Rythu Bharosa Kendralu: ఆర్బీకే ఓ అద్భుతం! | Appreciation to RBK Centres from Central Agriculture Department | Sakshi
Sakshi News home page

Rythu Bharosa Kendralu: ఆర్బీకే ఓ అద్భుతం!

Published Thu, Jul 7 2022 3:14 AM | Last Updated on Thu, Jul 7 2022 7:11 AM

Appreciation to RBK Centres from Central Agriculture Department - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమైన కేంద్ర బృందం

సాక్షి, అమరావతి, గన్నవరం/కంకిపాడు/ పెనమలూరు: వ్యవసాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదర్శంగా వ్యవహరిస్తూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ నిపుణుల బృందం అభినందించింది. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయతగ్గవని, వాటిపై అధ్యయనం చేయాలని ఇతర రాష్ట్రాలకు సూచిస్తామని ప్రకటించింది. అంతర్జాతీయంగా ఖ్యాతి సాధించిన ఆర్బీకేల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతులందరికీ ఆ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిపుణుల బృందం రాకకు ప్రాధాన్యత ఏర్పడింది.

నిపుణుల బృందం బుధవారం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం, కంకిపాడు మార్కెట్‌ యార్డులోని వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్, వణుకూరులోని ఆర్బీకేని పరిశీలించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీసింది. రైతులను స్వయంగా పలుకరించి అభిప్రాయాలను తెలుసుకుంది. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమై వ్యవసాయం, రైతు సంక్షేమంపై చర్చించింది.

దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునే లక్ష్యంతో అమలు చేస్తున్న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)తో భాగస్వామి అయ్యేందుకు అభ్యంతరం లేదన్నారు. నష్టపోతున్న రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ఫసల్‌ బీమా యోజనలో చక్కటి మోడల్‌ పొందుపర్చాలని సూచించారు. మోడల్‌ ఖరారు కాగానే కేంద్రంతో కలసి పాలు పంచుకుంటామన్నారు.
కృష్ణాజిల్లా వణుకూరు ఆర్బీకే ద్వారా రైతులకు అందుతున్న సేవలను తెలుసుకుంటున్న కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ 

ఇలాంటివి ఎక్కడా చూడలేదు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు అద్భుతమని, ఇలాంటి వ్యవస్థను ఇంతవరకు ఎక్కడా చూడలేదని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్‌ అహూజా ప్రశంసించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటైన అగ్రిల్యాబ్స్‌ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. అగ్రిల్యాబ్స్‌లో నిర్వహిస్తున్న తనిఖీల ద్వారా విత్తనాలు, ఎరువుల్లో ఎక్కడైనా కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆ సమాచారాన్ని తమకు కూడా తెలియజేయాలని కోరారు. తద్వారా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రైతులను హెచ్చరించి కల్తీల బారినుంచి కాపాడుకోవచ్చన్నారు. పొలంబడి పేరుతో నిర్వహిస్తున్న శిక్షణ  తరగతులు చాలా బాగున్నాయన్నారు.

వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీ వినియోగించుకుంటున్న తీరు అమోఘమన్నారు. ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ చాలా ముందుందని అహూజా ప్రశంసించారు. ఈ–క్రాపింగ్‌ ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారని, టెక్నాలజీని మిళితం చేసి రైతులకు చక్కటి ప్రయోజనాలు అందిస్తున్నారని చెప్పారు. రైతు క్షేత్రం (ఫామ్‌గేట్‌) వద్దే కొనుగోళ్లు, ఆర్బీకేల స్థాయిలోనే పంటల విక్రయం లాంటి కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు.

కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం ద్వారా సీసీఆర్సీ కార్డులు జారీ చేయడాన్ని స్వాగతించారు. ఆర్బీకేల స్థాయిలో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల ఏర్పాటు ఎంతో మంచి ఆలోచనన్నారు. సామాజిక తనిఖీల కోసం అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్న విధానం పారదర్శకంగా ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడినప్పుడు విద్యా రంగంలో ప్రభుత్వం తెచ్చిన మార్పులను సైతం తమతో పంచుకున్నారని పేర్కొంటూ విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కృషిని అభినందించారు. 
కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ మనోజ్‌ అహుజాకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

కాల్‌ సెంటర్, ఆర్బీకే, అగ్రిల్యాబ్‌ను సందర్శించిన బృందం
నాణ్యమైన సర్టిఫైడ్‌ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు సాగులో ఆధునిక పరిజ్ఞానాన్ని గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటైన ఆర్బీకేలు నిజంగా గొప్ప ఆలోచన అని మనోజ్‌ అహూజా పేర్కొన్నారు. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ను సందర్శించిన అనంతరం రైతు భరోసా కేంద్రం లైవ్‌ స్టూడియోను ఆయన పరిశీలించారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 155251 ద్వారా శాస్త్రవేత్తలు వెంటనే సలహాలు, సూచనలు అందిస్తుండటాన్ని ప్రశంసించారు. రైతులు ఫోన్‌ చేసినపుడు ఎలా స్పందిస్తున్నారు? ఎలాంటిæ సలహాలు ఇస్తున్నారు? అనే అంశాలను నిశితంగా గమనించారు.

అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరులో ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించారు. పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయిస్తున్నట్లు పలువురు రైతులు కేంద్ర బృందానికి తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ధాన్యం కొనుగోలు తదితర సేవలు అందుతున్నాయన్నారు. గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సీఎం జగన్‌ ఆర్బీకేలను ఏర్పాటు చేసిన తరువాత రైతుల కష్టాలు తీరాయని చెప్పారు. కియోస్క్‌ ద్వారా రైతులే స్వయంగా డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించడాన్ని బృందం పరిశీలించింది.

ఆర్బీకేలకు ఐఎస్‌ఓ నాణ్యత ప్రమాణ పత్రం లభించడం ఉత్తమ పనితీరుకు నిదర్శనమని బృందం సభ్యులు పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే రైతు భరోసా రథం. వెటర్నరీ మొబైల్‌ వాహనాన్ని సైతం పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు. అక్కడ నుంచి కంకిపాడు చేరుకుని వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. పైసా ఖర్చు లేకుండా ఇన్‌పుట్స్‌ను ముందుగానే పరీక్షించుకుని కల్తీల బారిన పడకుండా ధైర్యంగా సాగు చేస్తున్నట్లు రైతులు వెల్లడించారు.

మట్టి నమూనాల పరీక్షలు, విత్తన సేకరణ, నాణ్యత పరిశీలనపై ల్యాబ్‌ సిబ్బందిని బృందం అడిగి తెలుసుకుంది. కేంద్ర బృందం సభ్యులైన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్‌ చౌహాన్,  కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.సునీల్, నోడల్‌ ఆఫీసర్‌ అజయ్‌కరన్‌లతో పాటు వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఇన్‌చార్జి కమిషనర్‌ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, ఆర్బీకేల జేడీ శ్రీధర్‌ కార్యక్రమంలో పొల్గొన్నారు. 
ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్‌ చౌహాన్‌కు జ్ఞాపిక అందిస్తున్న సీఎం 

రైతులకు గరిష్ట ప్రయోజనం అందాలి: సీఎం
కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్‌ అహూజా నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో పాటు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. కనీస మద్దతు ధర దక్కని సందర్భాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తున్నామని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయడం ఎంతో బాగుందని, ఈ పథకం పీఎంఎఫ్‌బీవైతో భాగస్వామిగా మారితే మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అహూజా సూచించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే రైతులకు గరిష్ట ప్రయోజనాలతో మంచి మోడల్‌ రూపొందించాలని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement