదిలిన నీటిపారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగు, తాగు నీటి ప్రాజెక్టులైన జూరాల, సింగూరు డ్యామ్‌ల నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ ఫిబ్రవరి 20న ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆ శాఖ అధికారులు స్పందించారు. ఈ డ్యామ్‌ల భద్రతకు పెద్దపీట వేయాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు వాటి నిర్వహణ, అందుకు తీసుకోవా ల్సిన చర్యల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అంశంపై ఈఎన్‌సీ మురళీధర్ సోమవారం సంబంధిత వెకానికల్ అండ్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వివరణ కోరారు. ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం ఉన్న గేట్లు, క్రేన్స్, జనరేటర్ల వివరాలు అడిగారు.
గ్రీజింగ్, వెల్డింగ్, గేట్ల నిర్వహణకు అవసరమైన సిబ్బంది గురించి కూడా వివరాలు కోరినట్లు నీటి పారుదల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. కాగా జూరాల పరిధిలో వర్క్ ఇన్స్‌పెక్టర్, గేటు ఆపరేట్లర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్‌మెన్‌లు, ఆపరేటర్లు కలిపి మొత్తంగా 19మంది వరకు అవసరం ఉండగా.. ప్రస్తుతం ఒక్క ఉద్యోగి కూడా అక్కడ లేడు. సింగూరు పరిధిలోనూ 13 మంది సిబ్బంది అవసరం ఉండగా ఒక హెల్పర్, ఇద్దరు వాచ్‌మెన్‌లు మాత్రమే ఉన్నారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ నీటిపారుదల శాఖ దృష్టికి తెచ్చింది.