మద్దతు ధరకు శనగ, మినుము, పెసలు, వేరుశనగ కొనుగోళ్లు
2.75 లక్షల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి
ఆర్బీకేల్లో రైతుల నమోదుకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇచ్చి న ప్రభుత్వం.. తాజాగా మినుము, పెసలు, వేరుశనగ సేకరణకూ అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. రబీ 2023–24 సీజన్‌లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి.
శనగ 5.26 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. క్వింటాల్ శనగలకు రూ.5,440, పెసలుకు రూ.8,558, మినుముకు రూ.6,950, వేరుశనగకు రూ.5,850 చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది.
2.75 లక్షల టన్నుల సేకరణకు అనుమతి
కనీస మద్దతు ధరకు శనగలు 1,14,163 టన్నుల సేకరణకు గత నెలాఖరున ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా 97,185 టన్నుల మినుము, 46,463 టన్నుల వేరుశనగ, 17,505 టన్నుల పెసలు సేకరణకు అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది.
పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్‌ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తున్నారు.
మార్కెట్‌లో ధరలు పెరిగే అవకాశం
రబీ పంట ఉత్పత్తుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శనగలు, మినుము, పెసలు, వేరుశనగ సేకరిస్తున్నాం. మార్కెట్‌లో కనీస మద్దతు ధర దక్కని వారు ఆర్బీకేల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలి. మార్కెట్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. తొందరపడి ఏ ఒక్క రైతు తమ పంట ఉత్పత్తులను ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment