‘ములుగు’ వర్సిటీకి రూ.1831 కోట్లు
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడి
గజ్వేల్: మెదక్ జిల్లా ములుగులో నిర్మించనున్న హార్టికల్చర్ యూనివర్సిటీకి రూ. 1831 కోట్లు వెచ్చించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం ములుగులో వర్సిటీ ఏర్పాటు కోసం భూములను పరిశీలించారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు.. వర్సిటీకి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ నిర్మాణానికి కేంద్రం గత యేడాది రూ. 10 కోట్లు, ఈ యేడు రూ.75 కోట్లు విడుదల చేసిందన్నారు. నిధులు సరిపోవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడంతో మరో రూ.200 కోట్ల విడుదలకు అంగీకరించారని చెప్పారు.
వర్సిటీకి ఇప్పటి వరకు 112 ఎకరాలను సేకరించామని తెలిపారు. తెలంగాణ కోసం పనిచేసిన త్యాగధనుల పేరుతో వర్సిటీలకు నామకరణం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 8 కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఒక్కో కోల్డ్‌స్టోరేజీకి రూ.8 కోట్లు వెచ్చిస్తామన్నారు. సీఎం డ్రిప్ పథకానికి అదనంగా మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.