Central Department of Agriculture
-
సేంద్రియ సాగు ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పురుగు మందులు, ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు, కూరగాయలు విష పూరితంగా మారడంతో వినియోగదారులు సేంద్రియ ఆహార పదార్థాలను ఎంచుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఏడాదికేడాదికి సేంద్రియ పంటల సాగు పెరుగుతోంది. మూడేళ్లలో రెట్టింపునకు మించి సేంద్రియ పంటల సాగు పెరిగినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. 2019–20 ఏడాదిలో రాష్ట్రంలో 56,355 ఎకరాల్లో సేంద్రియ పంటలను సాగు చేయగా 2,294 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యాయి. 2020–21లో మాత్రం కాస్తంత తగ్గి 51,662 ఎకరాల్లో సాగవగా , 20,665 మెట్రిక్ టన్నుల సేంద్రియ పంటలు ఉత్పత్తి అయ్యాయి. ఇక 2021–22లో ఆర్గానిక్ పంటలు 1.32 లక్షల ఎకరాల్లో సాగవగా. 3,871 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. దేశంలో తెలంగాణ 12వ స్థానం: వివిధ రాష్ట్రాలతో పోలిస్తే సేంద్రియ సాగులో తెలంగాణ 12వ స్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. 2019– 20లో దేశంలో ఆర్గానిక్ పంటలు 73.54 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఆ ఏడాది 27 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఉత్పత్తులు పండాయి. 2020– 21లో 95 లక్షల ఎకరాల్లో ఆర్గానిక్ పంటల సాగు విస్తీర్ణం జరగ్గా, 34.68 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఆహార పదార్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఇక 2021–22లో సేంద్రియ పంటల సాగు పెరిగింది. ఆ ఏడాది ఏకంగా 1.47 కోట్ల ఎకరాల్లో ఆర్గానిక్ పంటల సాగు జరగ్గా, 34.10 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ పంట ఉత్పత్తి జరిగింది. అత్యధికంగా ఆర్గానిక్ పంటలు సాగు చేసే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 2021–22లో 42 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 29.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగైంది. మూడో స్థానంలో గుజరాత్ , నాల్గవ స్థానంలో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6.32 లక్షల ఎకరాలతో ఐదో స్థానంలో సేంద్రియసాగు చేస్తున్నటు వెల్లడించింది. -
కేన్సర్ కారక ‘గ్లైఫోసేట్’ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దేశంలో విచ్చలవిడిగా వినియోగంలో ఉన్న కలుపుమందు గ్లైఫోసేట్ను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మనుషులు, పశువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో దీని వాడకాన్ని కట్టడి చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇకపై గ్లైఫోసేట్ను పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్లు (పీసీఓ) తప్ప ఇతరులెవరూ ఉపయోగించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి దేశంలో గ్లైఫోసేట్ను కేవలం తేయాకు తోటల్లో కలుపు నివారణకే అమనుతివ్వగా పండ్ల తోటలు, ఇతర చోట్ల సైతం దాన్ని అక్రమంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, కేరళ సహా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ కలుపుమందును నిషేధించాయి. మరోవైపు గ్లైఫోసేట్ వాడకంపై నియంత్రణ సరిపోదని... దాన్ని పూర్తిగా నిషేధించాలని రైతాంగ నిపుణులు డిమాండ్ చేయగా ప్రత్యామ్నాయం చూపకుండా ఉన్నపళంగా గ్లైఫోసేట్ వాడకంపై నియంత్రణ విధిస్తే రైతులు అన్యాయమైపోతారని అధికారులు చెబుతున్నారు. గ్లైఫోసేట్‌తో కేన్సర్ ముప్పు... గ్లైఫోసేట్ వాడకం వల్ల పంటలు విషపూరితమై ప్రజలు కేన్సర్ బారినపడే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్సీ) 2015లో తేల్చింది. ఆ తర్వాత అమెరికా జరిపిన పరిశోధనల్లోనూ ఇదే విషయం నిర్ధారణ అయింది. అయితే తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో గ్లైఫోసేట్ వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. గత నాలుగైదు ఏళ్లుగా నిషేధిత బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణతోపాటు పండ్ల తోటలు, చెరువు గట్లు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కల పరిసరాల్లో కలుపును తొలగించేందుకు కూలీల కొరత కారణంగా దీన్ని రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. కంపెనీల లాబీయింగ్‌తోనే విచ్చలవిడి విక్రయాలు గ్లైఫోసేట్ వాడకంపై నామమాత్రపు నియంత్రణ చర్యలే తప్ప ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడంలేదు. నియంత్రణ సరిగా అమలు కాకపోతే ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కలుపుమందు విక్రయాల కోసం కంపెనీలు భారీగా లాబీయింగ్ జరుపుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాలు దాని వినియోగాన్ని తాత్కాలికంగా పరిమితం చేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం పెద్దగా ఉండదు. గ్లైఫోసేట్ బారిన పడిన వారికి నష్టపరిహారం చెల్లించాలి. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు -
Rythu Bharosa Kendralu: ఆర్బీకే ఓ అద్భుతం!
సాక్షి, అమరావతి, గన్నవరం/కంకిపాడు/ పెనమలూరు: వ్యవసాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శంగా వ్యవహరిస్తూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ నిపుణుల బృందం అభినందించింది. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయతగ్గవని, వాటిపై అధ్యయనం చేయాలని ఇతర రాష్ట్రాలకు సూచిస్తామని ప్రకటించింది. అంతర్జాతీయంగా ఖ్యాతి సాధించిన ఆర్బీకేల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతులందరికీ ఆ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిపుణుల బృందం రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. నిపుణుల బృందం బుధవారం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం, కంకిపాడు మార్కెట్ యార్డులోని వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్, వణుకూరులోని ఆర్బీకేని పరిశీలించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీసింది. రైతులను స్వయంగా పలుకరించి అభిప్రాయాలను తెలుసుకుంది. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై వ్యవసాయం, రైతు సంక్షేమంపై చర్చించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునే లక్ష్యంతో అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)తో భాగస్వామి అయ్యేందుకు అభ్యంతరం లేదన్నారు. నష్టపోతున్న రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ఫసల్ బీమా యోజనలో చక్కటి మోడల్ పొందుపర్చాలని సూచించారు. మోడల్ ఖరారు కాగానే కేంద్రంతో కలసి పాలు పంచుకుంటామన్నారు. కృష్ణాజిల్లా వణుకూరు ఆర్బీకే ద్వారా రైతులకు అందుతున్న సేవలను తెలుసుకుంటున్న కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ ఇలాంటివి ఎక్కడా చూడలేదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు అద్భుతమని, ఇలాంటి వ్యవస్థను ఇంతవరకు ఎక్కడా చూడలేదని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా ప్రశంసించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటైన అగ్రిల్యాబ్స్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. అగ్రిల్యాబ్స్‌లో నిర్వహిస్తున్న తనిఖీల ద్వారా విత్తనాలు, ఎరువుల్లో ఎక్కడైనా కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆ సమాచారాన్ని తమకు కూడా తెలియజేయాలని కోరారు. తద్వారా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రైతులను హెచ్చరించి కల్తీల బారినుంచి కాపాడుకోవచ్చన్నారు. పొలంబడి పేరుతో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు చాలా బాగున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీ వినియోగించుకుంటున్న తీరు అమోఘమన్నారు. ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుందని అహూజా ప్రశంసించారు. ఈ–క్రాపింగ్ ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారని, టెక్నాలజీని మిళితం చేసి రైతులకు చక్కటి ప్రయోజనాలు అందిస్తున్నారని చెప్పారు. రైతు క్షేత్రం (ఫామ్‌గేట్) వద్దే కొనుగోళ్లు, ఆర్బీకేల స్థాయిలోనే పంటల విక్రయం లాంటి కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు. కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం ద్వారా సీసీఆర్సీ కార్డులు జారీ చేయడాన్ని స్వాగతించారు. ఆర్బీకేల స్థాయిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ఏర్పాటు ఎంతో మంచి ఆలోచనన్నారు. సామాజిక తనిఖీల కోసం అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్న విధానం పారదర్శకంగా ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడినప్పుడు విద్యా రంగంలో ప్రభుత్వం తెచ్చిన మార్పులను సైతం తమతో పంచుకున్నారని పేర్కొంటూ విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కృషిని అభినందించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ మనోజ్ అహుజాకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాల్ సెంటర్, ఆర్బీకే, అగ్రిల్యాబ్‌ను సందర్శించిన బృందం నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు సాగులో ఆధునిక పరిజ్ఞానాన్ని గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటైన ఆర్బీకేలు నిజంగా గొప్ప ఆలోచన అని మనోజ్ అహూజా పేర్కొన్నారు. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను సందర్శించిన అనంతరం రైతు భరోసా కేంద్రం లైవ్ స్టూడియోను ఆయన పరిశీలించారు. టోల్ ఫ్రీ నంబర్ 155251 ద్వారా శాస్త్రవేత్తలు వెంటనే సలహాలు, సూచనలు అందిస్తుండటాన్ని ప్రశంసించారు. రైతులు ఫోన్ చేసినపుడు ఎలా స్పందిస్తున్నారు? ఎలాంటిæ సలహాలు ఇస్తున్నారు? అనే అంశాలను నిశితంగా గమనించారు. అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరులో ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించారు. పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయిస్తున్నట్లు పలువురు రైతులు కేంద్ర బృందానికి తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ధాన్యం కొనుగోలు తదితర సేవలు అందుతున్నాయన్నారు. గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సీఎం జగన్ ఆర్బీకేలను ఏర్పాటు చేసిన తరువాత రైతుల కష్టాలు తీరాయని చెప్పారు. కియోస్క్ ద్వారా రైతులే స్వయంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించడాన్ని బృందం పరిశీలించింది. ఆర్బీకేలకు ఐఎస్ఓ నాణ్యత ప్రమాణ పత్రం లభించడం ఉత్తమ పనితీరుకు నిదర్శనమని బృందం సభ్యులు పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే రైతు భరోసా రథం. వెటర్నరీ మొబైల్ వాహనాన్ని సైతం పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు. అక్కడ నుంచి కంకిపాడు చేరుకుని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను పరిశీలించారు. పైసా ఖర్చు లేకుండా ఇన్‌పుట్స్‌ను ముందుగానే పరీక్షించుకుని కల్తీల బారిన పడకుండా ధైర్యంగా సాగు చేస్తున్నట్లు రైతులు వెల్లడించారు. మట్టి నమూనాల పరీక్షలు, విత్తన సేకరణ, నాణ్యత పరిశీలనపై ల్యాబ్ సిబ్బందిని బృందం అడిగి తెలుసుకుంది. కేంద్ర బృందం సభ్యులైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్‌కరన్‌లతో పాటు వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఆర్బీకేల జేడీ శ్రీధర్ కార్యక్రమంలో పొల్గొన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్‌కు జ్ఞాపిక అందిస్తున్న సీఎం రైతులకు గరిష్ట ప్రయోజనం అందాలి: సీఎం కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో పాటు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. కనీస మద్దతు ధర దక్కని సందర్భాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయడం ఎంతో బాగుందని, ఈ పథకం పీఎంఎఫ్‌బీవైతో భాగస్వామిగా మారితే మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అహూజా సూచించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే రైతులకు గరిష్ట ప్రయోజనాలతో మంచి మోడల్ రూపొందించాలని సూచించారు. -
బీమా పరిధిలోకి 40 శాతం పంటలు
సాక్షి, హైదరాబాద్: పంటల బీమాను రైతులకు మరింత చేరువ చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) ద్వారా మరింత పరిహా రం అందేలా చర్యలు చేపడుతున్నామని.. అందులో భాగంగా 2017–18 వ్యవసా య సీజన్లో బీమా కవరేజీ 40 శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది. అలాగే 2018–19 నాటికి 50 శాతానికి చేరుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీలో రెండ్రోజులపాటు జరిగిన రాష్ట్రాల వ్యవసాయ ఉన్నతాధికారుల సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది నుంచి బీమాకు ఆధార్‌ను అనుసం ధానం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2016–17 ఖరీఫ్‌లో 6.70 లక్షల మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. మొత్తం 14.47 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా చేశారు. అంటే 15 శాతం సాగు భూమికి మాత్రమే బీమా చేయించినట్లయింది. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పత్తికి ప్రీమియం చెల్లించే గడువును జూలై 15వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంలో ఈ గడువు జూన్ 14 వరకే ఉండేది. ఇక ఇతర పంటలకు జూలై 31ని, వరికి ఆగస్టు 31ని ప్రీమియం చెల్లింపు గడువుగా నిర్ణయించారు. -
2 లక్షల మంది మొబైల్ బ్యాంకు ఖాతా
- 80 వేల మంది ఈ–వాలెట్ వాడుతున్నారు - నగదు రహితం వైపు అన్నదాత అడుగులు - కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వెల్లడి - రాష్ట్రంలోనూ ప్రోత్సహించాలని విన్నపం సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు అన్నదాత అడుగులు వేస్తున్నాడని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది. తెలంగాణలోనూ అటువైపుగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులను కోరింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా ఇబ్బంది కలుగకుండా రైతులు తమకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ను సమకూర్చుకోగలరని వివరించింది. రైతుల కోసం ఈ–బ్యాంకింగ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించింది. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరింది. కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పట్టణ సహకార బ్యాంకుల్లో 2 లక్షల మంది రైతులు మొబైల్ బ్యాంకు ఖాతాలు తెరిచారు. మొబైల్ ఫోన్లలో సంబంధిత సహకార బ్యాంక్ యాప్ ద్వారానే ఈ రైతులంతా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. 80 వేల మంది రైతులు ఈ–వాలెట్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. తద్వారా తమకవసరమైన సరుకులు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేస్తున్నారు. ఈ రైతులంతా తమ గ్రామాలకు సమీపంలోని పట్టణాల్లో ఉంటూ నగదు రహితం వైపు మరలుతున్నారు. వ్యవసాయ అనుబంధ కంపెనీల భాగస్వామ్యం రైతులను నగదు రహిత లావాదేవీలవైపు నడిపించేందుకు వివిధ ఎరువులు, పురుగుమందుల కంపెనీలు, సహకార బ్యాంకులు కృషి చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయశాఖ పేర్కొంది. 15 వేల మంది రైతులకు నగదు రహిత లావాదేవీలపై 23 శిబిరాల్లో ఇఫ్కో శిక్షణ ఇచ్చింది. దీంతో 13 వేల మంది రైతులు కొత్తగా మొబైల్ బ్యాంక్ ఖాతాలు తెరిచారని వెల్లడించింది. ఆ కంపెనీ ద్వారా 65 మంది వ్యవసాయ అనుబంధ వ్యాపారం చేసేవారికి స్వైపింగ్ మిషన్లను అందజేశారు. ఇక క్రిబ్కో కంపెనీ దేశవ్యాప్తంగా 6 రైతు శిబిరాలు నిర్వహించింది. 2,750 మంది రైతులకు శిక్షణ ఇవ్వగా.. అందులో 1,020 మంది మొబైల్ బ్యాంక్‌లో ఖాతా తెరిచారు. మదర్ డెయిరీ 777 స్వైపింగ్ మిషన్లను అందజేసింది. అమూల్, నాఫెడ్, ఐకార్, నాబార్డులు రైతులను నగదు రహితం వైపు మళ్లించడానికి కార్యక్రమాలు చేపట్టనున్నాయని కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోనూ నగదు రహిత లావాదేవీలవైపు రైతులను మరలించేం దుకు వ్యవసాయశాఖ కృషి ప్రారంభించింది. ఎరువులు, పురుగు మందు డీలర్లు స్వైపింగ్ మిషన్లను కొనుగోలు చేయాలని ఆ శాఖ కమిషనర్ జగన్ మోహన్ ఆదేశించారు. పది రోజుల కిందటే జిల్లా వ్యవసాయాధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. అప్పటికే 15 రోజుల్లోగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. దీనిపై జిల్లాల్లోనూ కదలిక వస్తోందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. -
‘పాల ఉత్పత్తిలో మనమే టాప్’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పాల ఉత్పత్తిలో గత 15 ఏళ్లుగా భారత్ అగ్రగామిగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. శ్వేత విప్లవ ఆద్యుడు డాక్టర్ కురియన్ జయంతి సందర్భంగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన ‘జాతీయ పాల దినోత్సవం’లో ఆయన పాల్గొన్నారు. పాల ఉత్పత్తిలో గత రెండేళ్లలో దేశం 6.28 శాతం వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. 2012 లెక్కల ప్రకారం ప్రపంచలోని 13 శాతం పశుసంపద భారత్‌లోనే ఉందని చెప్పారు. దేశీయ పశుసంపదను పరిరక్షించడానికి, డైరీల అభివృద్ధికి ప్రభుత్వం ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. దేశీయ ఆవులు, గేదెల నుంచి లభించే ఏ2 రకం పాలు వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయని, వీటికి విడిగా మార్కెటింగ్ చేపట్టాలని అభిప్రాయపడ్డారు. పశువుల కొనుగోళ్లు, అమ్మకాలకు ‘ఈ-క్యాటిల్ హాట్’ అనే పోర్టల్‌ను ప్రారంభించారు. -
కూరగాయల్లో కాలకూటం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆహార పంటలపై విచ్చలవిడిగా పురుగు మందుల వాడకం - కూరగాయలు, పండ్లపై పురుగు మందు అవశేషాల్లో దేశంలోనే నంబర్ వన్ - పంటలపై యథేచ్ఛగా నిషిద్ధ పురుగు మందుల పిచికారి - ఎన్ఐపీహెచ్ఎం, వ్యవసాయవర్సిటీ పరిశోధనల్లో వెల్లడైన చేదు వాస్తవాలు ఆహా ఏమి రుచి.. అంటూ వంకాయ ఫ్రైని ఆబగా ఆరగిస్తున్నారా? టమాట, బీరకాయ, బెండకాయ కూరల్ని లొట్టలేసుకుంటూ తింటున్నారా? హెల్త్‌కు మంచిదని పండ్లను తీసుకుంటున్నారా? ఆగండి ఆగండి..! ఆ కూరగాయలు, పండ్లలో కాలకూటం ఉండొచ్చు. అతి ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలు ఉండొచ్చు. ఆ విష రసాయనాలు.. భేషుగ్గా ఉన్న మిమ్మల్ని ఆసుపత్రి బెడ్ వరకు తీసుకెళ్లొచ్చు!! అవును మరి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే నెలకొన్నారుు. మార్కెట్లకు వస్తున్న కాయగూరల నుంచి పండ్ల దాకా వేటిపై చూసినా పురుగు మందుల అవశేషాలు కనిపిస్తున్నారుు. ఆహార పంటలపై విచ్చలవిడిగా పురుగు మందుల వాడకంలో తెలుగు రాష్ట్రాలు ‘రెడ్‌లైన్’ దాటేశారుు. ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారుు. దేశ సగటు కంటే దాదాపు రెట్టింపు పురుగు మందుల అవశేషాలు మన రాష్ట్రాల్లోని పండ్లు, కాయగూరల్లో నమోదయ్యారుు. ఇది ఆందోళన కలిగించే అంశమని వైద్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. విచ్చలవిడిగా పురుగు మందుల వాడకం.. దేశవ్యాప్తంగా ఆహార పంటలపై పురుగు మందుల అవశేషాలను గుర్తించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ 2006 నుంచి ప్రతి నెలా దేశంలోని ప్రధాన నగరాల్లోని 25 ల్యాబోరేటరీల్లో పరీక్షలు నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో రైతులు, మార్కెట్లు, సేంద్రీయ మార్కెట్లు, పాలీ హౌజ్‌ల నుంచి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సేకరించి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ కేంద్రం(ఎన్ఐపీహెచ్ఎం), ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయవర్సిటీలో ఈ పరీక్షలు జరుగుతారుు. ఈ కేంద్రాలు వేర్వేరుగా నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో నేరుగా రైతుల వద్ద(ఫార్మ్ గేట్), రైతు బజార్లు, ఇతర మార్కెట్లలో ఆహార పంటలను కొనుగోలు చేసి పరిశోధనలు చేసి, వాటి ఫలితాలను కేంద్రానికి పంపుతారుు. 2013 -14, 2014 -15 లతో పోలిస్తే.. 2015 -16లో తెలంగాణ, ఏపీలో మార్కెట్లకు వస్తున్న కాయగూరలు, ఆకుకూరలు, పండ్లపై పురుగు మందుల అవశేషాలు విపరీతంగా పెరిగాయి. మందుల్లో మనమే నంబర్ 1 రైతు బజార్లు, సాధారణ మార్కెట్లలో అత్యధిక పురుగు మందుల అవశేషాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో తెలంగాణ, ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారుు. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో కర్ణాటక, నాలుగో స్థానంలో తమిళనాడు రాష్ట్రాలున్నారుు. షాపింగ్ మాల్స్, ఆర్గానిక్ స్టోర్లలో అమ్మే సేంద్రియ కూరగాయల్లో కూడా పరిమితికి మించి పురుగు మందుల అవశేషాలు ఉంటున్నారుు. ఇందులో కూడా తెలంగాణ, ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో కర్ణాటక ఉంది. ఇక పెస్టిసైడ్‌స అవశేషాలున్న పండ్ల విషయంలో తెలంగాణ తొలి స్థానంలో, ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నారుు. కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహార పంటలపై రైతులు నిషిద్ధ పురుగు మందులను సైతం వాడేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లోని మలక్‌పేట, దిల్సుఖ్నగర్, కొత్తపేట, హయత్‌నగర్, ఎల్బీనగర్లో రైతులు, మార్కెట్ల నుంచి ఎన్ఐపీహెచ్ఎం సేకరించిన టమాటో శాంపిళ్లలో ‘ట్రైజోఫాస్’ పురుగు మందు అవశేషాలను గుర్తించారు. ఈ మందును కేవలం పత్తి, వరి, సోయాబీన్‌పై తెల్లదోమ నివారణకే వినియోగించాలి. ఈ ఏడాది జూన్‌లో మైలార్దేవులపల్లి, బుద్వేల్, హైదర్‌గూడ, గుడిమల్కాపూర్, మెహిదీపట్నంలో సేకరించిన శాంపిళ్లలోనూ ట్రైజోఫాస్ అవశేషాలు కనిపించారుు. ఆకు కూరలపై నిషేధిత మిథేల్ పారాథియాన్తో పాటు అన్ని పంటలపై నిషేధించిన మోనోక్రోటోఫాస్ అవశేషాలను భారీ స్థారుులో నిర్ధారించారు. వాస్తవానికి పంటపై పురుగు మందులు పిచికారి చేసిన వారం నుంచి పది రోజుల తర్వాతే వాటిని మార్కెట్లో విక్రరుుంచాలి. కానీ పిచికారి చేసిన రెండు నుంచి నాలుగు రోజుల్లోనే మార్కెట్లకు తెస్తున్నారు. కేన్సర్‌కు గురవుతున్నారు పంటలపై వాడే పురుగు మందుల ప్రభావం తీవ్రంగా ఉంది. పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రాంత రైతులు ఆరోగ్యంగా ఉంటారు. కానీ వారే ఎక్కువగా కేన్సర్‌కు గురవుతున్నారు. డీడీటీ, ఆర్గనోఫాస్పరస్, ఆర్సెనిక్ వంటి పురుగుమందులు కేన్సర్ కారకాలుగా ఉన్నారుు. అమెరికా జాతీయ కేన్సర్ సంస్థ కూడా పురుగు మందులతో కేన్సర్లు పెరుగుతున్నట్టు వెల్లడించింది. - డా.రమేశ్ మాటూరి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎంఎన్‌జే హాస్పిటల్ శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి -
సాగు ఖర్చు తగ్గింపునకు మార్గదర్శకాలు
రాష్ట్రాలకు పంపిన కేంద్ర వ్యవసాయశాఖ - వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని సూచన - సన్న, చిన్నకారు రైతులకు సకాలంలో రుణాలు - వర్షాభావ ప్రాంతాల్లో వరి ఉత్పత్తి, ఉత్పాదకతలపై ప్రత్యేక దృష్టి సాక్షి, హైదరాబాద్: పంటల సాగు ఖర్చు తగ్గింపుపై కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. రైతు సంక్షేమం దృష్ట్యా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. సాగు ఖర్చు పెరగడం వల్లే రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారని, అందువల్ల వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలు పంపింది. భూసార కార్డుల ఆధారంగా ఎరువులను, సేంద్రియ ఎరువులను వాడేవిధంగా రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల అనవసర ఎరువుల వాడకం తగ్గి సాగు ఖర్చు తగ్గుతుంది. సాగునీటి యాజ మాన్య పద్ధతులు పాటించాలి. సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించాలి. రైతులకు సకాలంలో రుణాలు అందేలా చూడాలి. కౌలురైతులకూ రుణాలు అందజేయాలి. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని, దీనివల్ల సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. అందుకోసం కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి రైతులకు తక్కువ అద్దెకు వ్యవసాయ యంత్రాలను సరఫరా చేయాలని స్పష్టం చేసింది. వచ్చే ఖరీఫ్ నుంచి అమలయ్యే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)పై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. కేంద్ర వ్యవసాయశాఖ మార్గదర్శకాలివే... ► పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలంటే తక్కువ కాలపరిమితి వరి రకాలను ప్రోత్సహించాలి. ఒకే సీజన్లో రెండు రకాల పంటలను సాగు చేయవచ్చు. ► జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతుక్షేత్రాల్లో నీటి కుంటలను తవ్వించాలి. ► వర్షాభావ ప్రాంతాలు, వరదలు వచ్చే ప్రాంతాల్లో వరి ఉత్పత్తి, ఉత్పాదకతలపై దృష్టి సారించాలి. వరదల్లో మునిగిపోయినా తట్టుకోగలిగే వరి విత్తన రకాలను రైతులకు అందించాలి. ► తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. ► ఉద్యానవన సాగులో హైబ్రీడ్ టెక్నాలజీని ప్రోత్సహించాలి. ► ఉద్యాన పంటల్లో సూక్ష్మ పోషకాలను ప్రోత్సహించాలి. ► గడ్డిసాగును ప్రోత్సహించాలి. బై బ్యాక్ పద్ధతిన రైతుల నుంచి కొనాలి. ► రైతుల వద్దకు మొబైల్ వెటర్నరీ సేవలను అందించాలి. తద్వారా వారి పశువుల ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వాలి. -
‘ములుగు’ వర్సిటీకి రూ.1831 కోట్లు
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడి గజ్వేల్: మెదక్ జిల్లా ములుగులో నిర్మించనున్న హార్టికల్చర్ యూనివర్సిటీకి రూ. 1831 కోట్లు వెచ్చించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం ములుగులో వర్సిటీ ఏర్పాటు కోసం భూములను పరిశీలించారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు.. వర్సిటీకి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ నిర్మాణానికి కేంద్రం గత యేడాది రూ. 10 కోట్లు, ఈ యేడు రూ.75 కోట్లు విడుదల చేసిందన్నారు. నిధులు సరిపోవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడంతో మరో రూ.200 కోట్ల విడుదలకు అంగీకరించారని చెప్పారు. వర్సిటీకి ఇప్పటి వరకు 112 ఎకరాలను సేకరించామని తెలిపారు. తెలంగాణ కోసం పనిచేసిన త్యాగధనుల పేరుతో వర్సిటీలకు నామకరణం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 8 కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఒక్కో కోల్డ్స్టోరేజీకి రూ.8 కోట్లు వెచ్చిస్తామన్నారు. సీఎం డ్రిప్ పథకానికి అదనంగా మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.