CM YS Jagan Comments On Yellow Media Fake News On Pensions - Sakshi
Sakshi News home page

పెంచితే అభాండాలా?

Published Wed, Dec 28 2022 3:38 AM | Last Updated on Wed, Dec 28 2022 9:21 AM

CM YS Jagan Comments On Yellow Media Fake News On Pensions - Sakshi

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రతి కలెక్టర్‌కు చెబుతున్నా. మనది మానవత్వం ఉన్న ప్రభుత్వం. పేదవాడికి దగ్గరగా ఉండే మనసులు మనవి. అర్హత ఉన్నప్పటికీ ఇవ్వని పరిస్థితి, పథకాలు రాని పరిస్థితి, కటింగ్‌ అయిన పరిస్థితి అసలు ఉండకూడదు. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ లబ్ధిదారుడికే ఇవ్వండి. నాకు అర్హత ఉండి కూడా ఈ ప్రభుత్వంలో మంచి జరగలేదనే మాటను ఏ ఒక్క పేదవాడి నుంచి కూడా, ఏ ఒక్క కలెక్టర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అనిపించుకునే పరిస్థితి రానివ్వద్దు.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 1వ తేదీ నుంచి పింఛన్‌ మొత్తాన్ని పెంచుతుండటాన్ని జీర్ణించుకోలేక పెన్షన్లు తొలగిస్తున్నారంటూ విపక్షాలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మానవతా దృక్పథంతో పని చేస్తుంటే మంచిని సహించలేక ఆశ్చర్యకరమైన వార్తలు రాస్తున్నారని, అభాండాలు వేయాలన్న తపనతో కట్టుకథలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు.

తప్పుడు ప్రచారాలు, కట్టుకథలు, విష రాతలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని, అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలను  అందిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్లు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి వాస్తవాలను గట్టిగా  వెల్లడించాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు దూరం కారాదనే సంకల్పంతో ఏ కారణంతోనైనా పొరపాటున పథకాలు అందని అర్హులకు కూడా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.590.91 కోట్లను ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు. వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న వారినుద్దేశించి సీఎం మాట్లాడారు. ఆ వివరాలివీ..
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు 

తప్పుడు ప్రచారాలు..
అర్హత ఉన్నవారికి ఏ పథకం కూడా మిస్‌ కాకూడదు. ఇది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అలాగే అర్హత లేని వారికి రాకూడదు. ఏ పథకమైనా ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ఆడిట్‌ జరగాలి. ఇందులో తప్పేముంది? పెన్షన్లకు సంబంధించి కొంతమందికి నోటీసులు వెళ్లాయి. ఎక్కడెక్కడ సందేహాలున్నాయో వాటిని ప్రస్తావిస్తూ నోటీసులు ఇస్తారు. దానికి సమాధానాలు కూడా తీసుకుంటారు.

ఆ తర్వాత రీ వెరిఫై చేసి అనంతరం ఏదైనా చర్య తీసుకుంటారు. అంతేకానీ రీ వెరిఫై చేయకుండా ఏ చర్యలూ తీసుకోరు. కేవలం నోటీసులిస్తేనే పెన్షన్లు తీసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ  ప్రభుత్వంలో ఏ పేదవాడికైనా, ఎక్కడైనా నష్టం జరుగుతుందా? అని అంతా గుండెల మీద చేతులు వేసుకుని ప్రశ్నించుకోవాలి. 

విష వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం
మనం ఇవాళ ఒక పార్టీతో యుద్ధం చేయడం లేదు. ఒక విష వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. మనం ఎలాంటి మంచి చేసినా నెగిటివ్‌గా చూపించాలని తపనపడే ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 విష వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. అయినా కూడా మంచి చేసేవాళ్లకి దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి విష వక్రీకరణలు చేసే వారికి దేవుడే సమాధానం చెబుతాడు. విష రాతలు రాసేవారికి దేవుడే మొట్టికాయ వేస్తాడు. వాళ్లు చేసే ఏ ఆరోపణ అయినా మనం పాజిటివ్‌గా తీసుకుందాం. అందులో నిజం ఉంటే సరిదిద్దుకుందాం.

నిజం లేకపోతే వారి తప్పును కచ్చితంగా తెలియజేసే కార్యక్రమం చేయాలి. లేదంటే తప్పుడు సమాచారం పోతుంది. వాళ్లు చెప్పేదే నిజమనుకునే ప్రమాదం ఉంది. మన తప్పు లేకపోతే మీడియా సమావేశం పెట్టి గట్టిగా చెప్పండి. అప్పుడే వాళ్లు చేసిన తప్పు వాళ్లకు ఎత్తి చూపినట్లు అవుతుంది. మనం ప్రజా పాలకులం. అంటే ప్రజలకు సేవకులం అని అర్థం. పాలన అంటే సేవ అనే అర్థం. ప్రతి అధికారి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

అధికారం ప్రజా సేవకే...
దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ మనం వేసే అడుగు మన పాలనకు అద్దం పట్టే విధంగా జరుగుతోంది. అధికారం చలాయించడానికి కాదు.. ప్రజల కోసమే మనం ఉన్నాం. ప్రజలకు సేవ చేయటానికే మనం ఉన్నామని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం.

డీబీటీ, నాన్‌ డీబీటీతో రూ.3.30 లక్షల కోట్ల లబ్ధి
ఇవాళ లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటు ఇవ్వకుండా ఎంత పారదర్శకంగా పాలన జరుగుతుందో చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఈ 36 నెలల వ్యవధిలో బటన్‌ నొక్కి డీబీటీ ద్వారా రూ.1.85 లక్షల కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు జమ చేశాం. దీనికి నాన్‌ డీబీటీ అంటే ఇళ్లు, ఇళ్ల పట్టాలు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, ట్యాబ్‌లు, విద్యా కానుక తదితరాలతో డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి మొత్తం రూ.3.30 లక్షల కోట్ల మేర అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చగలిగాం. 

కళ్లూ, చెవులు మీరే..
కలెక్టర్లు ప్రభుత్వానికి కళ్లు, చెవులు లాంటి వారు. వారి పాత్ర చాలా కీలకం. వారు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుంది. కలెక్టర్లకు ఈ విషయంలో అభినందనలు. పారదర్శకంగా, అవినీతికి చోటు లేకుండా చేయగ­లిగారు కాబట్టే ఒక గొప్ప వ్యవస్థను తేగలిగాం. 

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు..
కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీ­రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాల­నాయుడు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.వి.యస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ.తిరుపాల్‌రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌(ఎఫ్‌ఏసీ) వై.మధు­సూదన్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, బీసీ, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, హేండ్‌లూమ్స్, టెక్స్టైల్స్‌ ముఖ్య కార్యదర్శి కె.సునీత, రవాణాశాఖ కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న, హేండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్టŠస్‌టైల్స్‌ కమిషనర్‌ ఎంఎం నాయక్, మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, కాపు వెల్ఫేర్, డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ జి. రేఖారాణి, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్, గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక కార్యదర్శి బీఎం దివాన్, సచివాలయాల శాఖ కమిషనర్‌ షన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మీ కష్టం తెలిసిన ప్రభుత్వం..
మనది మనసున్న ప్రభుత్వం.. పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం.. రైతన్నల కష్టం తెలిసిన ఎరిగిన ప్రభుత్వం. అందుకే ఏ ఒక్కరికైనా, ఏ కారణం చేతనైనా, ఏ ఒక్క పథకమైనా అర్హత ఉన్నప్పటికీ పొరపాటున అందకపోతే కంగారు పడాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నాం. పథకం నెల రోజులలోగా దరఖాస్తు చేసుకోమని చెప్పాం. దాన్ని రీ వెరిఫై చేస్తాం. జనవరి నుంచి మే వరకు అమలైన పథకాలకు సంబంధించి మిగిలిపోయిన అర్హులకు జూన్‌లోనూ, జూన్‌ నుంచి నవంబరు వరకు అమలైన వాటికి డిసెంబరులోనూ మిగిలిపోయిన వారికి లబ్ధి చేకూరుస్తున్నాం.

