గమ్యం మార్చిన పుస్తకం | Hyderabad Software Leaves Job To Turn Organic Farmer | Sakshi
Sakshi News home page

గమ్యం మార్చిన పుస్తకం

Published Wed, Dec 23 2020 8:18 AM | Last Updated on Wed, Dec 23 2020 8:23 AM

Hyderabad Software Leaves Job To Turn Organic Farmer - Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరైన ఖుషీ చంద్‌ వడ్డె ఓ రోజు కంపెనీ పనిమీద ముంబై వెళ్లాల్సి ఉంది. ఇంటి నుంచి బయలుదేరి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద ఓ స్వీట్‌హౌస్‌ వద్ద ఆగాడు. రైతు, సైంటిస్టు సుభాష్‌ పాలేకర్‌ రాసిన ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. హైదరాబాద్‌ నుంచి విమానంలో ముంబై బయలుదేరాడు. ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యే వరకు 60 పేజీల ఆ పుస్తకాన్ని తిరగేశాడు. రసాయన ఎరువుల వాడకం, భూమి కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాలతో రోగాల బారిన పడుతున్న బాధితుల తీరును తెలుసుకొని చలించిపోయాడు. అప్పటి నుంచి అతడిలో ఎన్నో ప్రశ్నలు.. కల్తీ ఆహార పదార్థాలతో క్యాన్సర్‌ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నామని గ్రహించాడు. తిరిగి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఆర్నెళ్ల పాటు నగర శివార్లలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులను కలిశాడు. దిగుబడి, నాణ్యత, మార్కెటింగ్‌ గురించి తెలుసుకొని రోగాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయంలో తానూ భాగస్వామి కావాలనుకున్నాడు. 
– గచ్చిబౌలి

‘కృషి’ చంద్‌గా.. 
కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఖుషీ చంద్‌ చెన్నైలోని ఎస్‌ఎంకెఎఫ్‌ఐటీలో (బీఈ) కంప్యూటర్‌ సైన్స్‌ 2006లో పూర్తి చేశారు. క్యాంపస్‌ సెలక్షన్‌లో హెచ్‌పీ కంప్యూటర్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజినీర్‌గా ఎన్నికయ్యాడు. 2008లో ఐబీఎంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసి.. 2009 నుంచి 2013 వరకు డెలాయిట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా నెలకు రూ.80 వేల జీతం తీసుకున్నాడు. అమెరికా వెళ్లి బాగా స్థిరపడాలనే కోరిక ఉండేది. పాలేకర్‌ రాసిన ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ పుస్తకం చదివిన తర్వాత పొలం బాట పట్టాడు. చదవండి: ‘ఆన్‌లైన్‌ రమ్మీ’ కేసుల్లో పోలీసుల మీమాంస 

క్యాన్సర్‌ నుంచి తల్లిని రక్షించుకుని 
ఖుషీచంద్‌ తండ్రి వడ్డె జయ ప్రసాద్‌ 2011 గుండెపోటుతో మరణించారు. ఆ బాధలో నుంచి కోలుకున్న కొద్ది సంవత్సరాలకు 2016లో తల్లి శివలీలకు క్యాన్సర్‌ అని తేలింది. 2017లో ఆమె డయాలసిస్‌ స్టేజ్‌కు వెళ్లింది. అయినా కుంగిపోలేదు. చదవండి: ఫుడ్‌ హీరోలు!: పంటల పుట్ట రామకృష్ణ పొలం!

ఆర్గానిక్‌ ఉత్పత్తులను రోజూ ఇచ్చి తల్లిని కాపాడుకుంటాననే నమ్మకం అతడిలో కలిగింది. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, రైస్‌ ఇచ్చే వారు. మూడేళ్లలో ఎలాంటి మెడిసన్‌ వాడకుండా ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్గానిక్‌ ఉత్పత్తులతోనే అమ్మను కాపాడుకోగలిగానని చెబుతున్నారు.  

ప్రకృతి వ్యవసాయమంటే చిన్నచూపు 
మన దేశంలోనే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువ. ప్రపంచంలో 36 శాతం జనాభాకు ఆహార ధాన్యాలు అందించే అన్నపూర్ణ అయినా రసాయన ఎరువులతో పండించిన పంటలు ప్రజల ఆరోగ్యాన్ని పీడిస్తున్నాయి. వ్యవసాయం అంటేనే సమాజం అదోలా చూస్తోంది. ప్రకృతి వ్యవసాయం అంటే మరీ చిన్నచూపు. ఆ ఆలోచన మార్చుకోవాలి. 
– ఖుషీ చంద్‌ వడ్డె  

‘కోశాగారం’.. ఆర్గానిక్‌ స్టోర్‌
2013లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి షాద్‌నగర్‌లో 12 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, పిండి మిశ్రమంతో చేసిన జీవామృతంతో ఆకు కూరలు, కూరగాయలు పండించడం మొదలుపెట్టాడు. మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా రెండేళ్ల పాటు వ్యవసాయం చేసి ప్రకృతి సేద్యంపై అనేక మంది రైతులకు అవగాహన కల్పించాడు. అనంతరం ఓయూ కాలనీలో ‘కోశాగారం’ పేరిట ఆర్గానిక్‌ స్టోర్‌ నెలకొల్పాడు. అప్పటి నుంచి వ్యవసాయం మానేసి ప్రకృతి సేద్యం చేసిన రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఆర్గానిక్‌ స్టోర్‌లో విక్రయిస్తున్నాడు.  ఇటీవల గచ్చిబౌలిలోనూ మరో స్టోర్‌ ప్రారంభించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement