చలా‘మనీ’ అంతే(దే)నా? | This is manner of the districts about currency | Sakshi
Sakshi News home page

చలా‘మనీ’ అంతే(దే)నా?

Published Sat, Dec 31 2016 11:04 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

This is manner of the districts about currency

కష్టాలన్నీ 50 రోజుల తర్వాత తీరిపోతాయి... అప్పటివరకూ ఓపిక పట్టండి.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు..సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన చెప్పిన గడువు తీరిపోయింది. నూతన సంవత్సరం వచ్చేసింది. మరో రెండు వారాల్లో అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. కానీ నవంబర్‌ ఎనిమిదో తేదీ రాత్రి చేసిన రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన తర్వాత రోజు నుంచి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇప్పటికీ ఇంచుమించు అదే పరిస్థితి. కొత్త రూ.2000, రూ.500 నోట్లు జిల్లాకు నాలుగు విడతల్లో రూ.800 కోట్లు ఇప్పటి వరకూ వచ్చినప్పటికీ ప్రజలకు ముఖ్యంగా గ్రామాల్లో నగదు కష్టాలు తీరట్లేదు. చిల్లర చేతికి చిక్కలేదు.


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కరెన్సీ కష్టాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఇప్పటికీ ఏటీఎంలు పూర్తిగా పని చేయడం లేదు. దీంతో జనం అవస్థలు ఎదుర్కొంటున్నారు. పాతనోట్ల డిపాజిట్ల గడువు ఎలాగూ ముగిసిపోయింది. కానీ వ్యాపారుల నుంచి కొత్త నోట్ల డిపాజిట్లు మాత్రం ఆశించిన స్థాయిలో జరగట్లేదు. మిగతా ప్రజలు కూడా భవిష్యత్తు అవసరాల కోసం నగదు తమవద్దే అట్టేపెట్టుకుంటున్నారు. స్వైపింగ్‌ మెషిన్లు వారికి భరోసా ఇవ్వలేకపోతున్నాయి. కొత్త మెషిన్లు జిల్లాకు రాలేదు. దీంతో కొత్త సంవత్సరం, సంక్రాంతి నేపథ్యంలోనైనా లావాదేవీలు ఊపందుకోలేదు. చిల్లర కొరత ప్రభావం ఊపాధి రంగంపైనా తీవ్రంగానే ఉంది.

జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో 24 బ్యాంకులకు సంబంధించి 260 శాఖలున్నాయి. వాటి ఏటీఎంలు 294 మాత్ర మే ఉన్నాయి. కానీ ప్రజల నగదు అవసరాలను ఇవి ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. కొత్త కరెన్సీ రూ.2000, రూ.500 నోట్లు నాలుగు దఫాల్లో రూ.800 కోట్లు జిల్లాకు ఇప్పటివరకూ వచ్చాయి. బ్యాంకుల నుంచి విత్‌డ్రాలపై ఆంక్షలు 50 రోజులైనా కొనసాగుతున్నాయి. వారానికి రూ.24 వేలకు మించి తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఈ పరిమితికి లోబడి ఏటీఎంల నుంచి రోజుకు రూ.2,500 తీసుకోవచ్చని చెప్పినప్పటికీ ఎక్కువ ఏటీఎంల్లో రూ.2000 నోట్లే ఉండటంతో ఒక్క నోటు మాత్రమే చేతికి వస్తోంది. కొత్త రూ.500 నోట్లు ఇటీవల జిల్లాకు వచ్చినప్పటికీ కొన్ని బ్యాంకుల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు ఏటీఎంల్లోనే రూ.500 నోట్లు వస్తున్నాయి.

‘నగదురహితం’లో నగుబాటు
నగదు ఆధారిత లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నగదురహిత లావాదేవీల విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. కానీ జిల్లాలో నగదురహిత విధానం అమల్లో మాత్రం నవ్వుల పాలైందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు నాలుగు పురపాలక సంఘాలు, సుమారు 2,200 గ్రామాలు ఉన్నాయి. ఏజెన్సీలో పలుచోట్ల బ్యాంకులు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. నగదు విత్‌డ్రా కోసం ఖాతాదారులు గ్రామాల నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వస్తోంది. తీరా బ్యాంకుల వద్ద ‘నో క్యాష్‌’ బోర్డులు కనిపించేసరికి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చివరకు మైదాన ప్రాంతంలో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. పింఛను సొమ్ము కోసం బ్యాంకులకొచ్చి జిల్లాలో నలుగురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలోనే పింఛన్లు జనవరి నుంచి పాత విధానంలోనే చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇక ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త సంవత్సరంలోనూ బ్యాంకుల ముందు బారులు తీరక తప్పదనే సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. ఇలాంటి సమస్యలు తీర్చడానికే నగదురహిత విధానం తెచ్చామని ప్రభుత్వం తెచ్చినప్పటికీ అమలు విషయంలో ఆర్భాటమే మిగిలింది. శ్రీకాకుళంలో రైతుబజారు వద్ద తెరిచిన స్వైపింగ్‌ మెషిన్‌ ఒక్కరోజు ముచ్చటే అయ్యింది. ప్రతి ఆర్టీసీ బస్సులోనూ స్వైపింగ్‌ మెషిన్‌ అందుబాటులో ఉంచుతామని, బ్యాంకు ఆఫ్‌ బరోడా ద్వారా 430 మెషిన్లు తెప్పిస్తున్నామని అధికారులు చెప్పి మూడు వారాలు దాటింది. కానీ ఆర్టీసీలో పదికి మించి స్వైపింగ్‌ మెషిన్లు లేవు. 17 మద్యం దుకాణాలు, 8 బార్‌ల వద్ద మాత్రమే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) మిషన్లు ఉన్నాయి. విద్యుత్తు బిల్లుల చెల్లింపుల కోసం 50 స్వైపింగ్‌ మెషిన్లు వాడుతున్నారు. మండలానికి ఒకటి చొప్పున 38 డిజిటల్‌ గ్రామాలను ప్రకటించినప్పటికీ అక్కడా పూర్తిస్థాయిలో నగదురహిత విధానం అమలుకావట్లేదు.

పడిపోయిన వ్యాపారాలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత జిల్లాలో అన్ని రకాల వ్యాపారాలు పడిపోయాయి. సాధారణంగా క్రిస్మస్‌ పండుగ నుంచే వ్యాపారాలు ముఖ్యంగా వస్త్రాలు, బంగారం, కిరాణా సరుకుల వ్యాపారం జోరుగా సాగేది. ఈసారి సగానికి సగం తగ్గిపోయింది. నూతన సంవత్సరం వచ్చేసరికి నగదు చెలామణి పెరిగి వ్యాపారాలు ఊపందుకుంటాయని ఆశించిన వ్యాపారులకు ఆశాభంగమే అయ్యింది. ఈ సీజన్‌ ప్రారంభం నాటికే నగదు, ముఖ్యంగా చిల్లర నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని వ్యాపార సంఘాలు ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ అది ఆచరణలోకి రాలేదు.

రియల్‌ ఎస్టేట్‌ కుదేలు...
పెద్ద నోట్ల రద్దు, తదనంతరం నగదు లావాదేవీలపై ఆంక్షలు ప్రభావంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలైంది. దీంతో తాపీమేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. వ్యక్తిగత భవన నిర్మాణ పనులు చేసినా రూ.2000 నోట్లు ఇస్తుండటంతో చిల్లర కోసం కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.

స్తంభించిన ఉపాధి పనులు
ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు సాధారంగా సంక్రాంతికి తిరిగి స్వగ్రామాలు వస్తుంటారు. కానీ పెద్ద నోట్ల ప్రభావం వల్ల హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, నెల్లూరు, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో పనులు నిలిచిపోవడంతో వారంతా నెల రోజుల క్రితమే వెనక్కి వచ్చేశారు. మరోవైపు గ్రామాల్లో మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద పనులు కూడా తగినన్ని ప్రారంభం కాలేదు. తీరా పని చేసినా కూలీలకు వేతన చెల్లింపులకు నగదు సమస్య ఏర్పడుతోంది. దీంతో రోజువారీ అవసరాలు తీరక వారంతా ఇబ్బంది పడుతున్నారు.

రైతులు దిగాలు
సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. కానీ పెద్ద నోట్ల రద్దు ప్రభావం, ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడం, పంట చేతికొచ్చినా అమ్ముకోలేని వైనంతో జిల్లాలో రైతుల ఇంట ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్మేసినా రైతులకు చెల్లించేందుకు వారివద్ద తగినంత నగదు ఉండట్లేదు. కొంత మంది చెక్‌లు ఇచ్చినా బ్యాంకు ఖాతాలకే సొమ్ము పరిమితమవుతోంది. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇచ్చినా రైతులకు సొమ్ము చేతికందని పరిస్థితి.

ఇంకెన్నాళ్లీ కష్టాలు...
నోట్లను రద్దు చేసిన తర్వాత 50 రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఆచరణలో కనిపించట్లేదు. ప్రజలు నగదు కోసం ఇప్పటికీ బారులు తీరాల్సి వస్తోంది. మళ్లీ ఒకటో తేదీ వచ్చేస్తోంది. ఖాతాల్లో పడే జీతం డబ్బు తీసుకోవడానికి ఉద్యోగులు సహా అంతా ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement