యాసంగి యాతన
- పెట్టుబడికి పైసల్లేక రైతులు విలవిల
- రుణాలకు మొహం చాటేస్తున్న బ్యాంకులు
- ఇప్పటికిప్పుడు ఇవ్వలేమని స్పష్టీకరణ
- ప్రైవేటు వ్యాపారుల వద్దా పుట్టని అప్పు
- రుణ లక్ష్యం రూ.11,640 కోట్లు.. ఇచ్చింది 4 వేల కోట్లే
- రబీ పంటలకు ముగుస్తున్న బీమా గడువు
- బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రీమియం చెల్లించలేని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సెప్టెంబర్‌లో కురిసిన కుండపోత వర్షాలకు చెరువులు, జలాశయాలు నిండి భూగర్భ జలాలు పెరిగినా.. బ్యాంకుల నుంచి సహకారం లేకపోవడంతో అన్నదాతలు కుదేలైపోతున్నారు. రైతులకు పంట రుణాలివ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ సమస్య ఉన్నందున రుణాలివ్వబోమని తేల్చి చెబుతున్నాయి. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది. రూ.500, వెయ్యి నోట్ల రద్దుతో అప్పులోళ్ల వద్దా నగదు లేకుండా పోయింది. అటు బ్యాంకుల వద్ద రుణాలు అందక.. ప్రైవేటు వడ్డీ అప్పులు పుట్టక రైతులు అల్లాడుతున్నారు. ఎరువులు కొనేందుకు కూడా డబ్బుల్లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పంటల సాగు జరిగినా.. ఎరువులకు డిమాండ్ పెరగలేదని వ్యవసాయ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
సమావేశాలతో సరి..!
రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇప్పించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారే కానీ కీలకమైన సమయంలో రైతులకు పంట రుణాలు ఇప్పించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ రబీ(యాసంగి)లో రూ.11,640 కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకులు కేవలం రూ.4 వేల కోట్లకు మించి ఇవ్వలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అందులో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) ద్వారా రైతులకు ఇవ్వాల్సిన రబీ రుణ లక్ష్యం రూ.2,200 కోట్లు కాగా.. కేవలం రూ.100 కోట్లే ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పాత నోట్ల డిపాజిట్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని టెస్కాబ్ ఎండీ మురళీధర్‌రావు ‘సాక్షి’కి చెప్పారు. ఆర్‌బీఐ నుంచి తమకు ఇప్పటివరకు తమకు రూ.240 కోట్లు మాత్రమే కొత్త కరెన్సీ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అందువల్లే రైతులకు రుణాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. రబీలో మొత్తంగా 15 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారని అంచనా వేయగా... ఇప్పటివరకు కేవలం 6 లక్షల మంది రైతులకే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి.
బీమా గోవిందా...
ఈ నెల 15వ తేదీదో రబీలో మొక్కజొన్న, శనగ పంటలకు బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగియనుంది. వరి, మిరప వంటి ఇతర పంటలకు ఈ నెలాఖరకల్లా గడువు ముగియనుంది. పంట రుణాలు తీసుకునే రైతులందరి నుంచి బీమా ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయించుకుంటాయి. ఆ సొమ్మును బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. కానీ తాజా పరిస్థితులు రైతులను పంటల బీమాకు దూరం చేసేలా కనిపిస్తున్నాయి. పంట రుణాలు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది రైతులు నష్టపోనున్నారు. పంట రుణం ఇవ్వకుంటే ప్రీమియం చెల్లించడమూ కష్టమేనని టెస్కాబ్ ఎండీ అంటున్నారు. రబీ సాగు లక్ష్యం 30.45 లక్షల ఎకరాలు కాగా.. అందులో ఆహారధాన్యాల సాగు లక్ష్యం 27.07 లక్షల ఎకరాలు. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.33 లక్షల ఎకరాలు. 3.70 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల పంటలు వేయాలని నిర్ణయించారు. రుణాలందకుంటే ఆ పంటలు సాగు చేసే అనేక మంది రైతులు ప్రీమియం చెల్లించక పరిహారం నష్టపోయే ప్రమాదముంది. వాతావరణం అనుకూలించక, ఇతరత్రా కారణాలతో పంటకు నష్టం జరిగితే బీమా అందుకునే అవకాశం ఉండదు. గడువు ముగిశాక రుణం ఇచ్చినా ప్రీమియం చెల్లించడానికి అవకాశం ఉండదు.
రుణాలివ్వడంలేదు: రాజు కారుకొండ, నవాబుపేట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
పోయిన ఏడాది మొక్కజొన్న, వరికి బీమా చేయించాను. అకాల వర్షాలు, వడగళ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నా నేటి వరకు బీమా డబ్బులు రాలేదు. మళ్లీ ఇన్సురెన్స్ ఎలా చేయించాలి? రబీకి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. పెట్టుబడులకు చేతిలో పైసల్లేవు.
ఈయన పేరు ఇందుర్తి రంగారెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామం. ఈ రబీ(యాసంగి)లో నాలుగున్నర ఎకరాల్లో మిరప సాగు చేశాడు. రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టాడు. కానీ బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికిప్పుడు రుణాలు ఇవ్వని బ్యాంకర్లు చెబుతుండటంతో బయట అప్పులు చేయాల్సి వస్తుందని ఆయన ఆవేదన చెందుతున్నాడు. బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో మిరప పంటకు ప్రీమియం చెల్లించే పరిస్థితి కూడా లేదని వాపోతున్నాడు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినా బ్యాంకులు తమ వద్ద నుంచి వడ్డీ సొమ్ము వసూలు చేస్తున్నారని చెబుతున్నాడు.