ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుపై ఫీల్డ్ సర్వే | LED lights on the Field Survey | Sakshi
Sakshi News home page

ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుపై ఫీల్డ్ సర్వే

Published Thu, Oct 30 2014 2:30 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

LED lights on the Field Survey

నేడు తాండూరుకు ఢిల్లీ నుంచి ఈఈఎస్‌ఎల్‌ఎస్ బృందం
తాండూరు: ఎల్‌ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటుపై ఫీల్డ్ సర్వే నిర్వహించేందుకు తాండూరు పట్టణానికి గురువారం ఢిల్లీ నుంచి ఎనర్జీ ఎఫీషియెంట్ స్ట్రీట్ లైట్స్ సిస్టం (ఈఈఎస్‌ఎల్‌ఎస్) అధికార బృందం రానుంది. ప్రస్తుతం మున్సిపాలిటీల పరిధిలో సోడియం వేపర్ (250 వాట్స్-ఎస్‌వీ) దీపాలతో విద్యుత్ వినియోగం పెరిగింది. తద్వారా లక్షల్లో విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. దీంతో మున్సిపాలిటీలపై ఆర్థిక భారం పడుతోంది. విద్యుత్ వినియోగాన్ని బాగా తగ్గించి, ఆర్థిక భారం నుంచి గటెక్కేందుకు సోడియం వేపర్ దీపాల స్థానంలో తక్కువ విద్యుత్ వినియోగమయ్యే ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా తెలంగాణలోని పది జిల్లాల్లో తాండూరుతో పాటు సిద్ధిపేట, సిరిసిల్ల, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నల్గొండ మున్సిపాలిటీలను, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లను ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. గురువారం ఢిల్లీ నుంచి తాండూరు మున్సిపాలిటీకి దినేష్.కె. మంచిర్యాలకు శరత్ మిశ్రా, మహబూబ్‌నగర్‌కు అభిషేక్ కౌశిక్‌లతో కూడిన అధికారుల బృందం రానుంది.
 
తాండూరు మున్సిపాలిటీలో స్థానిక రైల్వే స్టేషన్ నుంచి విలియం మూన్ స్కూల్ వరకు, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి చించొళి రోడ్డు వరకు 250 వాట్స్ దీపాలు ఉన్నాయి. వీటి స్థానంలో 60-90 వాట్స్ కలిగిన రెండు వందల ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేస్తారు. ఎల్‌ఈడీ దీపాలతో సోడియం వేపర్ దీపాల కన్నా రెట్టింపు వెలుతురుతోపాటు విద్యుత్ వినియోగం మూడోవంతు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ బృందం తాండూరులో ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు చేయనున్న మార్గాల్లో ఫీల్డ్ సర్వే చేపడుతుంది.

ఈ సర్వే పూర్తయిన తరువాత ఏజెన్సీల ద్వారా సుమారు ఏడాది పాటు ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు, ఇతర నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుంది. ఏడాది అనంతరం ఎస్‌వీ దీపాల కన్నా ఎల్‌ఈడీ దీపాలతో ఏ మేరకు విద్యుత్ పొదుపు అయ్యింది, ఆర్థిక భారం ఎంత తగ్గిందనే నివేదిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటును అమల్లోకి తీసుకురానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement