జూరాల నీటి విడుదలకు చర్యలు: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, పాలమూరు రైతాంగ అవసరాలకు అనుగుణంగా జూరాల నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, గద్వాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, జూరాల ఎస్‌ఈ రఘునాథ్‌లతో కలసి మంత్రి సమీక్షించారు. నారాయణపూర్, ఆల్మట్టి నుంచి వస్తున్న వరద నీటిపై చర్చించారు. జూరాల నుంచి భీమా ఫేజ్ 1, ఫేజ్ 2తోపాటు కోయిల్ సాగర్, నెట్టెంపాడులకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఎగువన ఉన్న కర్ణాటక నుంచి నీటి విడుదలకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు.