స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు | Elections in a free environment | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు

Published Sun, Mar 17 2024 5:41 AM | Last Updated on Sun, Mar 17 2024 5:41 AM

Elections in a free environment - Sakshi

పోలింగ్, పోలీసు సిబ్బందిని గణనీయంగా పెంచాం

అల్లర్లు జరిగితే ఎస్పీ, రీపోలింగ్‌ జరిగితే కలెక్టర్లదే బాధ్యత

రాష్ట్రంలో 46,156 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు

మరో 887 పోలింగ్‌ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు

మహిళా సిబ్బందితో 179 పోలింగ్‌ కేంద్రాలు

దివ్యాంగులతో 63, యువతతో 50, మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లు 555

పోలింగ్‌లో 3,82,218 మంది రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులు

అబ్జర్వర్లు, చెక్‌ పోస్టులతో నిరంతర నిఘా..  ఇప్పటికే రూ.164.33 కోట్లు స్వాధీనం

రాష్ట్రంలో అమల్లోకి  ఎన్నికల నియమావళి

నియమావళిని ఉల్లంఘిస్తే నాతో సహా ఎవరిపైనయినా చర్యలు 

ఉల్లంఘనలపై 1950 నంబరు లేదా సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా

సాక్షి, అమరావతి: ఎటువంటి హింస, రీపోలింగ్‌ వంటివి లేకుండా స్వేఛ్చాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. రాష్ట్రంలో మే 13న జరిగే ఎన్నికలకు ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ విడుదల అవుతుందన్నారు. ఆయన శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే ఆ జిల్లా ఎస్పీ, రీపోలింగ్‌ జరిగితే ఆ జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా గతంలోకంటే అధికంగా పోలింగ్, పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 46,156 పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల సంఖ్య 1600 దాటితే వాటిని రెండు పోలింగ్‌ స్టేషన్లుగా విభజిస్తామని, దీనివల్ల 887 కొత్త పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేలా కేవలం మహిళా సిబ్బందితో 179 పోలింగ్‌ కేంద్రాలు, అదే విధంగా దివ్యాంగులతో 63, యువతతో 50, మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లు 555 ఏర్పాటు చేస్తామని అన్నారు.

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు 1 ప్లస్‌ 5 మంది ఉద్యోగులు ఉంటారన్నారు. గతంలో ఎన్నికల విధుల్లో అంగన్‌వాడీలు, తాత్కాలిక సిబ్బంది సేవలను కూడా వినియోగించుకున్నారని, ఈ సారి పూర్తిగా రెగ్యులర్‌ అయిన ప్రభుత్వ ఉద్యోగులనే నియమిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ సిబ్బందికి ప్రధాన బాధ్యతలు కాకుండా సిరా వేయడం వంటి విధులను అప్పగిస్తామన్నారు. ఎవరు ఎక్కడ విధుల్లో పాల్గొంటారో ర్యాండమ్‌గా సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు.

వలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండరన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు కనీసం ఇద్దరు పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. ఇందుకోసం 1,14,950 మంది సివిల్‌ పోలీసులు, 58 కంపెనీల రాష్ట్ర ఆర్మ్‌డ్‌ పోలీసులు, 465 కంపెనీల కేంద్ర బలగాలు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, కోడ్‌ ఉల్లంఘిస్తే తనతో సహా ఏ స్థాయి అధికారిపైన అయినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిర్యాదులు అందిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరంతరం నిఘా కోసం 50 మంది జనరల్‌ అబ్జర్వర్లు, 115 మంది వ్యయ పరిశీలకులు, 13 మంది పోలీసు అబ్జర్వర్లు ఉంటారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 22 విభాగాలతో తనిఖీలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 121 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు.

వీటికి అదనంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే తనిఖీల ద్వారా రూ.164.35 కోట్లు విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన మంత్రి మినహా మిగతా రాజకీయ నేతలందరినీ తనిఖీ చేస్తారని, చేతి బ్యాగులు తప్ప మిగతా వాటిని సోదా చేస్తారని చెప్పారు. విమానాశ్రయాల్లో కాకుండా ప్రైవేటుగా విమానాలు, హెలికాప్టర్లలో దిగిన స్థలాల వద్దకు సంచార స్క్వాడ్స్‌ వెళ్లి తనిఖీలు చేస్తాయన్నారు.

అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పెయిడ్‌ ఆర్టికల్స్, సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారా­లపైనా నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎటువంటి మత ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ఉల్లంఘనలపై 1950 నంబరుకు లేదా సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.

85 ఏళ్లు దాటిన వృద్ధులకుఇంటి వద్దే ఓటింగ్‌
85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్ద లేదా పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చి ఓటు వేయొచ్చని మీనా తెలిపారు. ఇంటి వద్దే ఓటు వేయాలనుకొంటే ముందుగా ఫారం 12 పూర్తి చేసి రిటర్నింగ్‌ అధికారికి ఇస్తే దాన్ని పరిశీలించి పోస్టల్‌ బ్యాలెట్‌కు అనుమతిస్తారన్నారు. ఒకసారి పోస్టల్‌ బ్యాలెట్‌కు అనుమతి లభిస్తే వారు పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చి ఓటు వేయడానికి కుదరదని స్పష్టం చేశారు. ఇలా పోస్టల్‌ బ్యాలెట్‌ కోరిన వారికి ఎన్నికల తేదీకి పది రోజుల ముందే వీడియోగ్రాఫర్‌తో కలిపి ఐదుగురు సిబ్బంది ఇంటికి వచ్చి పోస్టల్‌ బ్యాలెట్‌కు ఏర్పాట్లు చేస్తారని చెప్పారు.

పోలింగ్‌ బూత్‌లో లానే గోప్యంగా ఓటు హక్కును వినియోగించుకొని ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ను రెండు కవర్లలో పెట్టి పోలింగ్‌ బాక్స్‌లో వేయాలని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు ఇంటికి వస్తున్న సమాచారాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు ముందుగానే తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ (లా – ఆర్డర్‌) శంకబ్రత్‌ బాగ్చీ, అదనపు సీఈవోలు హరేంధర ప్రసాద్, పి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

53 రోజుల్లో కొత్తగా 1.30 లక్షల మంది ఓటర్లు
ఈ నెల 16 నాటికి 4.09 కోట్లు దాటిన ఓటర్లు
జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈ నెల 16 నాటికి ఓటర్ల సంఖ్య 1,30,096 పెరిగినట్లు ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. జనవరిలో విడుదల చేసిన జాబితాలో ఓటర్ల సంఖ్య 4,08,07,256 మంది ఉండగా ఇప్పడు 4,09,37,352కు చేరినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూలు వచ్చినందున ఓట్ల తొలిగింపు, చిరునామా మార్పులకు అవకాశం ఉండదని, కొత్త ఓటర్ల నమోదుకు నామినేషన్ల చివరి రోజు వరకు అవకాశం ఉందని చెప్పారు. 

ఇవి చేయొచ్చు
ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలను కొనసాగించవచ్చు
చేయూత పథకానికి ఇప్పటికే నిధులిస్తే వాటిని కొనసాగించవచ్చు
 ఇప్పటికే చేపట్టిన పనులు కొనసాగించొచ్చు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించొచ్చు
ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ వంటి సంస్థలు ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కొనసాగించొచ్చు

ఇవి చేయకూడదు
 పథకాలకు కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయకూడదు
పథకాలకు కొత్తగా నిధులు విడుదల చేయాల్సి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి
   పనులు మంజూరైనప్పటికీ, ఇంకా ప్రారంభించని వాటిని ఇప్పుడు చేపట్టకూడదు
కంపెనీలకు, వ్యక్తులకు భూములు కేటాయించకూడదు. అసాధారణ కేసుల్లో సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి
మంత్రులు ఫైలెట్‌ కార్లను వినియోగించకూడదు
ప్రధానమంత్రి తప్ప మిగతా ఏ రాజకీయ నాయకులకు ప్రొటోకాల్‌ ఉండదు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement