సేంద్రియ పంటల లోగిలి | Organic crops | Sakshi
Sakshi News home page

సేంద్రియ పంటల లోగిలి

Published Mon, Feb 27 2017 10:51 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

సేంద్రియ పంటల లోగిలి

సేంద్రియ పంటల లోగిలి

మూడంతస్తుల మేడ అది. రకరకాల పండ్లు, పూల మొక్కలతో  ఆ ఇంటి ఆవరణ అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికితే... మొదటి అంతస్తులోకి ప్రవేశించగానే సిమెంట్‌ తొట్లలో పెంచిన వివిధ రకాల కూరగాయ మొక్కలు సందర్శకులను అబ్బుర పరుస్తాయి. రెండో అంతస్తులో పందిరిపై అల్లుకున్న తీగజాతి కూరలు తమది పొదరిల్లని చెప్పకనే చెపుతుంటే... మూడో అంతస్తులో కుండీల్లో పెరుగుతున్న పండ్ల చెట్లు రకరకాల పళ్లతో సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. డాక్టర్‌ సూరపనేని శివరామ్‌ప్రసాద్‌ మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా తణుకులోనే స్థిరపడ్డారు. పంటల సాగులో విచ్చలవిడి రసాయనాల వాడకాన్ని అతి దగ్గర నుంచి గమనించిన ఆయన ఐదేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలను సాగు చేస్తున్నారు.  

15 రోజులకోసారి జీవామృతం
ఇంటిపంటల పెంపకంలో 200కు పైగా మట్టి, ప్లాస్టిక్‌ కుండీలు సిమెంట్‌ తొట్టెలను వాడుతున్నారు. తమలపాకు, పాలకూర, మెంతికూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు, ఉల్లి, పచ్చిమిర్చి, వంకాయ, టమాట, క్యారెట్, క్యాబేజీ వంటి కాయగూరలు, బీర, పొట్లకాయ, దోస, గుమ్మడి వంటి తీగజాతి కూరలు, సపోట, మామిడి, జామ, తీపి నారింజ, బొప్పాయి, అంజూర వంటి పండ్ల మొక్కలను, జొన్న, తెల్లజిల్లేడును పెంచుతున్నారు. కోకోపిట్, మట్టి, కంపోస్టులు సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కూరగాయ మొక్కల పెంపకంలో వాడుతున్నారు. పండ్ల మొక్కలకు రెండుపాళ్లు మట్టి, ఒకపాలు కంపోస్టు, కొంచెం కోకోపిట్‌ను కలిపిన మిశ్రమాన్ని వాడుతున్నారు.

మొక్కలకు పోషకాలను అందించేందుకు 15 రోజులకోసారి జీవామృతం పాదుల్లో పోస్తారు. పంట వ్యర్థాలు, వంటì ంటి వ్యర్థాలతో కంపోస్టు ఎరువును తయారు చేసుకున్న ఇంటిపంటలకు ఎరువులను వాడుతున్నారు. తీగజాతి కూరగాయలకు పందిరిగా నైలాన్‌ వలను ఏర్పాటు చేశారు. పంటకాలం పూర్తయ్యాక కుండీల్లో రెండు పిడికెళ్లు మట్టి, కంపోస్టును కలుపుతారు.

పిండినల్లి నివారణకు కలబంద రసం
దఫదఫాలుగా పంటలను విత్తుకోవటం వల్ల ఏడాదంతా కూరగాయలు లభిస్తున్నాయి. రసం పీల్చే పురుగుల నివారణకు లీ. నీటికి 5 మి లీ. వేపనూనె కలిపి పిచికారీ చేస్తున్నారు. పిండినల్లి నివారణకు అర లీటరు కలబంద రసాన్ని 5 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసి పిండినల్లిని నివారిస్తున్నారు. పురుగుల నివారణకు లీటరు గంజి ద్రావణం 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నారు. లద్దె పురుగు నివారణకు పచ్చిమిరప, అల్లం, వెల్లుల్లి కషాయం, లింగాకర్షక బుట్టలను వాడుతున్నారు. డ్రిప్పు ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నారు. నలుగురు సభ్యులు గల తమ కుటుంబానికి అవసరమైనదానికన్నా మూడురెట్లు అధికంగా కూరగాయలను పండిస్తున్నారు. వాటిని బంధువులు, ఇరుగు పొరుగుకూ పంచుతున్నారు. శివరామ్‌ ప్రసాద్‌ స్ఫూర్తితో బంధువులు, స్నేహితులు ఇంటిపంటల సాగును చేపట్టడం ముదావహం.
– తానేటి దొరబాబు, సాక్షి, తణుకు, పశ్చిమగోదావరి జిల్లా

ఇంటిపంటల సాగు ఎవరికైనా సాధ్యమే...
రసాయనాలతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లే మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. రోజూ కొద్దిగా సమయం వెచ్చిస్తే ఇంటిపట్టునే మనకు మనం కూరగాయలు సాగు చేసుకోవచ్చు. పెద్దగా స్థలం లేకపోయినా కుండీల్లో సొంతంగా పండించుకోవచ్చు. చెత్తనే ఎరువుగా మార్చుకోవచ్చు. కొద్దిగా శ్రమించే వారెవరికైనా ఇది సాధ్యమే.
– డాక్టర్‌ ఎస్‌.శివరామప్రసాద్‌ (94411 49411),విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త, తణుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement