Organic crop
-
విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన
దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం.. దాదాపు 17 ఏళ్లు పనిచేసిన అనుభవం.. ఉద్యోగానికి రాజీనామా.. ఏదైనా ఐటీ కంపెనీ స్థాపిస్తాడేమోనని అనుకుంటాం. కానీ వ్యవసాయం ప్రారంభించాడు. ఏటా ఏకంగా రూ.205 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఏ పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాడు? అంత సంపాదన ఎలా సాధ్యమైందో ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన శశికుమార్ 17 ఏళ్లపాటు ఐటీరంగంలో సేవలందించారు. అందులో 13 ఏళ్లు దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ విప్రోలో విధులు నిర్వర్తించారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయానికి మాత్రం ప్రత్యామ్నాయం లేదని గ్రహించారు. రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, సేంద్రియ ఆహారం అందించాలని భావించారు. దాంతో ఆర్గానిక్ పద్ధతులతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తను చేస్తున్న ఉద్యోగం మానేశారు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పడంతో వారూ తనకు సహాయం అందించారు. దాంతో 2010లో 9 మంది మిత్రులు కలిసి అక్షయకల్ప ఆర్గానిక్‌ని ప్రారంభించారు. శశికుమార్ మొదట్లో కేవలం ముగ్గురు రైతులతో పాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే అక్షయకల్ప ఆర్గానిక్ నిర్వాహకులు పాలతో ఆగకుండా.. సేంద్రియ కూరగాయలు, పండ్లను పండించడం ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని ప్రజలకు ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరిస్తూ వారికి చేరువవుతున్నారు. ఆర్గానిక్ పద్ధతులతో పండిస్తున్న రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. రైతుల ఆదాయాలను పెంచుతున్నారు. ప్రస్తుతం అక్షయకల్ప ఆర్గానిక్ ద్వారా పాలఉత్పత్తిలో భాగంగా 700 మంది రైతులు సహకారం అందిస్తున్నారు. దాదాపు 60,000 లీటర్ల సేంద్రియ పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు శశికుమార్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో మార్కెటింగ్ సేవలందించేందుకు 500 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారు. సేంద్రియ పాలపై మొదట్లో వినియోగదారులకు అవగాహన కల్పించడం పెద్ద సవాలుగా మారిందని శశికుమార్ తెలిపారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తన స్నేహితులు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఇటీవల రూ.10 కోట్లతో కొత్త డెయిరీ ప్లాంట్ ప్రారంభించామన్నారు. దాని ద్వారా రోజుకు లక్ష లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: 11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత సేంద్రియ కూరగాయలు, పండ్ల వ్యాపారం గతంలో కంటే మెరుగవుతుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్ప ఆర్గానిక్ స్టార్టప్ రూ.205 కోట్లు ఆర్జించింది. 2023-24లో ఆదాయం మరో 25 శాతం పెరుగుతుందని శశి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ 5 వేల గ్రామాలు, 5 వేల మంది రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. -
ఇంట్లోనే ఎరువు.. ఇలా చేస్తే మొక్కలు పచ్చగా కళకళలాడుతాయి
హోమ్మేడ్ ఎరువు ►గ్లాసు నీటిలో గుప్పెడు బియ్యం, స్పూను వంటసోడా వేసి కలపాలి. తరువాత అర టీస్పూను వెనిగర్ కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్ప్రే బాటిల్లో పోయాలి. జీవం కోల్పోయిన మొక్కలపై ఈ ద్రావణాన్ని చిలకరిస్తే.. మొక్కలు పచ్చగా కళకళలాడతాయి. ► ఉల్లిపాయ ముక్కలను నానబెట్టిన నీటిని మొక్కలకు పోస్తే మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తుంది. వెనిగర్ కలిపిన నీళ్లు, సోయాబీన్ నీళ్లు, బీరు కలిపిన నీళ్లు కూడా మొక్కలకు బలాన్ని అందించి చక్కగా పెరిగేలా చేస్తాయి. ► కప్పు వేడినీటిలో స్పూను పంచదార, స్పూను వంట సోడా, స్పూను వెనిగర్ వేసి కలపాలి. కప్పు మీద మూత పెట్టి ఉంచాలి. 48 గంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోస్తే వేళ్లకు బలం అంది మొక్కలు చక్కగా పెరుగుతాయి. -
అధిక పోషక విలువలు కలిగిన దొండ..!
-
క్రమక్రమంగా పెరుగుతున్న సేంద్రియ రైతుల సంఖ్య...!
-
నేల సాగు కన్నా బ్యాగు సేద్యం మిన్న!
సేంద్రియ కూరగాయ పంటలను పొలంలో సాధారణ పద్ధతిలో నేలలో కన్నా.. ప్రత్యేకమైన బ్యాగుల్లో సాగు చేయటం ద్వారా రెట్టింపు కన్నా ఎక్కువగా దిగుబడి తీయవచ్చని తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య సేంద్రియ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి–జూలై నెలల మధ్య ప్రయోగాత్మక సాగులో రుజువైంది. ఈ పంటల సాగును శాస్త్రవేత్తలు ఆసాంతమూ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి, శాస్త్రీయంగా గణాంకాలను నమోదు చేశారు. నగరాలు, పట్టణాలకు దగ్గల్లోని భూసారం అంతగా లేని భూముల్లో, రసాయనాలతో కలుషితమైన లేదా చౌడు తదితర సమస్యాత్మక భూముల్లో బ్యాగు సేద్యం ద్వారా పెద్ద ఎత్తున సేంద్రియ కూరగాయల ఉత్పత్తి పొందడానికి, తద్వారా అన్‌సీజన్‌లో రైతులు అధికాదాయం పొందడానికి అవకాశం ఉన్నట్లు ఈ ప్రయోగం ద్వారా వెల్లడైందని కేవీకే అధ్యక్షుడు టి. వినోద్‌రావు తెలిపారు. సేంద్రియ రైతు శాస్త్రవేత్త ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు మార్గదర్శకత్వంలో కేవీకే శాస్త్రవేత్తల బృందం బ్యాగు సాగులో అద్భుత దిగుబడులు రాబడుతోంది. ఎత్తు బెడ్లపై సేంద్రియ కాకర సాగు కాకరను వేసవి పంటగా నేలపై ఎత్తు బెడ్లపై ఏక పంటగా సాగు చేయగా.. ఎకరానికి 4,480 కిలోల (4.48 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. తునికి కేవీకే ప్రాంగణంలోని 12.5 సెంట్ల భూమి (0.125 ఎకరం)లో సాధారణ పందిరి పద్ధతిలో 1,000 కాకర విత్తనాలను ఎత్తయిన బెడ్లపై ఫిబ్రవరి 25న విత్తారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో బిందు సేద్యం ద్వారా పండించారు. పంట కోత ఏప్రిల్ 17 నుంచి జూలై12 వరకు కాకర కాయలు కోశారు. ఈ వెయ్యి మొక్కల నుంచి∙560.5 కిలోల దిగుబడి వచ్చింది. ఒక్కో మొక్క నుంచి 0.56 కిలోల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. ఎత్తు బెడ్స్ పద్ధతిలో సగటున ఎకరానికి 4,480 కిలోల కాకర దిగుబడి రాగా, సగటున ఎకరానికి రూ. 1,92,000 ఖర్చయినట్లు (కౌలు కాకుండా) శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. బ్యాగుల్లో కాకర సాగు పక్క పొలంలోనే ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకర పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయగా.. సగటున ఎకరానికి 8,000 కిలోల (8 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. 25 సెంట్ల భూమిలో 2023 ఫిబ్రవరి 2న 616 బ్యాగుల్లో, ఒక్కో బ్యాగులో రెండు చొప్పున, కాకర విత్తనాలను పెట్టి, మొక్కలను పందిరికి పాకించారు. విత్తిన 70 రోజులకు మొదలై 175 రోజుల (జూలై 25) వరకు కాయలు కోశారు. మొత్తం 2 టన్నుల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. సగటున ఎకరానికి 8 టన్నుల కాకర దిగుబడి వచ్చింది. బ్యాగుల్లో కాకర సాగుకు సగటున ఎకరానికి (కౌలు కాకుండా) రూ. 2,40,000 ఖర్చయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాకరతో పాటు.. అదే పొలంలో టొమాటో, పుదీనా, క్యాబేజీ కూడా.. ఎత్తు బెడ్ల సాగులో కాకర ఒక్కటే పంట సాగు చేయగా, బ్యాగు సాగులో కాకరతో పాటు మరికొన్ని బ్యాగుల్లో టొమాటో, పుదీనా, క్యాబేజీ పంటలు కూడా సాగు చేశారు. ఈ పంటల ద్వారా 3,640 కిలోల(3.64 టన్నులు/ఎకరం) దిగుబడి అదనంగా రావటం విశేషం. 25 సెంట్ల భూమిలో మొత్తం 1,566 బ్యాగులు పెట్టారు. అందులో 616 బ్యాగుల్లో రెండేసి కాకర మొక్కలు (2 టన్నుల దిగుబడి), 410 బ్యాగుల్లో రెండేసి క్యాబేజీ మొక్కలు (374 కిలోల దిగుబడి), 180 బ్యాగుల్లో రెండేసి టొమాటో మొక్కలు పెట్టారు. మరో 360 బ్యాగుల్లో ఒక్కోటి చొప్పున టొమాటో, పుదీనా మొక్కలు కలిపి నాటారు. మొత్తం 453 కిలోల టొమాటోలు, 83.6 కిలోల పుదీనా దిగుబడి వచ్చింది. బ్యాగుల్లో సేంద్రియ సాగు ఇలా.. అడుగున్నర ఎత్తు, అడుగు వెడల్పు ఉండే పాలిథిన్ బ్యాగులో 15 కిలోల పశువుల ఎరువు, 15 కిలోల ఎర్రమట్టి, 100 గ్రా. వేపపిండి కలిపిన మిశ్రమాన్ని నింపారు. జీవామృతం ప్రతి 10–15 రోజులకోసారి పాదుల్లో పోశారు. పంచగవ్య, రాజ్మాగింజల ద్రావణం, కొబ్బరి నీరు నాలుగైదు సార్లు పిచికారీ చేశారు. వేసవిలో కురిసిన అకాల వర్షాల వల్ల లీఫ్ బ్లైట్ వంటి తెగుళ్లు సోకినప్పటికీ సేంద్రియ పద్ధతుల్లోనే వాటిని నియంత్రించటం విశేషం. ఈ కేవీకేలో బ్యాగు సేద్యంపై (గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు) రెండు బ్యాచ్‌లలో ప్రయోగాలు పూర్తయ్యాయి. 10న నందిగామలో ప్రకృతి సేద్యంపై శిక్షణ సెప్టెంబర్ 10(ఆదివారం)న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు విజయ్ రామ్ అవగాహన కల్పిస్తారు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. 150 మందికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు బాలకృష్ణారెడ్డి తెలిపారు. వివరాలకు.. 90281 85184, 64091 11427. వచ్చే నెల 4 నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సకశేరుక చీడల యాజమాన్య విభాగం సెప్టెంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇవ్వనుంది. తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు, నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వి. సునీత తెలిపారు. అభ్యర్థులకు ఉచిత భోజన వసతులు కల్పిస్తామన్నారు. వివరాలకు.. 94948 75941. (చదవండి: అర్బన్ కౌలు రైతుల పాట్లు!..కొద్దిపాటి స్థలంలోనే సిటీ ఫార్మింగ్! ) -
సేంద్రియ సాగు ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పురుగు మందులు, ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు, కూరగాయలు విష పూరితంగా మారడంతో వినియోగదారులు సేంద్రియ ఆహార పదార్థాలను ఎంచుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఏడాదికేడాదికి సేంద్రియ పంటల సాగు పెరుగుతోంది. మూడేళ్లలో రెట్టింపునకు మించి సేంద్రియ పంటల సాగు పెరిగినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. 2019–20 ఏడాదిలో రాష్ట్రంలో 56,355 ఎకరాల్లో సేంద్రియ పంటలను సాగు చేయగా 2,294 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యాయి. 2020–21లో మాత్రం కాస్తంత తగ్గి 51,662 ఎకరాల్లో సాగవగా , 20,665 మెట్రిక్ టన్నుల సేంద్రియ పంటలు ఉత్పత్తి అయ్యాయి. ఇక 2021–22లో ఆర్గానిక్ పంటలు 1.32 లక్షల ఎకరాల్లో సాగవగా. 3,871 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. దేశంలో తెలంగాణ 12వ స్థానం: వివిధ రాష్ట్రాలతో పోలిస్తే సేంద్రియ సాగులో తెలంగాణ 12వ స్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. 2019– 20లో దేశంలో ఆర్గానిక్ పంటలు 73.54 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఆ ఏడాది 27 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఉత్పత్తులు పండాయి. 2020– 21లో 95 లక్షల ఎకరాల్లో ఆర్గానిక్ పంటల సాగు విస్తీర్ణం జరగ్గా, 34.68 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఆహార పదార్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఇక 2021–22లో సేంద్రియ పంటల సాగు పెరిగింది. ఆ ఏడాది ఏకంగా 1.47 కోట్ల ఎకరాల్లో ఆర్గానిక్ పంటల సాగు జరగ్గా, 34.10 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ పంట ఉత్పత్తి జరిగింది. అత్యధికంగా ఆర్గానిక్ పంటలు సాగు చేసే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 2021–22లో 42 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 29.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగైంది. మూడో స్థానంలో గుజరాత్ , నాల్గవ స్థానంలో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6.32 లక్షల ఎకరాలతో ఐదో స్థానంలో సేంద్రియసాగు చేస్తున్నటు వెల్లడించింది. -
నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..
ఆయన ఓ విశ్రాంత ఉద్యోగి. నెలకు రూ.3 లక్షలు జీతం. ప్రైవేటు కంపెనీలో డిజిఎంగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు ఘట్రాజు వెంకటేశ్వరరావు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో అమ్మమ్మ గారి ఊరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి వచ్చి తమ 4.5 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ వరి రకాల సాగు చేపట్టారు. సుమారు రెండేళ్లు నిల్వ చేసిన ధాన్యాన్ని ఆరోగ్యదాయకమైన దేశీ బియ్యం విక్రయిస్తూ లాభాలతో ఆత్మసంతృప్తిని ఆర్జిస్తున్నారు. ఆయన అనుభవాల సారం ఆయన మాటల్లోనే.. ‘‘ప్రముఖ కంపెనీలో ముంబైలో ఉద్యోగం చేశాను. డీజీఎంగా బాధ్యతలు నిర్వహణ. ఐదేళ్ల క్రితం వీఆర్ఎస్ తీసుకుని హైదరాబాద్‌కు వచ్చేశాను. అప్పటికే ప్రకృతి సేద్యంపై ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రకతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాలొని మెళకువలు నేర్చుకున్నా. ఆచరణలో పెట్టేందుకు అమ్మమ్మ వాళ్ల ఊరైన కోలవెన్ను వచ్చి స్థిరపడ్డా. 4.5 ఎకరాల్లో తులసీబాణం, నారాయణ కామిని, నవారా, కాలాభట్, మార్టూరు సన్నాలు, రత్నచోడి, బహురూపి వంటి దేశీ వరి రకాలు సాగు చేస్తున్నా. రెండు ఆవులను తెచ్చుకున్నా. ఏటా సాగు ఆరంభంలో 40 ట్రక్కుల ఘన జీవామృతాన్ని పొలంలో చల్లుతున్నా. పంటకు అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. వర్రలతో బావిని కట్టించి 1200 లీటర్ల జీవామృతం తయారుచేసి 15 రోజులకోసారి చల్లుతున్నా. పంట ఆరోగ్యంగా ఎదుగుతున్నది. తెగుళ్ల బెడద లేదు. ఆవ పిండి చెక్క కూడా జీవామృతంలో కలిపి వాడుతున్నా. ఎకరాకు రూ. 25–30 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. 25–28 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తున్నది. పంటను ఆశించే పురుగు నివారణకు వేపపిండి చల్లుతాను. పోషకాలు జీవామతం ద్వారా అందుతాయి. మరీ అవసరం అయితే, అగ్ని అస్త్రం చల్లుతాను. ఎలాంటి పురుగైనా నాశనం అవుతుంది. దేశవాళీ విత్తన పంట నిల్వ, మార్కెటింగ్ విషయాలు చాలా ప్రధానమైనవి. పంట చేతికి వచ్చాక కనీసం 10 నెలల నుంచి రెండేళ్ల వరకూ పంటను మాగబెట్టిన ధాన్యాన్ని మిల్లులో ఆడించి నాణ్యమైన బియ్యాన్ని బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై ప్రాంతాల్లో ఉన్న నేరుగా విక్రయిస్తున్నా. నవారా, కాలాభట్ స్థానికంగా కిలో రూ. 90కి, బయట ప్రాంతాలకు రూ. 120కే అందిస్తున్నా, రవాణా ఖర్చు కూడా కలిపి. ఇతర రకాల బియ్యం కిలో రూ.75కే ఇస్తున్నా. ప్రతి రైతూ ప్రకృతి విధానం వైపు అడుగులు వేస్తే దిగుబడులు, ఆరోగ్యం, ఆదాయం, భూసారం పెంపుదల సాధ్యమే. ప్రభుత్వం రైతు భరోసా, ఇతర సబ్సిడీలు అందిస్తున్నది. వీటితో పాటు ప్రకృతి విధానంలో పండించిన పంటకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ సదుపాయాలు విస్తరించి, అదనపు వసతులు కల్పిస్తే కొత్త రైతులు కూడా ఈ విధానంలోకి వచ్చేస్తారు.’’ – ఈ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా వడ్లు ఎంత మాగితే అన్నం అంత ఒదుగుతుంది. ధాన్యం నిల్వ చేయకుండా తినటం వల్ల కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. పంట నాణ్యంగా ఉంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే ప్రకృతి విధానం వల్ల భూసారం పెంపొందుతుందని గుర్తించాను. (క్లిక్: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఎలా తయారు చేసుకోవాలంటే!) – ఘట్రాజు వెంకటేశ్వరరావు (92255 25562), కోలవెన్ను -
సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్ స్టోర్స్
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని రైతు బజార్ల ప్రాంగణాల్లో సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్ స్టోర్స్ అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర రైతు బజార్ల సీఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికి సంబంధించి డీపీఆర్‌ను రూపొందించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం విశాఖలో ఎంవీపీ కాలనీ రైతు బజార్‌ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయాలకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు చెప్పారు. కార్పొరేట్ లుక్‌తో రైతు బజార్ ప్రాంగణాల్లో విక్రయాలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, ఇందులో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాలో 3 నుంచి 5, విజయనగరం జిల్లాలో 2 నుంచి 3 కంటైనర్ స్టోర్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు కంటైనర్ స్టోర్స్‌ను విస్తరిస్తామని చెప్పారు. -
చల్లటి పంటలు
ఈశాన్య రాష్ట్రాలు అనగానే ముందుగా అక్కడి పచ్చటి తోటలు గుర్తుకు వస్తాయి. వీపున బుట్ట తగిలించుకున్న మహిళలు మనోఫలకం మీద మెదలుతారు. వేళ్లతో అలవోకగా తేయాకు చిగుళ్లను గిల్లుతూ బుట్టలో వేస్తున్న దృశ్యం కూడా. అదే ప్రాంతం నుంచి ఓ మహిళ సేంద్రియ పంటలను బుట్టలో వేయసాగింది. ఇప్పుడు... బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డును కూడా బుట్టలో వేసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో మనకు ఒక మోస్తరుగా తెలిసిన రాష్ట్రం సిక్కిమ్, ఆ రాష్ట్రానికి రాజధాని గాంగ్టక్, ఆ నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరాన ఉంది రాణిపూల్ అనే చిన్న పట్టణం. అది పట్టణమో, గ్రామమో స్పష్టంగా చెప్పలేం. నివాస ప్రదేశాలకు ఒకవైపు కొండలు, మరోవైపు రాణిఖోలా నది, వాటి మధ్య పచ్చగా విస్తరించిన నేల. ఈ నేలనే తన ప్రయోగశాలగా మార్చుకున్నారు దిల్లీ మాయా భట్టారాయ్. ప్రోగ్రెస్ రిపోర్ట్ టెకీగా సిటీలైఫ్ చట్రంలో జీవితాన్ని కట్టిపడేయడం నచ్చలేదామెకు. ‘మనల్ని మనం పరిరక్షించుకుంటాం, అలాగే భూమాతను కూడా పరిరక్షించాలి’... అంటారు మాయా భట్టారాయ్. అందుకోసం గ్రామంలో సేంద్రియ సేద్యాన్ని, సేంద్రియ ఉత్పత్తుల దుకాణాన్ని కూడా ప్రారంభించారామె. ‘పర్యావరణాన్ని పరిరక్షించడంలో సేంద్రియ వ్యవసాయం ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకే ఈ రంగంలో అడుగుపెట్టాను’ అని చెప్తున్నారామె. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్గానిక్ మిషన్‌లో భాగస్వామి అయిన తర్వాత ఆమెకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. శాస్త్ర సాంకేతికతను జోడిస్తూ వ్యవసాయం చేయడంలోనూ, ఆర్థిక సంక్షేమాన్ని సాధించడంలో ఆమె కృతకృత్యులయ్యారు. మన నేలకు పరిచయం లేని పాశ్చాత్య దేశాల్లో పండే అనేక పంటలను ఇక్కడ పండించారామె. ఆ పంటలకు తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని, ఎక్కువ ఎండ తగలకుండా తెల్లని పై కప్పుతో సస్యాలను రక్షించారు. మన అల్లం, వంకాయలతోపాటు పశ్చిమాన పండే బ్రోకలి వంటి కొత్త పంటల సాగులోనూ పురోగతి సాధించారు. ఆమె ప్రోగ్రెస్ రిపోర్ట్‌కు మంచి గుర్తింపు వచ్చింది. మాయా భట్టారాయ్ అనుసరించిన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మీద స్థానిక మీడియా చానెళ్లు ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. సోషల్ మీడియా కూడా అందుకుంది. ఆమె ఫార్మింగ్ ఫార్ములా విపరీతంగా ప్రజల్లోకి వెళ్లింది. వాతావరణాన్ని కలుషితం కానివ్వకుండా కాపాడడంలో ఆమె తనవంతుకంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని అందించింది. ఆమె స్ఫూర్తితో అనేక మంది మహిళలు పర్యావరణానికి హానికలిగించని విధంగా సాగు చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె ప్రయత్నాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆమెను ‘బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు 2021’తో గౌరవించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు చెందిన నార్త్ ఈస్టర్న్ హిల్ రీజియన్ 48వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇటీవల మేఘాలయలోని ఉమియమ్‌లో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. పంటకు పురస్కారం రాణిపూల్‌లోని హాత్ బజార్లో మాయా భట్టారాయ్ దుకాణాన్ని, స్థానిక మహిళలు సేంద్రియసాగులో పండిస్తున్న కూరగాయలను చూపిస్తూ ‘ఇదంతా దిల్లీ మాయా భట్టారాయ్ బాటలో మన మహిళలు సాధించిన విజయం. బయటి నుంచి కూరగాయలు మాకక్కరలేదు... అని చెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం’ అని కథనాలు ప్రసారం చేసింది స్థానిక ‘వాయిస్ ఆఫ్ సిక్కిమ్’ మీడియా. ‘నేలకు గౌరవం అందాలి. పంటకు పురస్కారాలు రావాలి. పంట పండించే రైతు శ్రమను గౌరవించే రోజులు రావాలి’ అంటారామె. -
వనధన్ కేంద్రాల కోసం ఏపీకి 10 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో 21 వనధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం 10.64 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు గిరిజన్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ ప్రకటించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్) ఆధ్వర్యంలో వనధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. గిరిజనులు అడవుల్లో సేకరించే చిన్నపాటి అటవీ ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ ద్వారా అధిక విలువ చేకూర్చేలా వనధన్ కేంద్రాలు పని చేస్తాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో మొత్తం 211 వనధన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. (చదవండి : ‘చిన్నతరహా పరిశ్రమలకు చేయూతనివ్వండి’) 1185 కోట్లతో ఆర్గానిక్ పత్తి సాగుకు ప్రోత్సాహం ఆర్గానిక్ పత్తి సాగు ప్రోత్సాహకం కోసం 1185 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు జౌళి శాఖ మంత్రి స్పృతి ఇరానీ రాజ్యసభలో వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ సాంప్రదాయక, బీటీ పత్తి విత్తనాల సాగుకంటే కూడా సగటున ఆర్గానిక్ పత్తి సాగుకయ్యే వ్యయం తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. దేశీయ పత్తి విత్తనాల వాడకంతోపాటు ఆర్గానిక్ ఎరువుల వాడకం వలన సాగు వ్యయం బాగా తగ్గుతుందని తెలిపారు. పరంపరగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) పథకం కింద సర్టిఫైడ్ ఆర్గానిక్ పత్తి ఉత్పాదనలకు మంచి రేటు కల్పించేందుకు రైతులతో వినియోగదారులను అనుసంధానించడం జరుగుతుంది. ఆర్గానిక్ పత్తి సాగుకు అవసరమైన ఇన్పుట్లు, విత్తనాలు, సర్టిఫికేషన్ నుంచి పంట సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండ్ బిల్డింగ్ వంటి ప్రక్రియలను ఈ పథకం కింద చేపట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రధానంగా ఎగుమతులపై దృష్టి పెట్టి ఆర్గానిక్ పత్తి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద అయిదేళ్ళ పాటు ఆర్గానిక్ పత్తి సాగు చేసే రైతుకు హెక్టారుకు ఏటా 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ మొత్తంలో 31 వేల రూపాయలను నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్‌కు బదలీ చేయడం జరుగుతంది. ఇందుకోసం 2018-19, 2010-21 సంవత్సరాలకు గాను 4 లక్షల హెక్టార్లలో ఆర్గానిక్ పత్తి సాగు కోసం 1185 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. -
అందరి చూపు సేంద్రియం వైపు
నంగునూరు (సిద్దిపేట): ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే సేంద్రియ వ్యవసాయం అభివృద్ధి చెందాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. విషతుల్యమైన పంటలతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆర్గానిక్ పంటల వైపు చూస్తోందన్నారు. బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో జరిగిన సమావేశంలో సిద్దిపేట ఆర్గానిక్ ప్రొడక్ట్ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం వాటర్‌షెడ్ పథకం కింద రైతులకు సబ్సిడీ టార్పాలిన్ కవర్లు, స్ప్రేయర్లు అందజేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. విచ్చల విడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ పంటలు పండించడం వల్ల కేన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రజలు ఆర్గానిక్ ఆహారం వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ఆర్గానిక్ పంటలు అమ్మేవారికి గిట్టుబాటు ధర కల్పిస్తూ వినియోగదారులకు ఆరోగ్యకరమైన పంటలను అందించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దీని కోసం www.siddipetorganicproducts.com ద్వారా సేంద్రియ ఉత్పత్తులను దేశంలో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ వెబ్సైట్లో సేంద్రియ వ్యవసాయం చేసే రైతు వివరాలు, పొలం, ఫొటోలు, పంట తదితర వివరాలు ఉంటాయని తెలిపారు. నేరుగా కొనుగోలు..: ఈ వెబ్సైట్ ద్వారా సేంద్రియ ఉత్పత్తులను దళారీల ప్రమేయం లేకుండా రైతుల నుంచే వినియోగదారులు నేరుగా కొనుగోలు చేయవచ్చని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సేంద్రియ రైతులకు మంచి ధర వచ్చేందుకు, వినియోగదారుల కొనుగోలుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో ఎరువులు, పరుగు మందులు వాడిన ఆహార ఉత్పత్తులు అమ్ముతుండటాన్ని ఆక్షేపించారు. నిజమైన ఆర్గానిక్ ఉత్పత్తులు కావాలనుకునే వారు ఈ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. రూ.15 లక్షల ఆర్థిక సాయం.. యాభై ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించి సేంద్రియ వ్యవసాయం చేస్తే వారికి ప్రభుత్వం నుంచి మూడేళ్ల పాటు విడతల వారీగా రూ.15 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాబార్డు ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలు, మార్కెటింగ్ సదుపాయాలతో పాటు కార్పొరేట్ సంస్థల సాయంతో రైతులకు ఆవులను సమకూర్చుతామన్నారు. అంతర్జాతీయ కంపెనీలు సైతం ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా అనుసంధానిస్తామన్నారు. రైతులు నమ్మకంగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే కొనుగోలు దారులు పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేసేలా చేస్తామన్నారు. వరంగల్, సిద్దిపేట రైతు బజారులో సేంద్రియ ఉత్పత్తులు అమ్మడానికి ఉచితంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో రైతులకు మంత్రి హరీశ్‌రావు ఆర్గానిక్ వ్యవసాయ పనిముట్లను అందజేశారు. కొమురవ్వ.. వ్యవసాయం ఎట్ల చేస్తున్నవ్ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి, నర్సంపేట్ నియోజక వర్గాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు రావడంతో మంత్రి వారి వివరాలు సేకరించారు. పాలకుర్తికి చెందిన మహిళా రైతు కొమురవ్వ మాట్లాడుతూ.. తాను మూడేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని చెప్పడంతో.. ఎన్ని ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నావని, ఎరువులు, కషాయాలు ఎలా తయారు చేస్తున్నావని మంత్రి ఆమెను అడిగి తెలుసుకున్నారు. -
‘దేశీ’ దశగవ్య!
దేశీ ఆవుల ఆలంబనగా సేంద్రియ వ్యవసాయాన్ని ఓ మహిళా రైతు కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. గిర్ ఆవుల పాలను తోడుపెట్టి, మజ్జిగ చిలికి సంప్రదాయబద్ధంగా నెయ్యిని తీస్తున్నారు. స్వచ్ఛమైన దేశీ ఆవుల నెయ్యి, పాలు, పేడ, మూత్రం తదితరాలతో పంచగవ్య మాదిరిగా ‘దశగవ్య’(సేంద్రియ పంటల పెరుగుదలకు ఉపకరించే పోషక ద్రావణం) తయారు చేస్తున్నారు. తన 25 ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో పశుగ్రాసాలు, ఆహార పంటలను పండిస్తున్నారు. దేశీ ఆవు నెయ్యి, దశగవ్య, ఘనజీవామృతం విక్రయిస్తూ శభాష్ అనిపించుకుంటున్న ఉడుముల లావణ్యారెడ్డి ‘డాక్టర్ ఆఫ్ అగ్రికల్చర్’ డిగ్రీని అందుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. మంజీర నది తీరాన సంగారెడ్డి జిల్లా అందోలు వద్ద 25 ఎకరాల్లో కొలువైన విలక్షణ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం అది. హైద్రాబాద్‌కు చెందిన ఉడుముల లావణ్య రెడ్డి మక్కువతో ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో 200కు పైగా ఉత్తమ దేశీ గిర్ జాతి గోవులున్నాయి. పుంగనూరు, సాహివాల్ వంటి ఇతర దేశీ జాతుల ఆవులు సైతం ఒకటి, రెండు ఉన్నాయి. ప్రస్తుతం 40 గిర్ ఆవులు పాలు ఇస్తున్నాయి. లావణ్య రెడ్డి పాలు అమ్మరు. పాలను కాచి తోడుపెట్టి, పెరుగును చిలికి సంప్రదాయ పద్ధతిలో స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి అమ్ముతారు. ప్రతి 28 లీటర్ల పాలకు కిలో నెయ్యి తయారవుతుందని, నెలకు 80–90 కిలోల నెయ్యిని తాము ఉత్పత్తి చేస్తున్నామని ఆమె తెలిపారు. దీంతోపాటు.. సేంద్రియ పంటలు ఏపుగా పెరిగేందుకు దోహదపడే దశగవ్య అనే పోషక ద్రావణాన్ని తయారు చేసి తమ పంటలకు వాడుకుంటూ, ఇతరులకూ విక్రయిస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతం, దశగవ్య, అగ్రి అస్త్రం కూడా తయారు చేసుకొని పూర్తి సేంద్రియ పద్ధతుల్లో వరి, కూరగాయలు, పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేపట్టిన తొలి ఏడాదే జైశ్రీరాం, ఆర్ఎన్ఆర్ సన్న రకాల ధాన్యాన్ని ఎకరానికి 40 బస్తాలు(70 కిలోల) పండించామని ఆమె తెలిపారు. ఆమె కృషికి మెచ్చిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఇటీవల ‘డాక్టర్ ఆఫ్ అగ్రికల్చర్’ డిగ్రీని ప్రదానం చేసింది. దశగవ్య తయారీ పద్ధతి సేంద్రియ పంటల పెరుగుదలకు దోహదపడే గోఉత్పత్తులతో ‘పంచగవ్య’ తయారీకి తమిళనాడుకు చెందిన డా. నటరాజన్ ఆద్యుడు. అదే రీతిలో 10 ఉత్పాదకాలను కలిపి దశగవ్యను తయారు చేయడం వాడుకలోకి వచ్చింది. దశగవ్య తయారీపై లావణ్య రెడ్డి అందించిన వివరాలు.. 50 లీటర్ల బ్యారెల్‌ను తీసుకొని.. 40 లీటర్ల దశగవ్యను తయారు చేయాలి. 7.5 కిలోల పేడ, 7.5 లీటర్ల మూత్రం, 750 గ్రాముల నెయ్యి, 5 లీటర్ల పాలు, 5 లీటర్ల పెరుగు, 5 లీటర్ల కొబ్బరి నీళ్లు, 5 లీటర్ల చెరుకు రసం, చిన్నవైతే 24–పెద్దవైతే 18 అరటి పండ్లు, 2 కిలోల నల్ల ద్రాక్ష పండ్లు, 5 లీటర్ల తాటి కల్లుతో దశగవ్యను తయారు చేయాలి. మొదట బ్యారెల్‌లో పేడ, నెయ్యి వేసి అరగంట నుంచి గంట వరకు కట్టెతో బాగా కలపాలి. అనంతరం దానికి మూత పెట్టకూడదు. పల్చటి గుడ్డ కట్టాలి. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట కలియదిప్పాలి. 5వ రోజు పైన చెప్పిన మోతాదులో మిగతా 8 రకాలను కలపాలి. 18వ రోజు వరకు రోజూ ఇలాగే రోజుకు నాలుగు సార్లు కలియదిప్పుతూ ఉండాలి. 19వ రోజున వడపోస్తే.. దశగవ్య సిద్ధమవుతుంది. సీసాల్లో నింపి నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత కలియదిప్పాల్సిన అవసరం లేదు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది. వడపోయగా వచ్చిన పిప్పిని పంట పొలంలో ఎరువుగా వేసుకోవచ్చు. 15 రోజులకోసారి పిచికారీ దశగవ్యను వివిధపంటలపై 30 లీటర్ల నీటిలో ఒక లీటరు దశగవ్యను కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయవచ్చని లావణ్యారెడ్డి తెలిపారు. డ్రిప్ ద్వారా కూడా పంటలకు అందించవచ్చు. ఎకరం వరి పంటకు పిచికారీకి సుమారు 200 లీటర్ల ద్రావణం అవసరమవుతుందని, అందుకు ఆరు–ఏడు లీటర్ల దశగవ్య అవసరమవుతుందని ఆమె తెలిపారు. కూరగాయ పంటలకు పిచికారీ చేసేటప్పుడు 25 లీటర్ల నీటికి ఒక లీటరు దశగవ్య కలపాలని తెలిపారు. దశగవ్య పిచికారీ చేసిన పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయని, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటాయని, మంచి దిగుబడినిస్తాయని ఆమె అన్నారు. ఆవుపేడ, మూత్రం పుష్కలంగా ఉంది కాబట్టి ఘనజీవామృతం తయారు చేసుకొని నెలకోసారి ఎకరానికి 5–6 క్వింటాళ్లు చల్లుతున్నామన్నారు. నీటిని అందించేటప్పుడు జీవామృతం కలిపి పారిస్తున్నామన్నారు. అగ్రి అస్త్రం, బ్రహ్మాస్త్రం కూడా అవసరాన్ని బట్టి వాడుతున్నామని, మొత్తంగా తమ పంటలు ఆశ్చర్యకరంగా దిగుబడులు వస్తున్నాయన్నారు. జంజుబ గడ్డి.. 18 రోజులకో కోత లావణ్యారెడ్డి తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం 9 ఎకరాల్లో సంప్రదాయ రకం జంజుబ గడ్డితోపాటు పారాగడ్డి, సూపర్ నేపియర్, తీపిజొన్న రకాలను సాగు చేస్తున్నారు. అరెకరంలో కూరగాయలు, ఎకరంలో పసుపు, ఎకరంలో చెరకు, రెండెకరాల్లో సుగంధ దేశీరకం వరిని సాగు చేస్తున్నారు. జుంజుబ రకం గడ్డిని ఆవులు ఇష్టంగా తింటాయన్నారు. ఇది 18 రోజులకోసారి కోతకు వస్తుందన్నారు. కోత కోసిన తర్వాత నీటితోపాటు జీవామృతం పారిస్తామని, 5–6 రోజుల తర్వాత దశగవ్య పిచికారీ చేస్తామన్నారు. మోకాళ్ల ఎత్తుకు ఎదిగిన తర్వాత కోసి ఆవులకు వేస్తామన్నారు. –ఆకుల రాంబాబు, సాక్షి, జోగిపేట, సంగారెడ్డి జిల్లా సేంద్రియ సాగు వ్యాప్తే లక్ష్యం దేశీ ఆవులు సేంద్రియ వ్యవసాయానికి మూలాధారం. గో ఉత్పత్తుల ద్వారా వ్యవసాయంలో రసాయనాలకు పూర్తిగా స్వస్తి చెప్పటం సాధ్యమేనని రైతులకు తెలియజెప్పడం కోసం మోడల్ ఫామ్‌ను ఏర్పాటు చేశాను. ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తికి దోహదపడే దశగవ్య, ఘనజీవామృతాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాను. సేంద్రియ సేద్యాన్ని వ్యాప్తిలోకి తేవాలన్నదే లక్ష్యం. – డా. ఉడుముల లావణ్యారెడ్డి (92468 45501), అందోలు, సంగారెడ్డి జిల్లా దేశీ రకం వరి, వంగ మొక్కలు, చెరకు తోట, కొర్ర పంట ప్లాస్టిక్ బ్యారెల్‌లో దశగవ్యను కలియదిప్పుతున్న కార్మికులు ఆవుల కోసం దాణా జుంజుబ గడ్డి -
సేంద్రియ పంటలకు ప్రత్యేక రుణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా సేంద్రియ పంటలకు రుణాలు ఇవ్వనున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయలు సహా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయించింది. వివిధ రకాల పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను మంగళవారం టెస్కాబ్ ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే దాదాపు 100 రకాల పంటలకు 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. సంబంధిత నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి పంపించింది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు చొప్పున స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేసింది. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.40 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఈ సారి ఆర్గానిక్ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. వరి, పత్తికి రూ.38 వేలు.. తెలంగాణలో అత్యధికంగా సాగు చేసే వరికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.34 వేల నుంచి రూ. 38 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో అది రూ.30 వేల నుంచి రూ. 34 వేలుగా ఉంది. వరి విత్తనోత్పత్తి రైతులకు రూ. 40 వేల నుంచి రూ. 42 వేలు ఖరారు చేశారు. పత్తికి 2018–19లో రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.35 వేల నుంచి రూ.38 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ.25 వేల నుంచి రూ.28 వేలు నిర్ధారించారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో రూ.20 వేల నుంచి రూ.23 వేలుగా నిర్ధారించారు. సాధారణ పద్ధతిలో పండించే కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ.17 వేల నుంచి రూ.20 వేలు, సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో రూ.14 వేల నుంచి రూ.17 వేలు చేశారు. ఇక ఆర్గానిక్ çపద్ధతిలో సాగు చేస్తే కందికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు అత్యధికంగా నిర్ధారించారు. కంది విత్తనోత్పత్తి చేసే రైతులకు రూ.20 వేల నుంచి రూ. 25 వేలు చేశారు. ఇదిలావుండగా కంది విత్తనోత్పత్తికి ప్రస్తుతం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ధారణ చేయలేదు. సాగునీటి ప్రాంతాల్లో మినుము సాగు చేసే రైతులకు రూ.15 వేల నుంచి రూ.18 వేలు, నీటి వసతి లేని ప్రాంతాల్లోని వారికి రూ.13 వేల నుంచి రూ.15 వేలు రుణం ఇస్తారు. ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అ«ధికంగా ఇస్తారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో పెసరకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు, సాగునీటి వసతి ఉంటే రూ.15 వేల నుంచి రూ.17 వేలు ఇస్తారు. ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అధికంగా ఇస్తారు. సోయాబీన్‌కు ఇప్పటివరకు రూ.18 వేల వరకు ఇవ్వగా, వచ్చే ఏడాది నుంచి రూ.22 వేల నుంచి రూ.24 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు మొదటిసారిగా రూ.28 వేల నుంచి రూ.31 వేల వరకు ఇస్తారు. ద్రాక్షకు రూ.1.25 లక్షలు... అత్యధికంగా విత్తనరహిత ద్రాక్షకు రూ.1.2 లక్షల నుంచి రూ.1.25 లక్షలు రుణం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరను మార్చలేదు. దాంతోపాటు పత్తి విత్తనాన్ని సాగు చేస్తే ఇప్పటివరకు రూ.94 వేల నుంచి రూ.1.26 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.1.1 లక్షల నుంచి రూ.1.4 లక్షలకు పెంచారు. పసుపు సాగుకు రూ.60 వేల నుంచి రూ.68 వేలు చేశారు. ప్రస్తుతం కంటే రూ.2 వేల నుంచి రూ.8 వేలు అదనంగా పెంచారు. క్యాప్సికానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖరారు చేశారు. -
సేంద్రియ ఆహారంపై జైవిక్ ముద్ర!
సేంద్రియ వ్యవసాయ/ఆహార ఉత్పత్తుల ప్యాకెట్‌ను షాపు/మాల్లో చేతిలోకి తీసుకునే వినియోగదారులకు ‘ఇది నిజంగా సేంద్రియ పద్ధతుల్లో పండించినదేనా?’ అన్న సందేహం కలగడం సహజం. ఈ గందరగోళానికి ఒక ప్రధాన కారణం.. ప్యాకెట్‌పై ఒక్కో కంపెనీ వారు ఒక్కో రకంగా ఉండే సేంద్రియ లోగోను ప్రచురించడమే. సేంద్రియ ఉత్పత్తుల వినియోగదారులకు వచ్చే జూలై నుంచి ఈ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ‘జైవిక్ భారత్’ అనే లోగోను విధిగా ప్యాకెట్‌పై ముద్రించాలని నిర్దేశించింది. జూలై నుంచి ఈ లోగో ముద్రించకుండా సేంద్రియ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులు శిక్షార్హులని భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రకటించింది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు లేదా రైతు బృందాలు(ఎఫ్.పి.ఓ.లు) తాము పండించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మేటప్పుడు ఈ నిబంధన వర్తించదు! రైతుల నుంచి కొని వినియోగదారులకు అమ్మే దుకాణదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే, దేశ విదేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయించదలచుకునే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు పి.జి.ఎస్. లేదా థర్డ్ పార్టీ సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. మన దేశంలో సేంద్రియ ఆహార నాణ్యతా ప్రమాణాల నియంత్రణకు రంగం సిద్ధమైంది. దుకాణాలు, మాల్స్‌లో విక్రయించే సేంద్రియ వ్యవసాయోత్పత్తుల ప్యాకెట్లపై ఉత్పత్తిదారులు ‘జైవిక్ భారత్’ లోగోను జూలై నుంచి విధిగా ముద్రించాల్సి ఉంటుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ‘భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ.)’ సేంద్రియ ఆహారానికి సంబంధించి రూపొందించిన నియమావళిని ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 2న గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ముసాయిదా ప్రకటించిన ఏడాది తర్వాత గత ఏడాది నవంబర్ 9న ప్రపంచ సేంద్రియ మహాసభల సందర్భంగా విడుదలైన ఈ నియమావళి.. ఈ ఏడాది జూలై నుంచి చట్టబద్ధంగా అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా సేంద్రియ ఆహారోత్పత్తి, అమ్మకం, పంపిణీలతోపాటు విదేశాల నుంచి సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుమతికి కూడా ఈ నియమావళి వర్తిస్తుంది. ఇప్పటి వరకు విదేశాలకు ఎగుమతి అయ్యే సేంద్రియ ఆహారోత్పత్తులకు మాత్రమే జాతీయ సేంద్రియ ఉత్పత్తి కార్యక్రమం (ఎన్.పి.ఓ.పి.) నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ సేంద్రియ ధ్రువీకరణ పత్రం పొందేవారు. ఇప్పుడు దేశీయంగా అమ్మే సేంద్రియ ఉత్పత్తులకు కూడా కంపెనీలు ఎన్.పి.ఓ.పి. ధృవీకరణ పొందవచ్చు. ఎన్.పి.ఓ.పి. ధృవీకరణ వ్యవస్థ 2001 నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధంగా.. ‘అపెడా’ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ క్లిష్టమైనదే కాక, అత్యంత ఖరీదైనది కూడా. కొత్త నియమావళి ప్రకారం.. మన దేశంలోని దుకాణాల్లో/ షాపింగ్ మాల్స్‌లో అమ్మకానికి పెట్టే సేంద్రియ ఉత్పత్తులేవైనా సరే విధిగా అందుబాటులో ఉన్న రెండు ధృవీకరణ వ్యవస్థల్లో(ఎన్.పి.ఓ.పి./ పి.జి.ఎస్. ఇండియా) ఏదో ఒక దాని నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పి.జి.ఎస్.) ఇండియా అనేది కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎఫ్.), ఘజియాబాద్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సేంద్రియ ధ్రువీకరణ వ్యవస్థ. 2011 నుంచి ఉంది. ఆన్లైన్ ద్వారా రైతుల రిజిస్ట్రేషన్ సదుపాయం 2015 జూలై నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇందులో సేంద్రియ రైతులే బృందంగా ఏర్పడి సర్టిఫికేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఈ ధ్రువీకరణకు రైతులు ఎటువంటి ఫీజునూ చెల్లించనక్కరలేదు. ఎన్.పి.ఓ.పి./ పి.జి.ఎస్. ఇండియా సర్టిఫికేషన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చి అనేక ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఐచ్ఛికంగానే ఉన్నాయి. అయితే, ‘జూలై నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను అమ్మే ఏ కంపెనీ అయినా ఇప్పుడు మేం ప్రకటించిన ప్రమాణాలను విధిగా పాటించకపోతే ప్రాసిక్యూట్ చేస్తాం’ అని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. సీఈఓ పవన్ అగర్వాల్ హెచ్చరిస్తున్నారు.సేంద్రియ ఆహారోత్పత్తులను వినియోగదారులకు నేరుగా అమ్మే చిన్న, సన్నకారు రైతులు లేదా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్.పి.ఓ.లు) ఎటువంటి ధ్రువీకరణనూ విధిగా పొందాలన్న నిబంధనేదీ లేకపోవడం విశేషం. సేంద్రియ ఆహారోత్పత్తుల ప్యాకెట్లపై ఆయా ఉత్పత్తుల సేంద్రియ స్థితిగతులకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరచాలి. ఎన్.పి.ఓ.పి. ప్రకారం థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ లోగో లేదా పి.జి.ఎస్. ఇండియా ధ్రువీకరణ లోగోలలో ఏదో ఒకదానితో పాటుగా.. జైవిక్ భారత్ లోగోను కూడా తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటుంది. ఆ ప్యాకెట్లో ఉన్న సేంద్రియ ఉత్పత్తిని పండించిన రైతు ఎవరో ఏమిటో తెలిపే వివరాలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు ఉండాలి. పి.జి.ఎస్. ఇండియా «ధ్రువీకరణతో విశ్వసనీయత! వివిధ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించే రైతుల బృందాలు పి.జి.ఎస్. ఇండియా ధ్రువీకరణ పొందితే వారి ఉత్పత్తులకు మార్కెట్లో విశ్వసనీయత, రైతుల నికరాదాయం పెరుగుతుంది. 100కు పైగా రైతు బృందాల బ్రాండ్స్ పి.జి.ఎస్. ఇండియా ద్వారా మార్కెట్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రీజినల్ కౌన్సిళ్ల ద్వారా రైతులు రిజిస్టర్ చేసుకోవచ్చు. వివరాలకు ఈ వెబ్సైట్ చూడండి: pgsindia-ncof.gov.in ఘజియాబాద్(ఉ.ప్ర.)లోని మా కార్యాలయాన్ని సంప్రదించండి: 0120 2764906, 2764212 – డా. కృషన్ చంద్ర, సంచాలకులు, జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, ఘజియాబాద్(ఉత్తరప్రదేశ్) సేంద్రియ పశు, ఆక్వా ఉత్పత్తులకూ ధ్రువీకరణ! జడ్.బి.ఎన్.ఎఫ్. రైతులకూ పి.కె.వి.వై.! పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం(పి.జి.ఎస్.) ఇండియా ద్వారా సేంద్రియ ధ్రువీకరణను సంపూర్ణంగా సేంద్రియ/ప్రకృతి పద్ధతులను అనుసరించే రైతులందరూ ఉచితంగా పొందవచ్చు. కనీసం ఐదుగురు రైతులు బృందంగా ఏర్పడి, అధీకృత రీజినల్ కౌన్సిళ్ల ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని పీజిఎస్ ఇండియా సేంద్రియ ధ్రువీకరణను పొందవచ్చు. విదేశాలకు ఎగుమతి చేయడానికైతే ఒక రైతు లేదా కనీసం 50 మంది గల రైతు బృందాలు ఎన్.పి.ఓ.పి. థర్డ్ పార్టీ ధ్రువీకరణను పొందవచ్చు. సేంద్రియ పశుపోషణ పద్ధతులను అనుసరిస్తున్న రైతులు ‘అపెడా’ ద్వారా థర్డ్ పార్టీ ధ్రువీకరణ పొందవచ్చు. ఆహార ధాన్యాలు, కూరగాయ పంటలను పూర్తిగా సేంద్రియ/పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులతో పాటు.. ఆక్వా సాగులో పూర్తి సేంద్రియ పద్ధతులను పాటించే రైతులు సైతం ఉచితంగా పి.జి.ఎస్. ఇండియా ద్వారా సేంద్రియ ధ్రువీకరణ పొందవచ్చు. దేశవ్యాప్తంగా 722 సంస్థలు(రీజినల్ కౌన్సిల్స్) పి.జి.ఎస్. ధ్రువీకరణ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే 2.5 లక్షల మంది రైతులు పి.జి.ఎస్. ఇండియా ధ్రువీకరణ పొందారు. వీరు జూలై నుంచి తమ రైతు బృందం సొంత లోగోతో పాటు.. పి.జి.ఎస్. ఇండియా లోగో, జైవిక్ భారత్ లోగోలను ప్యాకెట్లపై ముద్రించాల్సి ఉంటుంది. – డాక్టర్ టి. కె. ఘోష్, ప్రాంతీయ సంచాలకులు, జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, ఘజియాబాద్. సొంత బ్రాండ్‌తో అమ్ముకోవచ్చు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు పి.జి.ఎస్. ఇండియా వ్యవస్థ ద్వారా ఉచిత సేంద్రియ ధ్రువీకరణ పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో జె.డి.ఎ.ల ద్వారా లేదా ఎన్.సి.ఓ.ఎఫ్. వద్ద రీజినల్ కౌన్సిళ్లుగా నమోదైన ప్రైవేటు సంస్థల ద్వారా రైతులు ధ్రువీకరణ పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో పి.కె.వి.వై. పథకం అమలు ప్రారంభం కానందున జె.డి.ఎ.ల ద్వారా రైతులు ధ్రువీకరణ పొందలేరు. అయితే, ప్రైవేటు రీజినల్ కౌన్సిళ్ల ద్వారా ఆంధ్రా రైతులు పి.జి.ఎస్. ధ్రువీకరణ పొందే వీలుంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులైనా కనీసం ఐదుగురు బృందంగా ఏర్పడి ధ్రువీకరణ పొందవచ్చు. దుకాణంలో అమ్మినప్పుడు మాత్రం తప్పనిసరిగా సేంద్రియ ధ్రువీకరణ లోగోతో పాటు, జైవిక్ భారత్ లోగోనూ ముద్రించాలి. – డాక్టర్ వి. ప్రవీణ్‌కుమార్ (092478 09764), శాస్త్రవేత్త, ఎన్.సి.ఓ.ఎఫ్. ఘజియాబాద్ సేంద్రియ/ప్రకృతి సేద్యంపై దృష్టి! పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం (జడ్.బి.ఎన్.ఎఫ్.), ఛత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాల్లోని సేంద్రియ వ్యవసాయ నమూనాలు ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయం – ధ్రువీకరణ సంబంధిత అంశాలపై రెండేళ్లుగా దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. ఘజియాబాద్‌లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం నిపుణులతో వివిధ రాష్ట్రాల ఆత్మా పీడీలు, శాస్త్రవేత్తలు, మత్స్య, పశుసంవర్థక శాఖల అధికారులకు పి.జి.ఎస్. ధ్రువీకరణ పద్ధతిపై శిక్షణ ఇప్పించాం. రెండో విడతగా ఇటీవల 3 రోజల పాటు శిక్షణ ఇప్పించాం. వేస్ట్ డీ కంపోజర్‌తో సులభంగా సేంద్రియ సేద్యాన్ని చేపట్టే పద్ధతులను అధ్యయనం చేస్తున్నాం. రైతుకు భవితపై ఆశ కల్పించాలన్న లక్ష్యంతో లాభనష్టాలు చూసుకొని తగిన సేద్య పద్ధతులను అనుసరించాలని చెబుతున్నాం. విస్తరణ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు రాష్ట్రాల వారీగా వర్కింగ్ పేపర్లు తయారు చేసి, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నాం. 2019 మార్చి నాటికి అన్ని రాష్ట్రాల వర్కింగ్ పేపర్లూ సిద్ధం చేస్తాం. – వి. ఉషారాణి, డైరెక్టర్ జనరల్, జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ(మేనేజ్), రాజేంద్రనగర్, హైదరాబాద్ అతి తక్కువ అవశేషాల పరిమితి! రసాయనిక ఆహారోత్పత్తుల్లో చట్టబద్ధంగా అనుమతించదగిన రసాయనిక పురుగుమందుల అవశేషాల స్థాయిలో 5%కు మించి సేంద్రియ ఆహారోత్పత్తుల్లో ఉండకూడదని ‘భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ.) తాజా నిబంధనావళి నిర్దేశిస్తోంది. ఉదాహరణకు.. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగైన బియ్యంలో కార్బరిల్ అనే పురుగుల మందు అవశేషాలు 2.5 పార్ట్ పర్ మిలియన్ (పీపీఎం)కు మించి ఉండకూడదన్నది నిబంధన. ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. తాజా నిబంధనావళి ప్రకారం.. సేంద్రియ బియ్యంలో ఈ అవశేషం 0.125 పీపీఎంకు మించి ఉండకూడదు. ప్రపంచస్థాయి అత్యున్నత సేంద్రియ సేద్య ప్రమాణాలకు అనుగుణంగా ఇంత తక్కువ అవశేషాల మోతాదును నిర్దేశించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
సేంద్రియ పంటల లోగిలి
మూడంతస్తుల మేడ అది. రకరకాల పండ్లు, పూల మొక్కలతో ఆ ఇంటి ఆవరణ అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికితే... మొదటి అంతస్తులోకి ప్రవేశించగానే సిమెంట్ తొట్లలో పెంచిన వివిధ రకాల కూరగాయ మొక్కలు సందర్శకులను అబ్బుర పరుస్తాయి. రెండో అంతస్తులో పందిరిపై అల్లుకున్న తీగజాతి కూరలు తమది పొదరిల్లని చెప్పకనే చెపుతుంటే... మూడో అంతస్తులో కుండీల్లో పెరుగుతున్న పండ్ల చెట్లు రకరకాల పళ్లతో సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. డాక్టర్ సూరపనేని శివరామ్‌ప్రసాద్ మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా తణుకులోనే స్థిరపడ్డారు. పంటల సాగులో విచ్చలవిడి రసాయనాల వాడకాన్ని అతి దగ్గర నుంచి గమనించిన ఆయన ఐదేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతం ఇంటిపంటల పెంపకంలో 200కు పైగా మట్టి, ప్లాస్టిక్ కుండీలు సిమెంట్ తొట్టెలను వాడుతున్నారు. తమలపాకు, పాలకూర, మెంతికూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు, ఉల్లి, పచ్చిమిర్చి, వంకాయ, టమాట, క్యారెట్, క్యాబేజీ వంటి కాయగూరలు, బీర, పొట్లకాయ, దోస, గుమ్మడి వంటి తీగజాతి కూరలు, సపోట, మామిడి, జామ, తీపి నారింజ, బొప్పాయి, అంజూర వంటి పండ్ల మొక్కలను, జొన్న, తెల్లజిల్లేడును పెంచుతున్నారు. కోకోపిట్, మట్టి, కంపోస్టులు సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కూరగాయ మొక్కల పెంపకంలో వాడుతున్నారు. పండ్ల మొక్కలకు రెండుపాళ్లు మట్టి, ఒకపాలు కంపోస్టు, కొంచెం కోకోపిట్‌ను కలిపిన మిశ్రమాన్ని వాడుతున్నారు. మొక్కలకు పోషకాలను అందించేందుకు 15 రోజులకోసారి జీవామృతం పాదుల్లో పోస్తారు. పంట వ్యర్థాలు, వంటì ంటి వ్యర్థాలతో కంపోస్టు ఎరువును తయారు చేసుకున్న ఇంటిపంటలకు ఎరువులను వాడుతున్నారు. తీగజాతి కూరగాయలకు పందిరిగా నైలాన్ వలను ఏర్పాటు చేశారు. పంటకాలం పూర్తయ్యాక కుండీల్లో రెండు పిడికెళ్లు మట్టి, కంపోస్టును కలుపుతారు. పిండినల్లి నివారణకు కలబంద రసం దఫదఫాలుగా పంటలను విత్తుకోవటం వల్ల ఏడాదంతా కూరగాయలు లభిస్తున్నాయి. రసం పీల్చే పురుగుల నివారణకు లీ. నీటికి 5 మి లీ. వేపనూనె కలిపి పిచికారీ చేస్తున్నారు. పిండినల్లి నివారణకు అర లీటరు కలబంద రసాన్ని 5 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసి పిండినల్లిని నివారిస్తున్నారు. పురుగుల నివారణకు లీటరు గంజి ద్రావణం 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నారు. లద్దె పురుగు నివారణకు పచ్చిమిరప, అల్లం, వెల్లుల్లి కషాయం, లింగాకర్షక బుట్టలను వాడుతున్నారు. డ్రిప్పు ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నారు. నలుగురు సభ్యులు గల తమ కుటుంబానికి అవసరమైనదానికన్నా మూడురెట్లు అధికంగా కూరగాయలను పండిస్తున్నారు. వాటిని బంధువులు, ఇరుగు పొరుగుకూ పంచుతున్నారు. శివరామ్ ప్రసాద్ స్ఫూర్తితో బంధువులు, స్నేహితులు ఇంటిపంటల సాగును చేపట్టడం ముదావహం. – తానేటి దొరబాబు, సాక్షి, తణుకు, పశ్చిమగోదావరి జిల్లా ఇంటిపంటల సాగు ఎవరికైనా సాధ్యమే... రసాయనాలతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లే మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. రోజూ కొద్దిగా సమయం వెచ్చిస్తే ఇంటిపట్టునే మనకు మనం కూరగాయలు సాగు చేసుకోవచ్చు. పెద్దగా స్థలం లేకపోయినా కుండీల్లో సొంతంగా పండించుకోవచ్చు. చెత్తనే ఎరువుగా మార్చుకోవచ్చు. కొద్దిగా శ్రమించే వారెవరికైనా ఇది సాధ్యమే. – డాక్టర్ ఎస్.శివరామప్రసాద్ (94411 49411),విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త, తణుకు -
రైతుమిత్ర పెనుమాక పంచగవ్య!
పంచగవ్యతో సేంద్రియ దిగుబడులకు భరోసా అన్ని రకాల పంటలతోపాటు ఆక్వా చెరువుల్లోనూ మెరుగైన దిగుబడులు పదకొండేళ్లుగా నాణ్యమైన పంచగవ్యను రైతులకందిస్తున్న యువకుడు పంచగవ్యను వ్యక్తిగత శ్రద్ధతో త్రికరణశుద్ధిగా తయారు చేస్తేనే సత్ఫలితాలు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించే రైతులకు మంచి దిగుబడులు సాధించడానికి ద్రవరూప సేంద్రియ ఎరువులు చక్కని సాధనాలుగా నిలుస్తాయి. ఈ కోవలోనిదే ‘పంచగవ్య’. జీవామృతాన్ని అనుకున్న తర్వాత 48 గంటల్లో వాడకానికి సిద్ధం చేసుకోవచ్చు. కానీ, పంచగవ్య సిద్ధం కావాలంటే 21 రోజులు పడుతుంది. పంచగవ్య గురించి పెద్దగా తెలియని 11 ఏళ్ల క్రితం నుంచే నిబద్ధతతో తయారు చేసి అందుబాటులో ఉంచుతూ.. దీని తయారీపై, వాడకంపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు యువ రైతు భీమవరపు సురేందర్‌రెడ్డి. పంచగవ్య నాణ్యతలో రాజీ లేకుండా కృషి చేస్తుండటం విశేషం. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి దోహదపడుతూనే.. విలువలతో కూడిన స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్న సురేందర్‌రెడ్డి గ్రామీణ యువతకు ఆదర్శప్రాయుడు. రసాయన అవశేషాల్లేని అమృతాహారాన్ని సమాజానికి అందించడమే లక్ష్యంగా భీమవరపు సురేందర్‌రెడ్డి అనే యువకుడు నాణ్యమైన పంచగవ్యను నియమబద్ధమైన రీతిలో తయారు చేసి, స్వల్ప లాభంతోనే రైతులకు అందుబాటులో తెస్తున్నారు. వందలాది మంది సేంద్రియ రైతులకు తోడ్పాటునందిస్తున్నారు. ఏడాది పొడవునా బహుళ పంటల సాగుకు పేరెన్నికగన్న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక ఆయన స్వగ్రామం. 39 ఏళ్ల సురేందర్‌రెడ్డి పంచగవ్య తయారీలో పదకొండేళ్ల అనుభవం గడించడం విశేషం. నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. బంధువుల తోడ్పాటుతో పదో తరగతి పూర్తి చేసిన తర్వాత చదువుకు స్వస్తి చెప్పి.. రసాయనిక పురుగుమందుల కంపెనీలో నాలుగేళ్లు చిరుద్యోగం చేశాడు. సేంద్రియ వ్యవసాయ వ్యాప్తి లక్ష్యంగా ఏర్పాటైన నీలగిరి ఫౌండేషన్ గ్రామీణ యువతకు వర్మీకంపోస్టు, పంచగవ్య తదితరాల తయారీ, వాడకంపై శిక్షణ ఇస్తుండేది. ఆ సంస్థలో పనిలో కుదిరిన సురేందర్‌రెడ్డి రెండేళ్లలో నాణ్యమైన వర్మీకంపోస్టు, పంచగవ్య తయారీ పద్ధతులపై పట్టు సాధించారు. 2006 నుంచి పంచగవ్య తయారీపైనే దృష్టి సారించారు. నాణ్యతే ప్రాణం.. సేంద్రియ పంటల సాగులో నాణ్యమైన అధిక పంట దిగుబడులు సాధించడానికి పంచగవ్య చాలా ఉపయోగకరమన్న వాస్తవాన్ని ఏళ్ల తరబడి రైతుల సాంగత్యంలో గ్రహించానని ఆయన అంటాడు. పంచగవ్య నాణ్యంగా తయారైందా లేదా అన్నది రైతు పొలంలో వాడిన తర్వాతే రుజువు అవుతుంది. పంచగవ్య నాసిరకంగా ఉంటే రైతు నష్టపోక తప్పదు. అందుకే నాణ్యత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ లోటుపాట్లు లేకుండా చూసుకోవడమే తన అభిమతమని అంటారు. ఈ విషయం గ్రహించారు కాబట్టే అనేక జిల్లాలు దాటి తన వద్దకు వచ్చి వివిధ రకాల పంటలు, పండ్ల తోటలు పండించే రైతులు పంచగవ్యను తీసుకెళుతూ ఉంటారని సురేందర్‌రెడ్డి గర్వంగా చెబుతారు. పంచగవ్య కొనుగోలు చేయడానికి వచ్చిన రైతుకు సురేందర్‌రెడ్డి.. తొలుత దాని తయారు చేసుకునే పద్ధతిని, వాడుకునే పద్ధతిని తన పని తాను చేసుకుంటూనే ఓపికగా వివరిస్తారు. పంచగవ్య తయారీలో వాడే ఉత్పాదకాల నాణ్యతలో రాజీపడకుండా ఉండటం, తయారీ ప్రక్రియలో 21 రోజుల పాటు కూలీలపై ఆధారపడకుండా ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధతో పనిచేయడం ఎంతో ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని ఆయన ఆచరిస్తూ రైతులకు తెలియజెబుతారు. పంచగవ్య తయారీలో సందేహాల గురించి, పంటలపై వాడకం గురించి పగటి పూట తనకు ఫోను చేసే రైతులకు ఆయన సూచనలు అందిస్తూ ఉంటారు. 12 డ్రమ్ముల్లో బ్యాచ్‌కు 1,300 లీటర్ల చొప్పున పంచగవ్యను తయారు చేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో తయారు చేయడం వల్ల తనకు లీటరుకు రూ. 78 ఖర్చు అవుతున్నదని, రూ. 90కే రైతుకు అందిస్తున్నామన్నారు. 2015–16లో సుమారు 30 వేల లీటర్ల పంచగవ్యను రైతులకు అందించానన్నారు. పంచగవ్య తయారీ ఇలా.. డ్రమ్ములో పంచగవ్య తయారీకి కావలసినవి : 1. నాటు ఆవు పేడ 5 కిలోలు 2. నాటు ఆవు నెయ్యి అర కేజీ 3. బూడిద గుమ్మడి కాయ తురుము కిలో 4. మిగలపండిన డజను అరటి పండ్ల గుజ్జు.. ఈ నాలుగింటిని ప్లాస్టిక్ బక్కెట్లో వేసి బాగా కలపాలి. బక్కెట్‌కు పల్చటి తడి వస్త్రం లేదా తడి గన్నీ బ్యాగ్‌ను కప్పాలి. రోజూ ఉదయం, సాయంత్రం నిమిషం పాటు కలియదిప్పాలి. కుక్కలు దరి చేరకుండా జాగ్రత్తపడాలి. బక్కెట్ చుట్టూ చీమల మందు చల్లాలి. 5వ రోజున బక్కెట్లో నుంచి ఈ మిశ్రమాన్ని పెద్ద డ్రమ్ములో వేసి మరికొన్నిటిని కలపాలి.. 5. నాటు ఆవు పాలు 2 లీటర్లు 6. నాటు ఆవు పెరుగు 2 కిలోలు 7. నాటు ఆవు మూత్రం 3 లీటర్లు 8. కల్లు 3 లీటర్లు (ఈస్ట్‌తో తయారు చేసిన కల్లు పనికిరాదు. నాణ్యమైన తాటి/ఈత కల్లు వాడాలి) 9. లేత కొబ్బరి నీళ్లు 3 లీటర్లు (ఆలయాల్లో కొట్టిన ముదిరిన కొబ్బరి కాయల నీళ్లు పనికిరావు) 10. నల్లబెల్లం కిలో (3 లీటర్ల నీటిలో ఈ బెల్లాన్ని కలిపి పానకం సిద్ధం చేసుకోవాలి) 11. దర్భ 2 పరకలు 12. పాత పంచగవ్య 1–2 లీటర్లు (మదర్ కల్చర్‌గా ఉపయోగపడుతుంది) 13. సూడోమోనాస్ అర లీటరు (పౌర్ణమి రోజు సూడోమోనాస్‌ను కలిపితే పంచగవ్య డ్రమ్ములో నుంచి పొంగి పోతుంది).. వీటన్నిటినీ డ్రమ్ములో వేసి కర్రతో కలగలపాలి. మామిడి / నేరేడు / రావి / జువ్వి / జమ్మి కర్రను తీసుకొని దాని తొక్క తీసి.. పంచగవ్యను తిప్పటానికి వాడాలి. రోజూ ఉదయం, సాయంత్రం ఎంత ఎక్కువ సేపు వీలైతే అంత ఎక్కువ సేపు సవ్య దిశగా తిప్పాలి. తిప్పటం వల్ల పంచగవ్య ప్రభావశీలత పెరుగుతుంది. ఇలా 21 రోజులు తిప్పుతూ ఉండాలి. కూలీలపై ఆధారపడకుండా స్వయంగా సొంతదారే శ్రద్ధగా, క్రమం తప్పకుండా తిప్పినప్పుడే నాణ్యమైన పంచగవ్య తయారవుతుంది. పౌర్ణమి నాడు పంచగవ్య తయారు చేĶæనారంభిస్తే డ్రమ్ములో నుంచి పొంగిపోతుంది. పాలిచ్చే నాటు ఆవు మూత్రం, పేడ శ్రేష్టం.. ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు తదితరాల నాణ్యతపైనే పంచగవ్య నాణ్యత ఆధారపడి ఉంటుందని సురేందర్‌రెడ్డి నమ్ముతున్నారు. పంచగవ్య తయారీలో మోపురం ఉన్న నాటు ఆవు పేడ, మూత్రం ప్రభావశీలంగా పనిచేస్తాయని, పాలిచ్చే ఆవు నుంచి సేకరించినవైతే మరింత శ్రేష్టమని తన అనుభవంలో గ్రహించానని చెప్పారు. షెడ్లో గచ్చుపైన పోసిన ఆవు మూత్రాన్ని సేకరించిన మూత్రం కన్నా, ఆవు పోస్తుండగానే బక్కెట్లోకి సేకరించిన మూత్రం శ్రేష్టంగా ఉంటుందని ఆయన అంటారు. ఆవు నుంచి నేరుగా సేకరించిన మూత్రాన్ని రూ. 12కు కొనుగోలు చేసి పంచగవ్య తయారీలో వాడుతున్నానని ఆయన తెలిపారు. పోషకాల గని అయిన బూడిద గుమ్మడి కాయ గుజ్జు, జీవన ఎరువు సూడోమోనాస్లను కూడా పంచగవ్య తయారీలో వినియోగించడం మంచిదని తన అనుభవంలో గ్రహించానని సురేందర్‌రెడ్డి చెబుతున్నారు. పౌర్ణమి రోజుల్లోనే పిచికారీ చేయాలి.. పంచగవ్య తయారైన తర్వాత నెలల పాటు నిల్వ ఉంటుంది. పంచగవ్యను పొలంలో సాగునీటితో కలిపి ఎకరానికి 20 లీటర్ల చొప్పున అందించవచ్చు. ప్రతి 15 రోజులకోసారి పంటలపైన వంద లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున పంచగవ్య కలిపి పిచికారీ చేయాలని సురేందర్‌రెడ్డి సూచిస్తున్నారు. పిచికారీకి పౌర్ణమి రోజులు అనుకూలమని, పంట పొలానికి నీటితో కలిపి పారించడానికి అమావాస్య రోజులు అనుకూలమని అన్నారు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: కె. క్రాంతికుమార్‌రెడ్డి, నేచర్స్ వాయిస్ రైతుల అవసరాలకు అనుగుణంగా పంచగవ్యను పరిపుష్టం చేశా.. మా ప్రాంతంలో ఎకరానికి 25 –30 బస్తాల రసాయనిక ఎరువులు వాడుతున్నారు. మిరప వంటి పంటలపై దాదాపు రోజూ రసాయనిక పురుగుమందులు వాడుతున్నారు. అయితే, ప్రకృతి / సేంద్రియ వ్యవసాయంలో పంచగవ్య అన్ని రకాల పంటల పెరుగుదలకు తోడ్పడడమే కాకుండా చీడపీడలకు టీకా మాదిరిగా పనిచేస్తున్నదని రైతుల అనుభవాల ద్వారా గ్రహించాను. పంచగవ్య తయారీలో ఐదు రకాల ఉత్పాదకాలనే వాడాల్సి ఉన్నప్పటికీ.. రైతుల అనుభవాలను, అవసరాలను బట్టి 13 రకాలను కలుపుతూ ప్రభావశీలమైన పంచగవ్యను తయారు చేస్తున్నాను. నా దగ్గరకు వచ్చే రైతులకు ముందు తయారు చేసుకోవడం ఎలాగో నేర్పిస్తాను. తీరిక ఉంటే సొంతంగా చేసుకోమని చెబుతున్నాను. భారీ మొత్తంలో తయారు చేస్తాను కాబట్టి రైతు తయారు చేసుకున్నప్పటికన్నా నాకు తక్కువ ఖర్చు అవుతుంది. స్వల్ప లాభం కలుపుకుని రైతుకు ఇస్తున్నాను. నాణ్యతలో రాజీ పడకుండా ఉండటం వల్లనే వందలాది మంది రైతులు రెండు రాష్ట్రాల నుంచి పంచగవ్య తీసుకెళ్తున్నారు. కూరగాయల్లో 18%, పసుపులో 22% దిగుబడి పెరిగిందని రైతులు చెప్పారు. ధాన్యాలు, పండ్లు దిగుబడి పెరగడమే కాకుండా నిల్వ ఉండే సామర్థ్యం, రుచి పెరిగింది. మల్లెపూలు, కొత్తిమీర, కరివేపాకు పరిమళం పెరిగింది. మిరపలో ముడత (బొబ్బర) అదుపులోకి వచ్చింది. రొయ్యలు, చేపల చెరువుల్లో నీటిలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, మరణాల రేటు తగ్గింది. రొయ్యలు, చేపల బరువు కూడా పెరిగిందని రైతులు చెబుతున్నారు. – భీమవరపు సురేందర్‌రెడ్డి (94417 53975, 83414 55658), పెనుమాక, గుంటూరు జిల్లా -
ఇది ‘ఇంటిపంట’ల కాలం!
ఇంటి పంట సాక్షి మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్పై అమితాసక్తిని రేకెత్తించింది. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నప్పటికీ.. ఉన్నంతలో తులసితోపాటు నాలుగు పూలమొక్కలు పెంచుకోవడం చాలా ఇళ్లలో కనిపించేదే. అయితే, విష రసాయనాల అవశేషాలు లేని ఆకుకూరలు, కూరగాయల ఆవశ్యకతపై చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను స్వయంగా సేంద్రియ పంటల సాగుకు ఉపక్రమింపజేసింది ‘ఇంటిపంట’. డాబాపైన, పెరట్లో, బాల్కనీల్లో.. వీలును బట్టి సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో ‘ఇంటిపంట’లు సాగు చేస్తున్న వారెందరో ఉన్నారు. జనాభా సంఖ్యలో వీరి సంఖ్య కొంచెమే కావచ్చు. కానీ, వీరి కృషి ఇతరుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఇంటిపంట’ కాలమ్‌ను ప్రతి శనివారం మళ్లీ ప్రచురించాలని ‘సాక్షి’ సంకల్పించింది. ఈ సందర్భంగా ‘ఇంటిపంట’తో స్ఫూర్తి పొందిన కొందరి అనుభవాలు క్లుప్తంగా.. తోటకూర, టమాటా..! ‘ఇంటిపంట’ కథనాలు చదివి స్ఫూర్తిపొంది ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ ప్రారంభించాను. మా డాబాపైన కొన్ని కుండీలు, నల్ల గ్రోబాగ్స్‌లో వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, వేపపిండితో మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకొని వాడుతున్నా. టమాటాతోపాటు చూడముచ్చటగా ఉండే చెర్రీ టమాటా సాగు చేశా. ప్రస్తుతం తోటకూర, గోంగూర, బెండ, మిరప కుండీల్లో పెంచుతున్నా. ఈ కుండీల మధ్యలో కొన్ని పూల మొక్కలు, బోన్సాయ్ మొక్కలు కూడా పెంచుతున్నా. ఇంటిపంట గూగుల్, ఫేస్బుక్ గ్రూప్‌ల ద్వారా సూచనలు, సలహాలు పొందుతున్నాను. - కాసా హరినాథ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కేపీహెచ్‌బీ 7 ఫేజ్, హైదరాబాద్ జీవామృతం, అమృత్‌పానీ.. మూడేళ్ల క్రితం ‘ఇంటిపంట’ కాలమ్ ద్వారా స్ఫూర్తి పొందా. మేడ మీద 150 బియ్యం సంచుల్లో ఆకుకూరలతోపాటు జొన్న. సజ్జ, మొక్కజొన్న మొక్కలను గతంలో పండించా. ప్రస్తుతం ఇంటిపక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చుక్కకూర, పాలకూర, తోటకూరతోపాటు జొన్న, సజ్జ, బీర, కాకర సాగుచేస్తున్నా. ఘనజీవామృతం, జీవామృతం, అమృత్‌పానీ వంటివి స్వయంగా తయారు చేసుకొని, క్రమం తప్పకుండా వాడుతూ చక్కని దిగుబడి సాధిస్తున్నా. నగరంలో ఉంటూ ఇంటిపంటల ద్వారా కొంతమేరకైనా సహజాహారాన్ని పండించుకోగలగడం ఆనందంగా ఉంది, ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న పెద్దలు, పిల్లలకు మెలకువలను ఓపిగ్గా వివరిస్తున్నా.. -ఎస్. సత్యనారాయణ మూర్తి విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి, రామనామక్షేత్రం, గుంటూరు ‘ఇంటిపంట’ల సేవలో.. వనస్థలిపురం ప్రాంతంలో ‘ఇంటిపంట’ల సాగు వ్యాప్తికి కృషి చేస్తున్నా. గతంలో సాక్షి తోడ్పాటుతో వర్క్‌షాప్ నిర్వహించాం. ఇటీవల ఉద్యాన శాఖ తోడ్పాటుతో ఇంటిపంట సబ్సిడీ కిట్లను స్థానికులకు పంపిణీ చేయించాను. ఇంటిపంటల సాగులో స్థానికులకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నా. మా ఇంటి వద్ద జీవామృతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతున్నా. - భావనా శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం, వనస్థలిపురం, హైదరాబాద్ ‘ఇంటిపంట’ శిక్షణ పొందా.. మా ఇంటిపైన కుండీలు, గ్రోబాగ్స్, సిల్పాలిన్ మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాను. మూడేళ్ల క్రితం ఇంటిపంట శీర్షిక ద్వారా స్ఫూర్తిపొందాను. వనస్థలిపురంలో సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నేను, నా భార్య పాల్గొన్నాం. అప్పటి నుంచి సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్నాం. వర్మీకంపోస్టు, ఎర్రమట్టి, కోకోపిట్, వేపపిండి కలిపిన మిశ్రమాన్ని కుండీల్లో వేస్తున్నాను. స్వయంగా తయారుచేసుకున్న జీవామృతంతోపాటు వేప నూనె 10 రోజులకోసారి వాడుతున్నాం. గత వేసవిలోనూ వంకాయల కాపు బాగా వచ్చింది. ప్రస్తుతం మిరప, వంగ, బెండ, బీర, దొండ, గోరుచిక్కుడు, పాలకూర మా గార్డెన్లో ఉన్నాయి. కొందరం కలసికట్టుగా ఉంటూ ఇంటిపంటల సాగు సజావుగా కొనసాగిస్తున్నాం..’’ - కొల్లి దుర్గాప్రసాద్, కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి, కమలానగర్, హైదరాబాద్ పూల మొక్కల నుంచి కూరగాయల వైపు.. పూల మొక్కలు పెంచే అలవాటుండేది. ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ స్ఫూర్తితోనే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాను. మేడ మీద కుండీల్లో అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నా. బెండ మొక్కలున్న కుండీల్లో ఖాళీ ఎక్కువగా ఉందని తాజాగా ఎర్ర ముల్లంగిని సాగు చేశా. దిగుబడి బాగుంది. ఫేస్బుక్, గూగుల్‌లో ఇంటిపంట గ్రూప్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. - కందిమళ్ల వేణుగోపాలరెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, టీసీఎస్, హైదరాబాద్ ఫేస్బుక్, గూగుల్‌లో ‘ఇంటిపంట’! ‘ఇంటిపంట’లు సాగుచేసే వారి మధ్య స్నేహానికి ఫేస్బుక్, గూగుల్ గ్రూప్‌లు వారధిగా నిలుస్తున్నాయి. ఫేస్బుక్లో INTIPANTA - OrganicKitchen/Terrace Gardening గూప్ ఉంది. ఇందులో సభ్యుల సంఖ్య 4,500 దాటింది! గూగుల్ గ్రూప్‌లో 773 మంది సభ్యులున్నారు. సమాచార మార్పిడికి, సలహాలకు, సంప్రదింపులకు ఇవి దోహదపడుతున్నాయి. గూగుల్ గ్రూప్ అడ్రస్ ఇది: https://groups.google.com/ forum/#!forum/intipanta intipanta@googlegroups.comకు మెయిల్ ఇస్తే ఇందులో వెంటనే సభ్యత్వం పొందొచ్చు.