LED electric lights
-
బెస్ట్‌పై ‘ఎల్ఈడీ’ భారం
సాక్షి, ముంబై: నగర రహదారులకు ఏర్పాటు చేయనున్న ఎల్ఈడీ విద్యుత్ దీపాల వల్ల బెస్ట్ సంస్థ ఆదాయంపై గండి పడే ప్రమాదం ఏర్పడింది. నగర పరిధిలో బెస్ట్ సంస్థ నుంచి సుమారు 25.24 లక్షల యూనిట్ల విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇందుకు 283 కోట్లను మహానగర పాలక సంస్థ (బీఎంసీ) బెస్ట్‌కు చెల్లిస్తుంది. అయితే ఎల్ఈడీ బల్బులు అమర్చడం ద్వారా విద్యుత్ వినియోగం దాదాపు 50 శాతం తగ్గుతుంది. దీంతో బీఎంసీ ద్వారా బెస్ట్‌కు వచ్చే రెవెన్యూ కూడా 50 శాతం మేర తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని వీధిదీపాల ద్వారా బెస్ట్‌కు వచ్చే ఆదాయం లెక్కలు పూర్తిగా తలకిందులు కానున్నాయి. ప్రస్తుతం నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మెరైన్ డ్రైవ్ (క్వీన్ నెక్లెస్)లో వాటిని అమర్చే పనులు పూర్తయ్యాయి. త్వరలోనే నగ ర రహదారులపై అమర్చే పనులు అధికారులు ప్రారంభించనున్నారు. బెస్ట్ నుంచి ముంబైలోని కోలాబా నుంచి సైన్, మహీం వరకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ దారి పొడవునా సుమారు 40 వేల విద్యుత్ దీపాలతో పాటు, నగర శివార్లలోని లక్షకు పైగా విద్యుత్ దీపాలకు బెస్ట్ విద్యుత్ సరఫరా చేస్తుంది. ఇందుకోసం యూనిట్‌కు రూ.8.90 చొప్పున బెస్ట్‌కు బీఎంసీ చెల్లిస్తుంది. రవాణా శాఖ ద్వారా యూనిట్‌కు రూ.1.52 అదనంగా లభిస్తాయి. అయితే ఇప్పుడు ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు వల్ల బెస్ట్ ఖజానాకు భారీగా గండి పడుతుంది. ప్రస్తుతం బెస్ట్ ఆధీనంలో ఉన్న రవాణా శాఖ తీవ్ర నష్టాల్లో ఉండగా... విద్యుత్ శాఖ మాత్రమే లాభాల్లో ఉంది. -
ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుపై ఫీల్డ్ సర్వే
నేడు తాండూరుకు ఢిల్లీ నుంచి ఈఈఎస్‌ఎల్‌ఎస్ బృందం తాండూరు: ఎల్ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటుపై ఫీల్డ్ సర్వే నిర్వహించేందుకు తాండూరు పట్టణానికి గురువారం ఢిల్లీ నుంచి ఎనర్జీ ఎఫీషియెంట్ స్ట్రీట్ లైట్స్ సిస్టం (ఈఈఎస్‌ఎల్‌ఎస్) అధికార బృందం రానుంది. ప్రస్తుతం మున్సిపాలిటీల పరిధిలో సోడియం వేపర్ (250 వాట్స్-ఎస్వీ) దీపాలతో విద్యుత్ వినియోగం పెరిగింది. తద్వారా లక్షల్లో విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. దీంతో మున్సిపాలిటీలపై ఆర్థిక భారం పడుతోంది. విద్యుత్ వినియోగాన్ని బాగా తగ్గించి, ఆర్థిక భారం నుంచి గటెక్కేందుకు సోడియం వేపర్ దీపాల స్థానంలో తక్కువ విద్యుత్ వినియోగమయ్యే ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని పది జిల్లాల్లో తాండూరుతో పాటు సిద్ధిపేట, సిరిసిల్ల, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నల్గొండ మున్సిపాలిటీలను, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లను ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. గురువారం ఢిల్లీ నుంచి తాండూరు మున్సిపాలిటీకి దినేష్.కె. మంచిర్యాలకు శరత్ మిశ్రా, మహబూబ్‌నగర్‌కు అభిషేక్ కౌశిక్‌లతో కూడిన అధికారుల బృందం రానుంది. తాండూరు మున్సిపాలిటీలో స్థానిక రైల్వే స్టేషన్ నుంచి విలియం మూన్ స్కూల్ వరకు, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి చించొళి రోడ్డు వరకు 250 వాట్స్ దీపాలు ఉన్నాయి. వీటి స్థానంలో 60-90 వాట్స్ కలిగిన రెండు వందల ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేస్తారు. ఎల్ఈడీ దీపాలతో సోడియం వేపర్ దీపాల కన్నా రెట్టింపు వెలుతురుతోపాటు విద్యుత్ వినియోగం మూడోవంతు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ బృందం తాండూరులో ఎల్ఈడీ దీపాల ఏర్పాటు చేయనున్న మార్గాల్లో ఫీల్డ్ సర్వే చేపడుతుంది. ఈ సర్వే పూర్తయిన తరువాత ఏజెన్సీల ద్వారా సుమారు ఏడాది పాటు ఎల్ఈడీ దీపాల ఏర్పాటు, ఇతర నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుంది. ఏడాది అనంతరం ఎస్వీ దీపాల కన్నా ఎల్ఈడీ దీపాలతో ఏ మేరకు విద్యుత్ పొదుపు అయ్యింది, ఆర్థిక భారం ఎంత తగ్గిందనే నివేదిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎల్ఈడీ దీపాల ఏర్పాటును అమల్లోకి తీసుకురానుంది. -
ఇక తాండూరుకు ‘ఎల్ఈడీ’ కాంతులు!
తాండూరు: తాండూరు మున్సిపాలిటీ ఇక ధగధగ మెరిసి పోనున్నది. ఎల్ఈడీ విద్యుత్ దీపాల వెలుతురుతో మున్సిపాలిటీ ప్రధాన వీధులు మరింత ప్రకాశించనున్నాయి. ఈ కొత్త ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ప్రాజెక్టుగా జిల్లాలో తాండూరు మున్సిపాలిటీని ఎంపిక చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ను పొదుపు చేయడంతోపాటు వీధిదీపాల వినియోగంలో లక్షల రూపాయల వ్యయాన్ని తగ్గించాలనే ఆలోచనతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఏడు మున్సిపాలిటీలు ఈ ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు ఎంపికయ్యాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో తాండూరు మున్సిపాలిటీ నుంచి సుమారు 300 ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో భాగంగా మొదట సుమారు 200 దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన మార్గాల్లో 250 వాట్స్ కలిగిన సోడియం వేపర్(ఎస్వీ) దీపాలు ఉన్నాయి. వీటి వల్ల విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. నెలకు రూ.9 లక్షలు వ్యయం అవుతుంది. ఈనేపథ్యంలో ఎస్వీ దీపాల స్థానంలో కొత్తగా 90 వాట్స్ కలిగిన ఎల్ఈడీ దీపాలను సర్కారు ఏర్పాటు చేయనున్నది. ఎస్వీ దీపాలకంటే రెట్టింపు వెలుతురు ఉండటంతోపాటు విద్యుత్పొదుపు అవుతుంది. ఖర్చు కూడా తగ్గుతుంది. త్వరలోనే ఈ ఎల్ఈడీ దీపాల ఏర్పాటుతో మున్సిపాలిటీకి కొత్త శోభరానుంది.