సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నందున అన్ని రకాల బృందాల శిక్షణను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల జాబితా నవీకరణపై సమీక్షించారు.
ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ.. షెడ్యూలు ప్రకటించిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని చెప్పారు. దాని ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెరై్వలెన్స్, వీడియో వ్యూయింగ్, ఎలక్షన్ ఎక్సె్పండిచర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లు, ఇతర బృందాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అందువల్ల ఆ బృందాలకు వారి విధులపై సమగ్ర అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణను మార్చి నెలలో ఇవ్వవచ్చని చెప్పారు.
విధుల్లో చేరకపోతే చర్యలు తప్పవు
అన్ని జిల్లాల్లో ఆర్వోలు, ఏఆర్వోలు, ఈఆర్వోలు, ఏఈఆర్‌వోల నియామకం జరిగిందని, వారిలో ఇప్పటికీ విధుల్లో చేరని వారి వివరాలను వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. వారి సమాచారాన్ని ప్రభుత్వానికి పంపి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సౌకర్యాలు కల్పించే బృందాలు, హోమ్ ఓటింగ్ బృందాల్లో తగినంత మందిని సమకూర్చుకోవాలని సూచించారు.
విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ఇంటి వద్దే ఓటింగ్‌కు అవకాశం ఉన్నందున రెవెన్యూ అధికారులు, సిబ్బందితో హోం ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది డేటాను సంబంధిత పోర్టల్‌లో వెంటనే ఫీడ్ చేయాలన్నారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టంను పటిష్టంగా అమలు పర్చేందుకు రెగ్యులేటరీ అథారిటీలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి అథారిటీ నుండి తప్పనిసరిగా ఒక నోడల్ అధికారి ఉండాలని అన్నారు.
ఈవీఎంలను తరలించే వాహనాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఇతర బృందాల వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ఉండాలని చెప్పారు. జిల్లా కేంద్రం నుండి బ్లాక్ స్థాయి వరకు అందరు అధికారులతో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మీనా ఆదేశించారు.
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు అన్నింటికీ తప్పనిసరిగా మైక్రో అబ్జర్వర్లను నియమించాలని, వెబ్ కాస్టింగ్, మీడియో కవరేజిల్లో పోలింగ్ కేంద్రాల పరిసరాలను కూడా చిత్రీకరించాలని చెప్పారు. అందుకు అవసరమైన వీడియోగ్రాఫర్లను, జిల్లా స్థాయిలోనే సమకూర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment