సాక్షి సాగుబడి తరఫున వెంకయ్య నుంచి పురస్కారం అందుకుంటున్న పంతంగి రాంబాబు.చిత్రంలో వై. వెంకటేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం ప్రజాఉద్యమంగా మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రైతులు, వినియోగదారులు, ప్రభుత్వాలు, మీడియాసహా సమాజంలో అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం సంయుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఆదివారం రైతునేస్తం మాసపత్రిక 18వ వార్షికోత్సవంలో పలువురికి ‘పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు రైతునేస్తం’పురస్కా రాలను ప్రదానం చేశారు.
పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని వెంకయ్య సూచించారు. ప్రజలకు ఆరోగ్యం, రైతుకు రాబడి సేంద్రీయ సాగుతోనే సాధ్యమవుతుందన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు మంచి తరుణం ఇదేనని, రైతులతోపాటు అధికారులు, శాస్త్రవేత్తలు ఈ దిశగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. మనదేశంలో రైతులకు అందించే ప్రోత్సాహకాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. కరోనా సమయంలో కూడా మన ఆహార అవసరాలను తీర్చగలిగిన రైతులను రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
పురస్కారాల ప్రదానం
నాబార్డు మాజీ చైర్మన్ చింతల గోవిందరాజులుకు జీవిత సాఫల్య పురస్కారం, డా. వై.ఎస్.ఆర్. విశ్వవిద్యాల యం వైస్ చాన్సలర్ డాక్టర్ టి.జానకిరామ్‌కు ‘కృషిరత్న’ బిరుదు, అహ్మదాబాద్‌కి చెందిన ‘గోకృపామృతం’ రూపశిల్పి గోపాల్‌భాయ్ సుతారియాను ‘గోపాలరత్న’బిరుదు తో సత్కరించారు. 16 మంది అభ్యుదయ రైతులకు, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశేష కృషిచేసిన 10 మంది శాస్త్రవేత్తలకు, విస్తరణకు కృషి చేసిన 11 మందికి, అగ్రిజర్నలిజం విభాగంలో ఐదుగురికి రైతునేస్తం పురస్కారాలు ప్రదానం చేశారు.
‘సాక్షి సాగుబడి’తరఫున సీనియర్ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబు పురస్కారాన్ని అందుకు న్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కామి నేని శ్రీనివాసరావు, నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల, ‘నార్మ్’డెరైక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment