ప్రతి వారం కనీసం మూడు జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ సీఈవో
నోటిఫికేషన్ వచ్చేలోగా 15 జిల్లాల్లో పర్యటనకు ప్రణాళిక
ఇందులో భాగంగా తొలుత ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించిన ముఖేష్‌కుమార్ మీనా
కంట్రోల్ రూమ్‌లు, స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన
సాక్షి, అమరావతి/ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై ఇప్పటి వరకు జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఇక క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. వారానికి కనీసం మూడు జిల్లాల చొప్పున.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా 15 జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలని ముఖేష్‌కుమార్ మీనా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు.
ఇందులో భాగంగా ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల కోడ్ అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేస్తున్న విధానం, వాటి పరిష్కారం తీరుపై ఆరా తీశారు. అలాగే స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల కోసం ఎంపిక చేసిన ఏలూరు సీఆర్‌ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేశారు.
ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తీసుకువచ్చి కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ముఖేష్‌కుమార్‌కు అధికారులు తెలియజేశారు. ఈ పర్యటనల సందర్భంగా ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జేసీ బి.లావణ్య, తూర్పుగోదావరి కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment