సేంద్రియ పంటలకు ప్రత్యేక రుణాలు  | Special loans to organic crops | Sakshi
Sakshi News home page

సేంద్రియ పంటలకు ప్రత్యేక రుణాలు 

Feb 6 2019 12:35 AM | Updated on Feb 6 2019 12:35 AM

Special loans to organic crops - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా సేంద్రియ పంటలకు రుణాలు ఇవ్వనున్నారు. ఆర్గానిక్‌ పద్ధతిలో పండించే కూరగాయలు సహా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) నిర్ణయించింది. వివిధ రకాల పంటలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను మంగళవారం టెస్కాబ్‌ ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే దాదాపు 100 రకాల పంటలకు 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్‌ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. సంబంధిత నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ)కి పంపించింది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు చొప్పున స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఖరారు చేసింది. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.40 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఈ సారి ఆర్గానిక్‌ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. 

వరి, పత్తికి రూ.38 వేలు.. 
తెలంగాణలో అత్యధికంగా సాగు చేసే వరికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.34 వేల నుంచి రూ. 38 వేలు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఖరారు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో అది రూ.30 వేల నుంచి రూ. 34 వేలుగా ఉంది. వరి విత్తనోత్పత్తి రైతులకు రూ. 40 వేల నుంచి రూ. 42 వేలు ఖరారు చేశారు. పత్తికి 2018–19లో రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.35 వేల నుంచి రూ.38 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ.25 వేల నుంచి రూ.28 వేలు నిర్ధారించారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో రూ.20 వేల నుంచి రూ.23 వేలుగా నిర్ధారించారు. సాధారణ పద్ధతిలో పండించే కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ.17 వేల నుంచి రూ.20 వేలు, సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో రూ.14 వేల నుంచి రూ.17 వేలు చేశారు. ఇక ఆర్గానిక్‌ çపద్ధతిలో సాగు చేస్తే కందికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు అత్యధికంగా నిర్ధారించారు. కంది విత్తనోత్పత్తి చేసే రైతులకు రూ.20 వేల నుంచి రూ. 25 వేలు చేశారు. ఇదిలావుండగా కంది విత్తనోత్పత్తికి ప్రస్తుతం స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిర్ధారణ చేయలేదు. సాగునీటి ప్రాంతాల్లో మినుము సాగు చేసే రైతులకు రూ.15 వేల నుంచి రూ.18 వేలు, నీటి వసతి లేని ప్రాంతాల్లోని వారికి రూ.13 వేల నుంచి రూ.15 వేలు రుణం ఇస్తారు. ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేస్తే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అ«ధికంగా ఇస్తారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో పెసరకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు, సాగునీటి వసతి ఉంటే రూ.15 వేల నుంచి రూ.17 వేలు ఇస్తారు. ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేస్తే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అధికంగా ఇస్తారు. సోయాబీన్‌కు ఇప్పటివరకు రూ.18 వేల వరకు ఇవ్వగా, వచ్చే ఏడాది నుంచి రూ.22 వేల నుంచి రూ.24 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు మొదటిసారిగా రూ.28 వేల నుంచి రూ.31 వేల వరకు ఇస్తారు.  

ద్రాక్షకు రూ.1.25 లక్షలు...
అత్యధికంగా విత్తనరహిత ద్రాక్షకు రూ.1.2 లక్షల నుంచి రూ.1.25 లక్షలు రుణం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరను మార్చలేదు. దాంతోపాటు పత్తి విత్తనాన్ని సాగు చేస్తే ఇప్పటివరకు రూ.94 వేల నుంచి రూ.1.26 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.1.1 లక్షల నుంచి రూ.1.4 లక్షలకు పెంచారు. పసుపు సాగుకు రూ.60 వేల నుంచి రూ.68 వేలు చేశారు. ప్రస్తుతం కంటే రూ.2 వేల నుంచి రూ.8 వేలు అదనంగా పెంచారు. క్యాప్సికానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖరారు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement