Field survey
-
ఎన్నికల సన్నద్ధతపై క్షేత్రస్థాయి పరిశీలన
సాక్షి, అమరావతి/ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై ఇప్పటి వరకు జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఇక క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. వారానికి కనీసం మూడు జిల్లాల చొప్పున.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా 15 జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలని ముఖేష్‌కుమార్ మీనా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల కోడ్ అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేస్తున్న విధానం, వాటి పరిష్కారం తీరుపై ఆరా తీశారు. అలాగే స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల కోసం ఎంపిక చేసిన ఏలూరు సీఆర్ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేశారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తీసుకువచ్చి కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ముఖేష్‌కుమార్‌కు అధికారులు తెలియజేశారు. ఈ పర్యటనల సందర్భంగా ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జేసీ బి.లావణ్య, తూర్పుగోదావరి కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు రాష్ట్ర పార్టీని సన్నద్ధం చేసేలా..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడంలో భాగంగా బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు రాను న్నారు. ముఖ్యంగా పార్టీలో నాయకులు, కార్యక ర్తల మధ్య మెరుగైన సమన్వయ సాధన కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఇతర నేతలు సమీక్షించనున్నారు. గురువారం నుంచి వరుసగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో ఎక్కడికక్కడ సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలతో భేటీ అయ్యి ఇప్పటి వరకు చేపట్టిన, చేపడుతున్న కార్యకలాపాలను సమీక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల్లో మండల పార్టీ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో, పట్టణ ప్రాంతాల్లోని స్థానా ల్లో డివిజన్, ఆపై స్థాయి నాయకులతో సమావేశమై ఆయా అంశాలపై సమీక్ష నిర్వహి స్తారు. గురువారం శివప్రకాశ్ నాగర్‌కర్నూల్, హైదరాబాద్ ఎంపీ స్థానాలో పర్యటించనుండగా, మిగతా నేతలకు కూడా రెండేసి లోక్‌సభ స్థానాలను కేటాయించినట్టు తెలిసింది. సునీల్ బన్సల్, ఇతర నేతలు కూడా ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌లకు కూడా కొన్ని ఎంపీ సీట్లలో నాయకుల మధ్య సమన్వయం సాధించే బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పార్టీ జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ కూడా ఈ సమీక్ష సమావేశాల్లో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిని, ముఖ్యంగా మహిళలు, ఇతర వర్గాల వారిని కలుసుకుని మద్దతును కూడగట్టాలని నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీల భేటీల నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయడంపై దృష్టి పెట్టనున్నారు. -
నేల సాగు కన్నా బ్యాగు సేద్యం మిన్న!
సేంద్రియ కూరగాయ పంటలను పొలంలో సాధారణ పద్ధతిలో నేలలో కన్నా.. ప్రత్యేకమైన బ్యాగుల్లో సాగు చేయటం ద్వారా రెట్టింపు కన్నా ఎక్కువగా దిగుబడి తీయవచ్చని తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య సేంద్రియ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి–జూలై నెలల మధ్య ప్రయోగాత్మక సాగులో రుజువైంది. ఈ పంటల సాగును శాస్త్రవేత్తలు ఆసాంతమూ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి, శాస్త్రీయంగా గణాంకాలను నమోదు చేశారు. నగరాలు, పట్టణాలకు దగ్గల్లోని భూసారం అంతగా లేని భూముల్లో, రసాయనాలతో కలుషితమైన లేదా చౌడు తదితర సమస్యాత్మక భూముల్లో బ్యాగు సేద్యం ద్వారా పెద్ద ఎత్తున సేంద్రియ కూరగాయల ఉత్పత్తి పొందడానికి, తద్వారా అన్‌సీజన్‌లో రైతులు అధికాదాయం పొందడానికి అవకాశం ఉన్నట్లు ఈ ప్రయోగం ద్వారా వెల్లడైందని కేవీకే అధ్యక్షుడు టి. వినోద్‌రావు తెలిపారు. సేంద్రియ రైతు శాస్త్రవేత్త ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు మార్గదర్శకత్వంలో కేవీకే శాస్త్రవేత్తల బృందం బ్యాగు సాగులో అద్భుత దిగుబడులు రాబడుతోంది. ఎత్తు బెడ్లపై సేంద్రియ కాకర సాగు కాకరను వేసవి పంటగా నేలపై ఎత్తు బెడ్లపై ఏక పంటగా సాగు చేయగా.. ఎకరానికి 4,480 కిలోల (4.48 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. తునికి కేవీకే ప్రాంగణంలోని 12.5 సెంట్ల భూమి (0.125 ఎకరం)లో సాధారణ పందిరి పద్ధతిలో 1,000 కాకర విత్తనాలను ఎత్తయిన బెడ్లపై ఫిబ్రవరి 25న విత్తారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో బిందు సేద్యం ద్వారా పండించారు. పంట కోత ఏప్రిల్ 17 నుంచి జూలై12 వరకు కాకర కాయలు కోశారు. ఈ వెయ్యి మొక్కల నుంచి∙560.5 కిలోల దిగుబడి వచ్చింది. ఒక్కో మొక్క నుంచి 0.56 కిలోల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. ఎత్తు బెడ్స్ పద్ధతిలో సగటున ఎకరానికి 4,480 కిలోల కాకర దిగుబడి రాగా, సగటున ఎకరానికి రూ. 1,92,000 ఖర్చయినట్లు (కౌలు కాకుండా) శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. బ్యాగుల్లో కాకర సాగు పక్క పొలంలోనే ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకర పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయగా.. సగటున ఎకరానికి 8,000 కిలోల (8 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. 25 సెంట్ల భూమిలో 2023 ఫిబ్రవరి 2న 616 బ్యాగుల్లో, ఒక్కో బ్యాగులో రెండు చొప్పున, కాకర విత్తనాలను పెట్టి, మొక్కలను పందిరికి పాకించారు. విత్తిన 70 రోజులకు మొదలై 175 రోజుల (జూలై 25) వరకు కాయలు కోశారు. మొత్తం 2 టన్నుల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. సగటున ఎకరానికి 8 టన్నుల కాకర దిగుబడి వచ్చింది. బ్యాగుల్లో కాకర సాగుకు సగటున ఎకరానికి (కౌలు కాకుండా) రూ. 2,40,000 ఖర్చయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాకరతో పాటు.. అదే పొలంలో టొమాటో, పుదీనా, క్యాబేజీ కూడా.. ఎత్తు బెడ్ల సాగులో కాకర ఒక్కటే పంట సాగు చేయగా, బ్యాగు సాగులో కాకరతో పాటు మరికొన్ని బ్యాగుల్లో టొమాటో, పుదీనా, క్యాబేజీ పంటలు కూడా సాగు చేశారు. ఈ పంటల ద్వారా 3,640 కిలోల(3.64 టన్నులు/ఎకరం) దిగుబడి అదనంగా రావటం విశేషం. 25 సెంట్ల భూమిలో మొత్తం 1,566 బ్యాగులు పెట్టారు. అందులో 616 బ్యాగుల్లో రెండేసి కాకర మొక్కలు (2 టన్నుల దిగుబడి), 410 బ్యాగుల్లో రెండేసి క్యాబేజీ మొక్కలు (374 కిలోల దిగుబడి), 180 బ్యాగుల్లో రెండేసి టొమాటో మొక్కలు పెట్టారు. మరో 360 బ్యాగుల్లో ఒక్కోటి చొప్పున టొమాటో, పుదీనా మొక్కలు కలిపి నాటారు. మొత్తం 453 కిలోల టొమాటోలు, 83.6 కిలోల పుదీనా దిగుబడి వచ్చింది. బ్యాగుల్లో సేంద్రియ సాగు ఇలా.. అడుగున్నర ఎత్తు, అడుగు వెడల్పు ఉండే పాలిథిన్ బ్యాగులో 15 కిలోల పశువుల ఎరువు, 15 కిలోల ఎర్రమట్టి, 100 గ్రా. వేపపిండి కలిపిన మిశ్రమాన్ని నింపారు. జీవామృతం ప్రతి 10–15 రోజులకోసారి పాదుల్లో పోశారు. పంచగవ్య, రాజ్మాగింజల ద్రావణం, కొబ్బరి నీరు నాలుగైదు సార్లు పిచికారీ చేశారు. వేసవిలో కురిసిన అకాల వర్షాల వల్ల లీఫ్ బ్లైట్ వంటి తెగుళ్లు సోకినప్పటికీ సేంద్రియ పద్ధతుల్లోనే వాటిని నియంత్రించటం విశేషం. ఈ కేవీకేలో బ్యాగు సేద్యంపై (గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు) రెండు బ్యాచ్‌లలో ప్రయోగాలు పూర్తయ్యాయి. 10న నందిగామలో ప్రకృతి సేద్యంపై శిక్షణ సెప్టెంబర్ 10(ఆదివారం)న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు విజయ్ రామ్ అవగాహన కల్పిస్తారు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. 150 మందికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు బాలకృష్ణారెడ్డి తెలిపారు. వివరాలకు.. 90281 85184, 64091 11427. వచ్చే నెల 4 నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సకశేరుక చీడల యాజమాన్య విభాగం సెప్టెంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇవ్వనుంది. తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు, నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వి. సునీత తెలిపారు. అభ్యర్థులకు ఉచిత భోజన వసతులు కల్పిస్తామన్నారు. వివరాలకు.. 94948 75941. (చదవండి: అర్బన్ కౌలు రైతుల పాట్లు!..కొద్దిపాటి స్థలంలోనే సిటీ ఫార్మింగ్! ) -
సర్దుబాటు!
అర్ధంతరంగా నిలిచిపోయిన ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముందుగా పైకప్పు వరకు పూర్తయిన నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పది రోజుల్లో వివరాల సేకరణ పూర్తిచేసి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. తాజా ప్రక్రియ ద్వారా జిల్లాలో సగంలో ఆగిపోయిన 2,775 ఇళ్లకు మోక్షం లభించే అవకాశం ఉంది. ఇదిలాఉంటే ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాలు పూర్తికాలేదు. ఈ ఐఏవై లక్ష్యాన్ని ‘ఇందిరమ్మ’ ఇళ్లతో భర్తీ చేయాలని యంత్రాంగం భావిస్తోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రస్తుతం రాష్ట్రంలో నిలిచిపోయింది. ఈ పథకం కింద ఇప్పటికే మంజూరైన పలు ఇళ్లకు బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. ఈ పథకంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే అభియోగాలుండడంతో పూర్తిస్థాయి విచారణకు సర్కారు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణపర్వం పూర్తయితే తప్ప పథకం ముందుకుసాగే అవకాశం లేదు. మరోవైపు ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాలు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఐఏవై లక్ష్యాన్ని భర్తీ చేసేందుకు యంత్రాంగం సరికొత్త ప్రక్రియకు తెరలేపింది. ఐఏవైలో మిగిలిపోయిన లక్ష్యాన్ని ఇందిరమ్మ ఇళ్లతో భర్తీ చేయాలని భావిస్తోంది. దీంతో కొందరికైనా లబ్ధి చేకూరుతుందని భావించిన అధికారులు.. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాధాన్యతాక్రమంలో లబ్ధిదారులను తేల్చనున్నారు. పది రోజుల్లో ఫైనల్.. 2014-15 వార్షిక సంత్సరంలో ఇందిరా ఆవాస్‌యోజన పథకం కింద జిల్లాకు 3,430 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసి.. వారికి మంజూరు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పటివరకు 655 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో 2,775 ఇళ్లు మిగిలిపోయాయి. ఇప్పటికే మంజూరైన ఐఏవై ఇళ్లలో 1,829 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. పైకప్పు పడిన వాటికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని భావించిన అధికారులు.. తాజాగా మరోమారు క్షేత్రపరిశీలనకు దిగారు. ఐఏవై లబ్ధిదారులే కాకుండా ఇందిరమ్మ పథకంలోని లబ్ధిదారులను కూడా పరిగణించి మొత్తంగా 2,775 మందిని చేర్చి ప్రయోజన ం చేకూర్చాలని నిర్ణయించారు. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసి జాబితాను ప్రభుత్వానికి పంపించాలని యంత్రాంగం నిర్ణయించింది. దీంతో తుదిజాబితాకు ప్రభుత్వం అనుమతిస్తే గత ఏడాది ఐఏవై లక్ష్యం నెరవేరే అవకాశముంది. ఐఏవైలో సర్దుబాటుతో కొత్తగా వచ్చే ఇళ్లు (నియోజకవర్గాల వారీగా) నియోజకవర్గం= ఇళ్లు చేవెళ్ల= 363 పరిగి= 667 రాజేంద్రనగర్= 46 ఇబ్రహీంపట్నం= 348 మహేశ్వరం= 480 మేడ్చల్= 163 తాండూరు= 394 వికారాబాద్= 314 -
ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుపై ఫీల్డ్ సర్వే
నేడు తాండూరుకు ఢిల్లీ నుంచి ఈఈఎస్‌ఎల్‌ఎస్ బృందం తాండూరు: ఎల్ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటుపై ఫీల్డ్ సర్వే నిర్వహించేందుకు తాండూరు పట్టణానికి గురువారం ఢిల్లీ నుంచి ఎనర్జీ ఎఫీషియెంట్ స్ట్రీట్ లైట్స్ సిస్టం (ఈఈఎస్‌ఎల్‌ఎస్) అధికార బృందం రానుంది. ప్రస్తుతం మున్సిపాలిటీల పరిధిలో సోడియం వేపర్ (250 వాట్స్-ఎస్వీ) దీపాలతో విద్యుత్ వినియోగం పెరిగింది. తద్వారా లక్షల్లో విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. దీంతో మున్సిపాలిటీలపై ఆర్థిక భారం పడుతోంది. విద్యుత్ వినియోగాన్ని బాగా తగ్గించి, ఆర్థిక భారం నుంచి గటెక్కేందుకు సోడియం వేపర్ దీపాల స్థానంలో తక్కువ విద్యుత్ వినియోగమయ్యే ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని పది జిల్లాల్లో తాండూరుతో పాటు సిద్ధిపేట, సిరిసిల్ల, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నల్గొండ మున్సిపాలిటీలను, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లను ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. గురువారం ఢిల్లీ నుంచి తాండూరు మున్సిపాలిటీకి దినేష్.కె. మంచిర్యాలకు శరత్ మిశ్రా, మహబూబ్‌నగర్‌కు అభిషేక్ కౌశిక్‌లతో కూడిన అధికారుల బృందం రానుంది. తాండూరు మున్సిపాలిటీలో స్థానిక రైల్వే స్టేషన్ నుంచి విలియం మూన్ స్కూల్ వరకు, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి చించొళి రోడ్డు వరకు 250 వాట్స్ దీపాలు ఉన్నాయి. వీటి స్థానంలో 60-90 వాట్స్ కలిగిన రెండు వందల ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేస్తారు. ఎల్ఈడీ దీపాలతో సోడియం వేపర్ దీపాల కన్నా రెట్టింపు వెలుతురుతోపాటు విద్యుత్ వినియోగం మూడోవంతు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ బృందం తాండూరులో ఎల్ఈడీ దీపాల ఏర్పాటు చేయనున్న మార్గాల్లో ఫీల్డ్ సర్వే చేపడుతుంది. ఈ సర్వే పూర్తయిన తరువాత ఏజెన్సీల ద్వారా సుమారు ఏడాది పాటు ఎల్ఈడీ దీపాల ఏర్పాటు, ఇతర నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుంది. ఏడాది అనంతరం ఎస్వీ దీపాల కన్నా ఎల్ఈడీ దీపాలతో ఏ మేరకు విద్యుత్ పొదుపు అయ్యింది, ఆర్థిక భారం ఎంత తగ్గిందనే నివేదిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎల్ఈడీ దీపాల ఏర్పాటును అమల్లోకి తీసుకురానుంది.