సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో 21 వనధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం 10.64 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు గిరిజన్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ ప్రకటించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్) ఆధ్వర్యంలో వనధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. గిరిజనులు అడవుల్లో సేకరించే చిన్నపాటి అటవీ ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ ద్వారా అధిక విలువ చేకూర్చేలా వనధన్ కేంద్రాలు పని చేస్తాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో మొత్తం 211 వనధన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
(చదవండి : ‘చిన్నతరహా పరిశ్రమలకు చేయూతనివ్వండి’)
1185 కోట్లతో ఆర్గానిక్ పత్తి సాగుకు ప్రోత్సాహం
ఆర్గానిక్ పత్తి సాగు ప్రోత్సాహకం కోసం 1185 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు జౌళి శాఖ మంత్రి స్పృతి ఇరానీ రాజ్యసభలో వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ సాంప్రదాయక, బీటీ పత్తి విత్తనాల సాగుకంటే కూడా సగటున ఆర్గానిక్ పత్తి సాగుకయ్యే వ్యయం తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. దేశీయ పత్తి విత్తనాల వాడకంతోపాటు ఆర్గానిక్ ఎరువుల వాడకం వలన సాగు వ్యయం బాగా తగ్గుతుందని తెలిపారు.
పరంపరగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) పథకం కింద సర్టిఫైడ్ ఆర్గానిక్ పత్తి ఉత్పాదనలకు మంచి రేటు కల్పించేందుకు రైతులతో వినియోగదారులను అనుసంధానించడం జరుగుతుంది. ఆర్గానిక్ పత్తి సాగుకు అవసరమైన ఇన్‌పుట్లు, విత్తనాలు, సర్టిఫికేషన్ నుంచి పంట సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండ్ బిల్డింగ్ వంటి ప్రక్రియలను ఈ పథకం కింద చేపట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రధానంగా ఎగుమతులపై దృష్టి పెట్టి ఆర్గానిక్ పత్తి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద అయిదేళ్ళ పాటు ఆర్గానిక్ పత్తి సాగు చేసే రైతుకు హెక్టారుకు ఏటా 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ మొత్తంలో 31 వేల రూపాయలను నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్‌కు బదలీ చేయడం జరుగుతంది. ఇందుకోసం 2018-19, 2010-21 సంవత్సరాలకు గాను 4 లక్షల హెక్టార్లలో ఆర్గానిక్ పత్తి సాగు కోసం 1185 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment