సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పురుగు మందులు, ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు, కూరగాయలు విష పూరితంగా మారడంతో వినియోగదారులు సేంద్రియ ఆహార పదార్థాలను ఎంచుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఏడాదికేడాదికి సేంద్రియ పంటల సాగు పెరుగుతోంది. మూడేళ్లలో రెట్టింపునకు మించి సేంద్రియ పంటల సాగు పెరిగినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది.
2019–20 ఏడాదిలో రాష్ట్రంలో 56,355 ఎకరాల్లో సేంద్రియ పంటలను సాగు చేయగా 2,294 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యాయి. 2020–21లో మాత్రం కాస్తంత తగ్గి 51,662 ఎకరాల్లో సాగవగా , 20,665 మెట్రిక్ టన్నుల సేంద్రియ పంటలు ఉత్పత్తి అయ్యాయి. ఇక 2021–22లో ఆర్గానిక్ పంటలు 1.32 లక్షల ఎకరాల్లో సాగవగా. 3,871 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది.
దేశంలో తెలంగాణ 12వ స్థానం: వివిధ రాష్ట్రాలతో పోలిస్తే సేంద్రియ సాగులో తెలంగాణ 12వ స్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. 2019– 20లో దేశంలో ఆర్గానిక్ పంటలు 73.54 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఆ ఏడాది 27 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఉత్పత్తులు పండాయి. 2020– 21లో 95 లక్షల ఎకరాల్లో ఆర్గానిక్ పంటల సాగు విస్తీర్ణం జరగ్గా, 34.68 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఆహార పదార్థాలు ఉత్పత్తి అయ్యాయి.
ఇక 2021–22లో సేంద్రియ పంటల సాగు పెరిగింది. ఆ ఏడాది ఏకంగా 1.47 కోట్ల ఎకరాల్లో ఆర్గానిక్ పంటల సాగు జరగ్గా, 34.10 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ పంట ఉత్పత్తి జరిగింది. అత్యధికంగా ఆర్గానిక్ పంటలు సాగు చేసే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 2021–22లో 42 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 29.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగైంది. మూడో స్థానంలో గుజరాత్ , నాల్గవ స్థానంలో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6.32 లక్షల ఎకరాలతో ఐదో స్థానంలో సేంద్రియసాగు చేస్తున్నటు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment