నంగునూరు (సిద్దిపేట): ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే సేంద్రియ వ్యవసాయం అభివృద్ధి చెందాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. విషతుల్యమైన పంటలతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆర్గానిక్ పంటల వైపు చూస్తోందన్నారు. బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో జరిగిన సమావేశంలో సిద్దిపేట ఆర్గానిక్ ప్రొడక్ట్ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు.
అనంతరం వాటర్‌షెడ్ పథకం కింద రైతులకు సబ్సిడీ టార్పాలిన్ కవర్లు, స్ప్రేయర్లు అందజేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. విచ్చల విడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ పంటలు పండించడం వల్ల కేన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రజలు ఆర్గానిక్ ఆహారం వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ఆర్గానిక్ పంటలు అమ్మేవారికి గిట్టుబాటు ధర కల్పిస్తూ వినియోగదారులకు ఆరోగ్యకరమైన పంటలను అందించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దీని కోసం www.siddipetorganicproducts.com ద్వారా సేంద్రియ ఉత్పత్తులను దేశంలో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ వెబ్‌సైట్‌లో సేంద్రియ వ్యవసాయం చేసే రైతు వివరాలు, పొలం, ఫొటోలు, పంట తదితర వివరాలు ఉంటాయని తెలిపారు.
నేరుగా కొనుగోలు..: ఈ వెబ్‌సైట్ ద్వారా సేంద్రియ ఉత్పత్తులను దళారీల ప్రమేయం లేకుండా రైతుల నుంచే వినియోగదారులు నేరుగా కొనుగోలు చేయవచ్చని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సేంద్రియ రైతులకు మంచి ధర వచ్చేందుకు, వినియోగదారుల కొనుగోలుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో ఎరువులు, పరుగు మందులు వాడిన ఆహార ఉత్పత్తులు అమ్ముతుండటాన్ని ఆక్షేపించారు. నిజమైన ఆర్గానిక్ ఉత్పత్తులు కావాలనుకునే వారు ఈ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయాలని సూచించారు.
రూ.15 లక్షల ఆర్థిక సాయం..
యాభై ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించి సేంద్రియ వ్యవసాయం చేస్తే వారికి ప్రభుత్వం నుంచి మూడేళ్ల పాటు విడతల వారీగా రూ.15 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాబార్డు ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలు, మార్కెటింగ్ సదుపాయాలతో పాటు కార్పొరేట్ సంస్థల సాయంతో రైతులకు ఆవులను సమకూర్చుతామన్నారు. అంతర్జాతీయ కంపెనీలు సైతం ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా అనుసంధానిస్తామన్నారు.
రైతులు నమ్మకంగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే కొనుగోలు దారులు పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేసేలా చేస్తామన్నారు. వరంగల్, సిద్దిపేట రైతు బజారులో సేంద్రియ ఉత్పత్తులు అమ్మడానికి ఉచితంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో రైతులకు మంత్రి హరీశ్‌రావు ఆర్గానిక్ వ్యవసాయ పనిముట్లను అందజేశారు.
కొమురవ్వ.. వ్యవసాయం ఎట్ల చేస్తున్నవ్
కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి, నర్సంపేట్ నియోజక వర్గాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు రావడంతో మంత్రి వారి వివరాలు సేకరించారు. పాలకుర్తికి చెందిన మహిళా రైతు కొమురవ్వ మాట్లాడుతూ.. తాను మూడేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని చెప్పడంతో.. ఎన్ని ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నావని, ఎరువులు, కషాయాలు ఎలా తయారు చేస్తున్నావని మంత్రి ఆమెను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment