తునికి కేవీకే ప్రాంగణంలో గత వేసవిలో బ్యాగుల్లో సాగైన్చ కాకర పంట
సేంద్రియ కూరగాయ పంటలను పొలంలో సాధారణ పద్ధతిలో నేలలో కన్నా.. ప్రత్యేకమైన బ్యాగుల్లో సాగు చేయటం ద్వారా రెట్టింపు కన్నా ఎక్కువగా దిగుబడి తీయవచ్చని తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య సేంద్రియ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి–జూలై నెలల మధ్య ప్రయోగాత్మక సాగులో రుజువైంది. ఈ పంటల సాగును శాస్త్రవేత్తలు ఆసాంతమూ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి, శాస్త్రీయంగా గణాంకాలను నమోదు చేశారు.
నగరాలు, పట్టణాలకు దగ్గల్లోని భూసారం అంతగా లేని భూముల్లో, రసాయనాలతో కలుషితమైన లేదా చౌడు తదితర సమస్యాత్మక భూముల్లో బ్యాగు సేద్యం ద్వారా పెద్ద ఎత్తున సేంద్రియ కూరగాయల ఉత్పత్తి పొందడానికి, తద్వారా అన్‌సీజన్‌లో రైతులు అధికాదాయం పొందడానికి అవకాశం ఉన్నట్లు ఈ ప్రయోగం ద్వారా వెల్లడైందని కేవీకే అధ్యక్షుడు టి. వినోద్‌రావు తెలిపారు. సేంద్రియ రైతు శాస్త్రవేత్త ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు మార్గదర్శకత్వంలో కేవీకే శాస్త్రవేత్తల బృందం బ్యాగు సాగులో అద్భుత దిగుబడులు రాబడుతోంది.
ఎత్తు బెడ్లపై సేంద్రియ కాకర సాగు
కాకరను వేసవి పంటగా నేలపై ఎత్తు బెడ్లపై ఏక పంటగా సాగు చేయగా.. ఎకరానికి 4,480 కిలోల (4.48 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. తునికి కేవీకే ప్రాంగణంలోని 12.5 సెంట్ల భూమి (0.125 ఎకరం)లో సాధారణ పందిరి పద్ధతిలో 1,000 కాకర విత్తనాలను ఎత్తయిన బెడ్లపై ఫిబ్రవరి 25న విత్తారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో బిందు సేద్యం ద్వారా పండించారు.
పంట కోత ఏప్రిల్ 17 నుంచి జూలై12 వరకు కాకర కాయలు కోశారు. ఈ వెయ్యి మొక్కల నుంచి∙560.5 కిలోల దిగుబడి వచ్చింది. ఒక్కో మొక్క నుంచి 0.56 కిలోల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. ఎత్తు బెడ్స్ పద్ధతిలో సగటున ఎకరానికి 4,480 కిలోల కాకర దిగుబడి రాగా, సగటున ఎకరానికి రూ. 1,92,000 ఖర్చయినట్లు (కౌలు కాకుండా) శాస్త్రవేత్తలు రికార్డు చేశారు.
బ్యాగుల్లో కాకర సాగు
పక్క పొలంలోనే ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకర పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయగా.. సగటున ఎకరానికి 8,000 కిలోల (8 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. 25 సెంట్ల భూమిలో 2023 ఫిబ్రవరి 2న 616 బ్యాగుల్లో, ఒక్కో బ్యాగులో రెండు చొప్పున, కాకర విత్తనాలను పెట్టి, మొక్కలను పందిరికి పాకించారు. విత్తిన 70 రోజులకు మొదలై 175 రోజుల (జూలై 25) వరకు కాయలు కోశారు. మొత్తం 2 టన్నుల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. సగటున ఎకరానికి 8 టన్నుల కాకర దిగుబడి వచ్చింది. బ్యాగుల్లో కాకర సాగుకు సగటున ఎకరానికి (కౌలు కాకుండా) రూ. 2,40,000 ఖర్చయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
కాకరతో పాటు.. అదే పొలంలో టొమాటో, పుదీనా, క్యాబేజీ కూడా..
ఎత్తు బెడ్ల సాగులో కాకర ఒక్కటే పంట సాగు చేయగా, బ్యాగు సాగులో కాకరతో పాటు మరికొన్ని బ్యాగుల్లో టొమాటో, పుదీనా, క్యాబేజీ పంటలు కూడా సాగు చేశారు. ఈ పంటల ద్వారా 3,640 కిలోల(3.64 టన్నులు/ఎకరం) దిగుబడి అదనంగా రావటం విశేషం. 25 సెంట్ల భూమిలో మొత్తం 1,566 బ్యాగులు పెట్టారు. అందులో 616 బ్యాగుల్లో రెండేసి కాకర మొక్కలు (2 టన్నుల దిగుబడి), 410 బ్యాగుల్లో రెండేసి క్యాబేజీ మొక్కలు (374 కిలోల దిగుబడి), 180 బ్యాగుల్లో రెండేసి టొమాటో మొక్కలు పెట్టారు. మరో 360 బ్యాగుల్లో ఒక్కోటి చొప్పున టొమాటో, పుదీనా మొక్కలు కలిపి నాటారు. మొత్తం 453 కిలోల టొమాటోలు, 83.6 కిలోల పుదీనా దిగుబడి వచ్చింది.
బ్యాగుల్లో సేంద్రియ సాగు ఇలా..
అడుగున్నర ఎత్తు, అడుగు వెడల్పు ఉండే పాలిథిన్ బ్యాగులో 15 కిలోల పశువుల ఎరువు, 15 కిలోల ఎర్రమట్టి, 100 గ్రా. వేపపిండి కలిపిన మిశ్రమాన్ని నింపారు. జీవామృతం ప్రతి 10–15 రోజులకోసారి పాదుల్లో పోశారు. పంచగవ్య, రాజ్మాగింజల ద్రావణం, కొబ్బరి నీరు నాలుగైదు సార్లు పిచికారీ చేశారు. వేసవిలో కురిసిన అకాల వర్షాల వల్ల లీఫ్ బ్లైట్ వంటి తెగుళ్లు సోకినప్పటికీ సేంద్రియ పద్ధతుల్లోనే వాటిని నియంత్రించటం విశేషం. ఈ కేవీకేలో బ్యాగు సేద్యంపై (గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు) రెండు బ్యాచ్‌లలో ప్రయోగాలు పూర్తయ్యాయి.
10న నందిగామలో ప్రకృతి సేద్యంపై శిక్షణ
సెప్టెంబర్ 10(ఆదివారం)న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు విజయ్ రామ్ అవగాహన కల్పిస్తారు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. 150 మందికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు బాలకృష్ణారెడ్డి తెలిపారు. వివరాలకు.. 90281 85184, 64091 11427.
వచ్చే నెల 4 నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ
ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సకశేరుక చీడల యాజమాన్య విభాగం సెప్టెంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇవ్వనుంది. తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు, నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వి. సునీత తెలిపారు. అభ్యర్థులకు ఉచిత భోజన వసతులు కల్పిస్తామన్నారు. వివరాలకు.. 94948 75941.
(చదవండి: అర్బన్ కౌలు రైతుల పాట్లు!..కొద్దిపాటి స్థలంలోనే సిటీ ఫార్మింగ్! )
Comments
Please login to add a commentAdd a comment