సాక్షి, ముంబై: నగర రహదారులకు ఏర్పాటు చేయనున్న ఎల్‌ఈడీ విద్యుత్ దీపాల వల్ల బెస్ట్ సంస్థ ఆదాయంపై గండి పడే ప్రమాదం ఏర్పడింది. నగర పరిధిలో బెస్ట్ సంస్థ నుంచి సుమారు 25.24 లక్షల యూనిట్ల విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇందుకు 283 కోట్లను మహానగర పాలక సంస్థ (బీఎంసీ) బెస్ట్‌కు చెల్లిస్తుంది. అయితే ఎల్‌ఈడీ బల్బులు అమర్చడం ద్వారా విద్యుత్ వినియోగం దాదాపు 50 శాతం తగ్గుతుంది. దీంతో బీఎంసీ ద్వారా బెస్ట్‌కు వచ్చే రెవెన్యూ కూడా 50 శాతం మేర తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని వీధిదీపాల ద్వారా బెస్ట్‌కు వచ్చే ఆదాయం లెక్కలు పూర్తిగా తలకిందులు కానున్నాయి.
ప్రస్తుతం నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మెరైన్ డ్రైవ్ (క్వీన్ నెక్లెస్)లో వాటిని అమర్చే పనులు పూర్తయ్యాయి. త్వరలోనే నగ ర రహదారులపై అమర్చే పనులు అధికారులు ప్రారంభించనున్నారు. బెస్ట్ నుంచి ముంబైలోని కోలాబా నుంచి సైన్, మహీం వరకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ దారి పొడవునా సుమారు 40 వేల విద్యుత్ దీపాలతో పాటు, నగర శివార్లలోని లక్షకు పైగా విద్యుత్ దీపాలకు బెస్ట్ విద్యుత్ సరఫరా చేస్తుంది.
ఇందుకోసం యూనిట్‌కు రూ.8.90 చొప్పున బెస్ట్‌కు బీఎంసీ చెల్లిస్తుంది. రవాణా శాఖ ద్వారా యూనిట్‌కు రూ.1.52 అదనంగా లభిస్తాయి. అయితే ఇప్పుడు ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు వల్ల బెస్ట్ ఖజానాకు భారీగా గండి పడుతుంది. ప్రస్తుతం బెస్ట్ ఆధీనంలో ఉన్న రవాణా శాఖ తీవ్ర నష్టాల్లో ఉండగా... విద్యుత్ శాఖ మాత్రమే లాభాల్లో ఉంది.
బెస్ట్‌పై ‘ఎల్‌ఈడీ’ భారం
Published Fri, Mar 13 2015 10:38 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement