2 లక్షల మంది మొబైల్ బ్యాంకు ఖాతా
- 80 వేల మంది ఈ–వాలెట్ వాడుతున్నారు
- నగదు రహితం వైపు అన్నదాత అడుగులు
- కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వెల్లడి
- రాష్ట్రంలోనూ ప్రోత్సహించాలని విన్నపం
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు అన్నదాత అడుగులు వేస్తున్నాడని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది. తెలంగాణలోనూ అటువైపుగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులను కోరింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా ఇబ్బంది కలుగకుండా రైతులు తమకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ను సమకూర్చుకోగలరని వివరించింది. రైతుల కోసం ఈ–బ్యాంకింగ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించింది. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరింది.
కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పట్టణ సహకార బ్యాంకుల్లో 2 లక్షల మంది రైతులు మొబైల్ బ్యాంకు ఖాతాలు తెరిచారు. మొబైల్ ఫోన్లలో సంబంధిత సహకార బ్యాంక్ యాప్ ద్వారానే ఈ రైతులంతా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. 80 వేల మంది రైతులు ఈ–వాలెట్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. తద్వారా తమకవసరమైన సరుకులు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేస్తున్నారు. ఈ రైతులంతా తమ గ్రామాలకు సమీపంలోని పట్టణాల్లో ఉంటూ నగదు రహితం వైపు మరలుతున్నారు.
వ్యవసాయ అనుబంధ కంపెనీల భాగస్వామ్యం
రైతులను నగదు రహిత లావాదేవీలవైపు నడిపించేందుకు వివిధ ఎరువులు, పురుగుమందుల కంపెనీలు, సహకార బ్యాంకులు కృషి చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయశాఖ పేర్కొంది. 15 వేల మంది రైతులకు నగదు రహిత లావాదేవీలపై 23 శిబిరాల్లో ఇఫ్కో శిక్షణ ఇచ్చింది. దీంతో 13 వేల మంది రైతులు కొత్తగా మొబైల్ బ్యాంక్ ఖాతాలు తెరిచారని వెల్లడించింది. ఆ కంపెనీ ద్వారా 65 మంది వ్యవసాయ అనుబంధ వ్యాపారం చేసేవారికి స్వైపింగ్ మిషన్లను అందజేశారు. ఇక క్రిబ్కో కంపెనీ దేశవ్యాప్తంగా 6 రైతు శిబిరాలు నిర్వహించింది. 2,750 మంది రైతులకు శిక్షణ ఇవ్వగా.. అందులో 1,020 మంది మొబైల్ బ్యాంక్‌లో ఖాతా తెరిచారు. మదర్ డెయిరీ 777 స్వైపింగ్ మిషన్లను అందజేసింది.
అమూల్, నాఫెడ్, ఐకార్, నాబార్డులు రైతులను నగదు రహితం వైపు మళ్లించడానికి కార్యక్రమాలు చేపట్టనున్నాయని కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోనూ నగదు రహిత లావాదేవీలవైపు రైతులను మరలించేం దుకు వ్యవసాయశాఖ కృషి ప్రారంభించింది. ఎరువులు, పురుగు మందు డీలర్లు స్వైపింగ్ మిషన్లను కొనుగోలు చేయాలని ఆ శాఖ కమిషనర్ జగన్ మోహన్ ఆదేశించారు. పది రోజుల కిందటే జిల్లా వ్యవసాయాధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. అప్పటికే 15 రోజుల్లోగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. దీనిపై జిల్లాల్లోనూ కదలిక వస్తోందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.