పైడివాడ అగ్రహారంలో ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్, చిత్రంలో మంత్రులు, ప్రజాప్రతిని«ధులు, అధికారులు
కొంత మంది అడ్డంకులు, కోర్టు కేసుల వల్ల విశాఖలో ఇళ్ల స్థలాల పంపిణీ 489 రోజులు ఆలస్యమైంది. కోర్టు వ్యవహారాలు ఎప్పుడు క్లియర్ అవుతాయి.. ఎప్పుడు నా అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇళ్ల పట్టాలిస్తామా అని వారానికోసారి అడ్వకేట్ జనరల్‌తో చర్చిస్తూ వచ్చాను. దేవుడి దయతో ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ఒక్క విశాఖలోనే అక్కచెల్లెమ్మల చేతిలో రూ.10 వేల కోట్ల విలువైన ఆస్తిని పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎవరు అడ్డుపడినా సంక్షేమం ఆగదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పేదలకు జరిగే మంచి పనులను అడ్డుకునేందుకు దుష్ట చతుష్టయం (చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5) ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. జగన్‌కు ప్రజల మద్దతు పెరిగిపోతోందనే కడుపు మంట వారికి ఎక్కువైందని అన్నారు. గురువారం ఆయన సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని 1,24,581 మంది పేద మహిళలకు ఇంటి పట్టాలు, రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ కింద 3,03,581 మందికి గృహ మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభించారు.
అంతకు ముందు ఆయన మొత్తం లే అవుట్‌ను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, వైఎస్సార్ పార్కును ప్రారంభించారు. అనంతరం లే అవుట్‌లో అభివృద్ధి చేసిన మోడల్ ఇంటిని పరిశీలించారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం విశాఖపట్నం జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 2 జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.
సబ్బవరం మండలం పైడివాడ సభలో ఇళ్ల లబ్ధిదారులనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్
అక్క చెల్లెమ్మలకు శాశ్వత చిరునామా
► అడ్డంకులన్నింటినీ అధిగమించి ఇవాళ పైడివాడ అగ్రహారంలోని ఒక్క కాలనీలోనే 10,228 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఈ కాలనీలో విలేజ్ క్లినిక్స్, సబ్‌సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, అంగన్‌వాడీలు, హైస్కూల్స్, సచివాలయం, మార్కెట్ యార్డు, మూడు పార్కులు రాబోతున్నాయి.
► ఇక్కడ గజం స్థలం విలువ రూ.12 వేల చొప్పున మొత్తంగా ప్లాట్ రూ.6 లక్షలవుతుంది. దీనికి తోడు రూ.2 లక్షల వ్యయంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. రోడ్లు, డ్రైనేజ్, కరెంట్.. ఇలా మౌలిక వసతులతో కలిపి మొత్తం రూ.10 లక్షల ఇంటిని ప్రతి అక్కా, చెల్లెమ్మ చేతుల్లో పెడుతున్నాం. తద్వారా ప్రతి అక్క చెల్లెమ్మకు శాశ్వత చిరునామా, సామాజిక హోదా కల్పించినట్లు అవుతుంది. పాదయాత్ర సమయంలో 25 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చాను. దానికి మించి 30.70 లక్షల మందికి అందిస్తున్నాను.
2 – 3 లక్షల కోట్ల ఆస్తి
► గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్టణాల్లో ఒకటి నుంచి ఒకటిన్నర సెంట్ల స్థలం ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం. రాష్ట్రంలో 13 వేల పంచాయతీలుంటే 17 వేల జగనన్న కాలనీలే రాబోతున్నాయి.
► విశాఖలో 1.25 లక్షల మందికి ఇళ్ల పట్టాలతో పాటు రెండో దశ కింద ఇళ్లు కట్టేందుకు మంజూరు పత్రాలు కూడా అందజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో మరో 1.79 లక్షల ఇళ్లకు శ్రీకారం చుడుతున్నాం. మొత్తం ఈ ప్రాంగణంలో 3.03 లక్షల మందికి ఇళ్లు కట్టుకునే మంజూరు పత్రాలు అందిస్తున్నాం.
► మొత్తంగా 30.76 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, 15.60 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు మరో 3.03 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం. వీటితో పాటు 2.60 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అంటే రాష్ట్రం మొత్తంమీద 21.27 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.
► రాష్ట్రం మొత్తంలో నిర్మిస్తున్న ఇళ్ల కోసం 71,811 ఎకరాల్ని (పూలింగ్‌తో కలిపి) కేటాయించాం. రూ.55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ.35 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు అందిస్తున్నాం. కనీస సౌకర్యాల కల్పనకు మరో రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. విశాఖలో అందిస్తున్న 1.25 లక్షల ఇళ్ల విలువ దాదాపు 10 వేల కోట్లు ఉంటుంది. మొత్తం 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందిస్తే.. వారి చేతిలో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తిని చేతిలో పెట్టినట్టు అవుతుంది.
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
పట్టా లేదనే బెంగొద్దు..
► అర్హులందరికీ ఇళ్ల పట్టాలిస్తాం. ఎవరికైనా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే 2.12 లక్షల ఇళ్లకు దరఖాస్తులు రాగా.. 1.12 లక్షల మందికి మంజూరు చేశాం. మిగిలిన వారికి రాబోయే రోజుల్లో మంజూరు చేస్తాం. గతంలో 225 అడుగుల ఇళ్ల బదులు ఇప్పుడు 340 అడుగుల ఇంటిని నిర్మిస్తున్నాం.
► ఇళ్ల కోసం 3 ఆప్షన్లు ఇస్తున్నాం. ఆప్షన్–1 కింద అక్క చెల్లెమ్మలు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే పనుల పురోగతి మేరకు రూ.1.20 లక్షలు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తాం. ఆప్షన్–2 కింద అక్కచెల్లెమ్మల ఇంటి నిర్మాణ పనులు వాళ్లే చేసుకుంటామంటే.. వారికి కావాల్సిన ఇంటి నిర్మాణ సామగ్రి సబ్సీడీపై తక్కువ ధరకే ఇస్తున్నాం. కూలి మొత్తాన్ని అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తాం. ఆప్షన్–3 కింద ఎవరైనా అక్క చెల్లెమ్మలు ఇల్లు కట్టుకోలేమని అనుకుంటే.. ప్రభుత్వమే నిర్మించనుంది.
► ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు రూ.1.80 లక్షలతో పాటు మరో రూ.35 వేలు పావలా వడ్డీకే రుణంగా అందించనున్నాం. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకులతో మాట్లాడాం. వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర జనాభా పరంగా రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఇల్లు కట్టించి ఇస్తున్న మహా యజ్ఞం సాగుతోంది.
పైడివాడలోని లేఅవుట్ లో మోడల్ హౌస్ లబ్ధిదారు రమణమ్మకి పట్టా అందిస్తున్న సీఎం
రెండు ఫ్యాన్లు... 4 బల్బులూ ఉచితం
► ప్రతి ఇంట్లో ఒక బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, టాయిలెట్, వరండా ఉండేలా ప్లాన్ చేసి కడుతున్నాం. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, 4 ఎల్‌ఈడీ బల్బులు ఉచితంగా అందిస్తున్నాం. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ వేగవంతం అవుతుంది. జిల్లాల జీడీపీ కూడా పెరుగుతుంది.
► ఒక్కో ఇంటికి కనీసం 25 టన్నుల ఇసుక ఉచితంగా, సిమెంట్, స్టీల్ మొదలైనవి సబ్సీడీ కింద అందిస్తున్నాం. 500 కంటే ఎక్కువ ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో నిర్మాణ సామగ్రి ఉంచేందుకు తాత్కాలిక గోడౌన్స్ నిర్మిస్తున్నాం.
► తొలి దశలో ఈ నెల 26 నాటికి 28,072 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. తొలిదశ ఇళ్ల నిర్మాణంలో ఇప్పటి వరకు 83.84 లక్షల టన్నుల సిమెంట్, 8.94 లక్షల టన్నుల స్టీల్, 3.72 కోట్ల టన్నుల ఇసుక, 294 కోట్ల ఇటుకలు, 269 లక్షల టన్నుల మెటల్ వినియోగం జరిగింది.
► కార్మికులకు 25.92 కోట్ల పని దినాలు కల్పిస్తున్నాం. దాదాపు 30 రకాల వృత్తి పని వారికి ఉపాధి దొరుకుతోంది.
అప్పుడు, ఇప్పుడు తేడా మీరే గమనించండి
► 2014 – 2019 మధ్యా ప్రభుత్వం ఉంది.. అప్పుడూ ముఖ్యమంత్రి ఉన్నారు. స్థలాలివ్వలేదు. ఇళ్ల నిర్మాణం జరగలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి ఉన్నారు. మార్పు ఏమిటంటే 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల ముఖంలో ఇవాళ చిరునవ్వు కనిపిస్తోంది.
► గత ప్రభుత్వంలో ఊడ్చి.. ఊడ్చి.. 5 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేకపోయారు. తాను మాత్రం హైదరాబాద్‌లో ప్యాలెస్ కట్టుకొని సంతోషంగా ఉన్నాడు. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను. తేడా మీరే గమనించాలి.
► ఇవాళ ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. కులం మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అనేది చూడకుండా.. అర్హత ప్రాతిపదికగా ఈ సోదరుడు అడుగులు ముందుకు వేశాడు.
అన్నింటా దుష్టచతుష్టయం అడ్డంకులు
► దుష్ట చతుష్టయం.. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మంచి పనులకు ప్రతి రోజూ ఎలా అడ్డుపడుతోందో మీరంతా చూస్తున్నారు.
► ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు మూడు రాజధానుల్లో విశాఖని ఒకటి చెయ్యాలనుకుంటే అడ్డుకున్నారు. అమరావతిలో అక్కచెల్లెమ్మలు 54 వేల మందికి ఇళ్ల పట్టాలిస్తామనుకుంటే.. కులాల మధ్య సమతుల్యం (డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్) దెబ్బతింటుందనీ, పేదలు వారి మధ్య ఉండకూడదని దౌర్భాగ్యంగా కోర్టుకి వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. ఆ 54 వేల మంది పేదలకు కూడా త్వరలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తాం.
► రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి.. ఒకప్పటి రాజధానిగా ఉన్న కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు ప్రయత్నిస్తే.. దాన్ని కూడా అడ్డుకున్నారు.
► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. అగ్రవర్ణాల్లోని పేదల పిల్లలకు నాణ్యమైన విద్య కోసం నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మార్చేశాం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌సీ సిలబస్ ప్రవేశపెడుతున్నాం. దానినీ అడ్డుకోజూస్తున్నారు.
► బ్యాంకుల నుంచి రుణాలు రాకుండా, ఎక్కడ నుంచి ఎలాంటి సహాయం రాష్ట్రానికి అందకూడదని ప్రయత్నిస్తున్నారు. కేంద్రం డబ్బులు ఇచ్చినా జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగినా.. ఓర్చుకోలేకపోతున్నారు. పేదలకు ఏ మంచి జరిగినా ఈ దుష్ట చతుష్టయానికి కడుపుమంట. కళ్లల్లో పచ్చకామెర్లు, బీపీ, ఒళ్లంతా పైత్యంతో బాధ పడుతున్నారు.
► అడ్డంకులను అధిగమించి ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెబుతూ వలంటీర్లు సంక్షేమ పథకాలందిస్తున్నారు. రూ.లక్షా 37 వేల కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించాం. శ్రీకాకుళం జిల్లాకు పోలవరం నీళ్లు తెస్తాం. నాన్న స్వప్నం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం.
► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, గుడివాడ అమర్‌నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
చరిత్రపుటల్లో నిలిచిపోయే రోజిది
విశాఖ నగరంలో 1.24 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించడం చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి జీవనం కోసం విశాఖ వచ్చిన అనేక మంది అద్దె ఇళ్లల్లో ఇబ్బందులు పడుతున్నారు. వారందరి సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌కు లబ్ధిదారులందరి తరఫున ధన్యవాదాలు. ఇక్కడ నిర్మాణమవుతున్నది జగనన్న కాలనీ కాదు.. జగనన్న పట్టణం. పేదలకు లబ్ధి చేకూరకుండా కుట్రలతో చంద్రబాబు కోర్టులకు వెళ్లినా..న్యాయమే గెలిచింది. బీసీ, బడుగు, బలహీన, దళిత వర్గాలకు సీఎం వైఎస్ జగన్ ద్వారానే న్యాయం జరుగుతుంది.
– జోగి రమేష్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి
మీరు మహిళా పక్షపాతి
అన్నా.. మాది పేద కుటుంబం. మీరు మా సొంతింటి కలను నెరవేర్చినందుకు మీకు ధన్యవాదాలు. నాలాంటి పేద వారికి ఇల్లు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. మేం అద్దెలు కట్టలేక కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. నాకు మీరు భరోసానిచ్చారు. నా ఇంట్లో నేను ధైర్యంగా బతికే ఆధారం కల్పించారు. నేనున్నానంటూ తోడుగా నిలిచారన్నా. నాకు వివిధ పథకాల ద్వారా సాయం అందుతోంది. మీ అన్న మహిళా పక్షపాతి అంటారు. అవును నేను ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటాను. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
– నవమణి, లబ్ధిదారు, గాజువాక
Comments
Please login to add a commentAdd a comment