సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. రానున్న రబీ పంటల సాగుపై ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల జాతీయ వర్క్‌షాప్ నిర్వహించింది. దీనికి తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్, ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. వ్యవసాయ భూమికి యజమాని పేరుతో పట్టా ఉండటం వల్ల కౌలు రైతులు సాగు చేసే పంటలకు బీమా సమస్యగా మారింది. వారికి ఒకప్పుడు కార్డులు ఇచ్చినా, చాలాచోట్ల భూ యజమానులు కౌలుదార్లను మార్చుతుండటంతో అవి వృథాఅవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలతో కూలంకషంగా చర్చించి కౌలు రైతులకు పంటల బీమా అందేలా చేయాలని రబీ సదస్సులో కేంద్రం తెలిపినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కౌలు రైతులకు బీమా విషయంపై కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వాటిని అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేసే అంశాన్ని రాష్ట్రం పరిశీలిస్తోంది.
డిజిటల్ డివైజ్‌తో భూసార పరీక్ష..
వ్యవసాయ భూముల సారాన్ని తెలుసుకోవడం వ్యవసాయ శాఖకు సమస్యగా మారింది. సంబంధిత వ్యవసాయ భూమి నుంచి మట్టి నమూనాలు సేకరించి, వాటిని లేబొరేటరీకి పంపించి పరీక్షించడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీంతో లక్షలాది ఎకరాల భూమికి భూసార కార్డులు ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరడంలేదు. ఈ నేపథ్యంలో రబీ సదస్సులో దీనికి సంబంధించి కొత్త ప్రతిపాదనలను కేంద్రం ప్రవేశపెట్టింది. డిజిటల్ డివైజ్‌తో భూసార పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది.
రబీకి సిద్ధం.. అందుబాటులో విత్తనాలు..
రానున్న రబీ సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ సాగు మొదలుకానుండటంతో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఈ విషయాన్ని కేంద్రానికి వివరించింది. రబీకి కేంద్రం 12.10 లక్షల టన్నుల ఎరువులు కేటాయించగా, ఇప్పటికే డీలర్లు, మార్క్‌ఫెడ్, కంపెనీల వద్ద 6.35 లక్షల టన్నులున్నాయి. అలాగే 5.82 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. అందులో 1.64 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 1.33 లక్షల క్వింటాళ్ల శనగ, 2.38 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను ఉంచినట్లు వ్యవసాయ వర్గాలు తెలిపాయి.
Published Mon, Sep 25 2017 1:32 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement