న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023–24 ద్వితీయార్థంలో (2023 అక్టోబర్– మార్చి 2024) డేటెడ్ సెక్యూరిటీల ద్వారా రూ. 6.55 లక్షల కోట్లు రుణం తీసుకోనున్నట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇందులో సావరిన్ గ్రీన్ బాండ్‌ల (ఎస్‌జీఆర్‌బీ) జారీ ద్వారా సమీకరణల మొత్తం రూ. 20,000 కోట్లు. మార్కెట్ రుణ సమీకరణల ద్వారానే ప్రభుత్వం తన ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం)ను పూడ్చుకునే సంగతి తెలిసిందే.
ఆర్థిక సంవత్సరంలో రూ.15.43 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణలను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ద్వితీయార్థం వాటా (రూ.6.55 లక్షల కోట్లు) రూ.42.45 శాతం. దీర్ఘకాలిక సెక్యూరిటీల కోసం మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో మొదటిసారి 50 సంవత్సరాల సెక్యూరిటీ (బాండ్) కూడా ఈ దఫా జారీ చేస్తుండడం గమనార్హం.
20 వారాల పాటు జరిగే వేలం ద్వారా రూ.6.55 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణలు పూర్తవుతాయి. మార్కెట్ రుణం 3, 5, 7, 10, 14, 30, 40, 50 సంవత్సరాల సెక్యూరిటీలలో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment