నారాయణపూర్ క్లస్టర్ గేట్ల నుంచి దిగువనకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది వరద
నేడు జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
Published Wed, Jul 20 2016 1:23 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
జూరాల : మహారాష్ట్ర, కర్ణాటకలలో కురిసిన వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను దాటిన కృష్ణానది వరద బుధవారం ఉదయంలోగా జూరాల ప్రాజెక్టుకు చేరుతుంది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రం విడుదలైన వరద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మాగనూరు మండలానికి చేరుకుంది. వర్షాకాలం ప్రారంభమైన నాటినుంచి కృష్ణానది వరద కోసం ఎదురు చూస్తున్న జిల్లాలోని ప్రాజెక్టుల ఆయకట్టు రైతులతోపాటు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటితోపాటు ముఖ్యమైన పట్టణాలకు తాగునీటిని అందిస్తున్న జూరాల ప్రాజెక్టుకు వరద రావడం వర్షాకాలంలో తొలిసారి కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోమవారం సాయంత్రం నారాయణపూర్ ప్రాజెక్టులో నాలుగు క్రస్టుగేట్లను తెరచి 28,950 క్యూసెక్కులను మొదటిసారిగా విడుదల చేయడం ప్రారంభించారు. పై నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో నారాయణపూర్ ప్రాజెక్టులో మొత్తం గేట్లను తెరచి రాత్రి 10గంటలకు 1.31లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. మంగళవారం ఉదయం 6గంటల వరకు 1.37,004 క్యూసెక్కుల విడుదల కొనసాగింది.
ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో వరద తగ్గడం తో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్న ఔట్‌ఫ్లో వరదను త గ్గిస్తూ వచ్చారు. ఉదయం 11గంటలకు నారాయణపూర్ నుంచి 77,568 క్యూసెక్కుల విడుదల జరగగా సాయంత్రం 3గంటలకు 43,488 క్యూసెక్కులు రాత్రి 7గంటలకు 33,264 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. మంగళవారం మధ్యరాత్రి నుంచి బుధవారం ఉదయంలోగా జూరాల రిజర్వాయర్‌కు కర్ణాట క నుంచి ఇన్‌ఫ్లో వరద చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ఇన్‌ఫ్లో వరద 95,656 క్యూసెక్కులు వస్తోంది. నీటినిల్వను 122.8 టీఎంసీలుగా నిర్వహిస్తూ దిగువ నదిలోకి విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మొత్తం క్రస్టుగేట్లను మూసివేశారు. నారాయణపూర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ చేరడంతో పై నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో ఆధారంగా వరద నీటిని దిగువకు విడుదల చేయడం కొనసాగిస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో 3.58 టీఎంసీల నీటినిల్వ ఉంది. నారాయణపూర్ నుంచి వచ్చే వరద ప్రవాహంతో గురువారం సాయంత్రంలోగా పూర్తిస్థాయికి నీటినిల్వ పెరగగానే విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటి విడుదలను ప్రారంభిస్తారు.
Advertisement
Advertisement