జూరాలకు 3 టీఎంసీలివ్వండి
నారాయణపూర్ నుంచి విడుదల చేయండి
* పాలమూరుకు తాగునీరిచ్చేందుకు సహకరించండి
* కర్ణాటక మంత్రిని కోరిన మంత్రి హరీశ్
* సీఎంతో చర్చించి నిర్ణయిస్తామన్న పాటిల్
* 50 రోజుల్లో ఆర్డీఎస్ పనులు పూర్తి చేస్తామని హామీ
సాక్షి, హైదరాబాద్/బెంగళూరు, జూరాల: మహబూబ్‌నగర్ జిల్లా తాగునీటి అవసరాల కోసం మానవతా దృక్పథంతో కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు కోరారు. కర్ణాటక భారీ, మధ్య తరహా నీటిపారుదల మంత్రి ఎంబీ పాటిల్ ఇందుకు సానుకూలత వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గురువారం బెంగళూరులోని విధానసౌధలో పాటిల్‌తో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో కలిసి హరీశ్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సం బంధాలు నెలకొనాల్సిన ఆవశ్యకత, జల పంపకాల విషయాలు, రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) ఆధునీకరణ తదితరాలపై చర్చించారు. సీఎం కోరిక మేరకు పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చడంలో కర్ణాటక సహకారం కోరేందుకు వచ్చామని హరీశ్ అన్నారు. మహబూబ్‌నగర్ కరువుతో ఉన్నందున నారాయణపూర్ నుంచి 3 టీఎంసీలివ్వాలని కోరారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కృష్ణా జలనిగమ్ అధికారులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని పాటిల్ హామీ ఇచ్చారు.
50 రోజుల్లో ఆర్డీఎస్ పనులు పూర్తి
ఆర్డీఎస్ గురించి కూడా భేటీలో హరీశ్ ప్రస్తావించారు. ‘‘కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 15.9 టీఎంసీల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు నీరందాల్సి ఉన్నా ఐదారు టీఎంసీలకు మించి రావడం లేదు. దాంతో ఏనాడూ నిర్దేశిత ఆయకట్టులో కనీసం 20 వేల ఎకరాలు కూడా సాగుకు నోచుకోవడం లేదు. కర్నూ లు జిల్లా రైతులు తరచూ తూములు పగులగొట్టడం, అక్రమంగా నీటిని తరలించుకుపోవడంతో ఆర్‌డీఎస్ ద్వారా తెలంగాణలో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు.
బ్యారేజీ ఎత్తును 15 సెంటీమీటర్ల మేర పెంచేందుకు, లైనింగ్ మరమ్మతులకు ఉమ్మడి రాష్టంలో రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.58 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసినా పనులు సాగడం లేదు’’ అని వివరించారు. పాటిల్ 50 రోజుల్లోనే ఆర్డీఎస్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఇదే సమయంలో బెంగళూరు నుంచే ఏపీ సాగునీటి మంత్రి దేవినేని ఉమతో ఫోన్లో మాట్లాడారు. ఆర్డీఎస్ పనుల సహకారంపై చర్చిద్దామని ప్రతిపాదించారు. మే 4 తర్వాత చర్పిద్దామని ఉమ హామీ ఇచ్చారు.