ఇలాంటి కార్యక్రమం రాష్ట్ర  చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అర్హులు ఎవరూ మిస్‌ కాకూడదని తపన పడి ఇచ్చే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో కూడా జరిగి ఉండదు. అది కూడా అర్హుల జాబితాను సామాజిక తనిఖీల కోసం గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తూ మరీ పారదర్శకంగా అందించడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అందులో భాగంగా ఈ రోజు 11 పథకాలకు సంబంధించి మిగిలిపోయిన (జూన్‌ నుంచి నవంబరు వరకు) 2,79,065 మంది అర్హులకు మంచి చేస్తూ రూ.591 కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం.

నాడు – నేడు.. ఎంత తేడా?
‘జన్మభూమి’ ఆగడాలు.. మరుగుదొడ్లకూ లంచాలు
గత ప్రభుత్వ హయాంలో ప్రతి అడుగులో, ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీలదే రాజ్యం. నాడు ఏ పథకం రావాలన్నా అడిగే మొట్టమొదట ప్రశ్న మీరు ఏ పార్టీకి చెందిన వారు? ఇచ్చే అరకొర కూడా లంచాలు చెల్లిస్తేనే కానీ అందని దుస్థితి. గత ప్రభుత్వ హయాంలో గమనిస్తే అరకొరగా ఇచ్చిన పింఛన్‌ కేవలం రూ.1,000. అది కూడా మూడు నెలల పెన్షన్‌ సొమ్ము జన్మభూమి కమిటీల చేతిలో పెడితే కానీ వచ్చేది కాదు.

జన్మభూమి కమిటీలకు రూ.20 వేలు లంచం చేతిలో పెడితే కానీ ఇళ్లు వచ్చేవి కాదు. రూ.50 వేల సబ్సిడీ లోన్‌ ఇవ్వాలంటే రూ.20 వేలు జన్మభూమి కమిటీలకు ముట్టచెప్పాల్సిందే. మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచమే. మరుగుదొడ్లకు కూడా లంచాలు తీసుకున్న అధ్వాన్న పరిస్థితిని మనం గతంలో చూశాం. 

అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోరాదనే ఆరాటంతో...
ఆ పరిస్థితులన్నీ ఇవాళ మార్చగలిగాం. వ్యవస్థలో పూర్తి మార్పులు తెచ్చాం. గ్రామస్థాయిలో సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ కనిపిస్తోంది. సోషల్‌ ఆడిట్‌తో అర్హుల జాబితాలను ప్రదర్శించి పారదర్శకంగా ఇస్తున్నాం. అర్హత ఉండి కూడా ఏ ఒక్కరికైనా ప్రయోజనం దక్కకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాం.

రీ వెరిఫై చేసి మంజూరు చేసే గొప్ప మనసు ఇవాళ కనిపిస్తోంది. అర్హులను వెతికి మరీ ఏ ఒక్కరూ మిగిలిపోకూడదన్న ఆరాటంతో మంచి చేస్తున్నాం. ఇవాళ పార్టీలు, కులాలు, ప్రాంతాలు చూడటం లేదు. మన పార్టీకి ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే ఇచ్చే గొప్ప ఆలోచన జరుగుతోంది. 

పెన్షన్‌ మొత్తంలో 175 శాతం పెరుగుదల
గత ప్రభుత్వ హయాంలో 39 లక్షల పెన్షన్లు ఇవ్వగా ఈరోజు 62.70 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. గతంలో పెన్షన్‌ రూ.వెయ్యి మాత్రమే ఇస్తే ఇవాళ రూ.2,750కి పెంచుతున్నాం. అందుకునే పెన్షన్‌ మొత్తంలో 175 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక పెన్షన్ల సంఖ్య 39 లక్షల నుంచి 62.70 లక్షలకు పెరిగిందంటే 60 శాతానికిపైగా పెరుగుదల ఉందని అర్థం.

అలాగే నెలవారీ పింఛన్ల వ్యయంలో మూడున్నర రెట్లకుపైగా పెరుగుదల కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల బిల్లు వ్యయం రూ.400 కోట్లు కాగా నేడు నెలకు రూ.1,770 కోట్లు పింఛన్ల కోసం ఇస్తున్నాం. ఇంత భారీగా పెరిగిన పరిస్థితుల్లోనూ ఇంకా ఎవరైనా అర్హులు పొరపాటున కూడా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో వారితో దరఖాస్తు చేయించి రీ వెరిఫై చేసి మరీ ఇస్తున్నాం. 

లబ్ధిదారుల కళ్లల్లో ‘సంతృప్తి’
అర్హులైన లబ్ధిదారులు పథకాలు అందుకోవడం ఒక ఎత్తయితే వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన అర్హులకు కూడా సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తుండటంతో వారి కళ్లల్లో ఎంతో సంతోషం కనిపిస్తోంది. లంచాలు ఏమైనా ఇస్తున్నారా? అంటే మా జగనన్న వచ్చినప్పటి నుంచి ఆ మాటే లేదంటున్నారు. అన్ని పల్లెలు, పట్టణాల్లో అదే  మాట వినిపిస్తోంది. ప్రతి అక్కచెల్లెమ్మ మా అన్న వచ్చిన తర్వాత జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటి దగ్గరే నీళ్లు తీసుకుంటున్నాం అని చెబుతుంటే ఆనందంగా ఉంది.      
– బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం (పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి)

అన్నలా, తమ్ముడిలా, కుమారుడిలా 
అమ్మ ఒడి మూడో విడత డబ్బులు రాకపోవడంతో వలంటీర్‌ను కలిశా. బ్యాంక్‌ ఖాతా లింక్‌ కాకపోవడంతో పడలేదని చెప్పారు. మా వలంటీర్‌ సచివాలయానికి తీసుకెళ్లి లింక్‌ చేయించింది. మీరు మాట ఇచ్చారంటే తప్పరని తెలుసు. మళ్లీ లిస్ట్‌లో నాపేరు రావడంతో సంతోషంగా ఉంది, నవరత్నాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

సచివాలయ వ్యవస్థతో పనులన్నీ జరుగుతు­న్నాయి. అన్నీ ఇంటి ముందుకే వస్తున్నాయి. ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా అభివృద్ధి జరు­గుతోంది. మాలాంటి పేదల సొంతింటి కలను కూడా మీరు నెరవేర్చారు. ప్రతి ఇంట్లో మిమ్మల్ని అన్నలా, తమ్ముడిలా, కుమారుడిలా భావిస్తున్నారు. మీరు సీఎంగా రావడం మాకు వరం.     
    – వెలమల నాగమణి, లబ్ధిదారు, పెద్ద తాడివాడ, విజయనగరం జిల్లా

కాపులను గుర్తించింది మీరే..
మాకు గతంలో ఎప్పుడూ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరలేదు. మీరు మాకు కాపునేస్తం ఇచ్చారు. అయితే రెండోసారి రాలేదు. వలంటీర్‌ నిన్న కాల్‌ చేసి మీకు కాపు నేస్తం వచ్చిందని చెప్పడంతో చాలా సంతోషం వేసింది. రూపాయి అడగాలంటే మనసు ఒప్పుకోక ఇంట్లోనే ఉండే మా కాపు మహిళలకు మీరు అండగా నిలుస్తున్నారు.

కాపులను మీరు గుర్తించారు. ఇవాళ గర్వంగా చెబుతున్నాం జగనన్న మాకు డబ్బులు ఇస్తున్నారని. ప్రతి ఇంటికి మీరు ఎంతో సాయం చేస్తున్నారు. మా నాన్నకు పింఛన్‌ వస్తోంది. నా పెద్ద కుమారుడు జగన్‌ ప్రతి నెలా తెల్లవారగానే డబ్బులు పంపుతున్నాడని సంతోషంగా చెబుతున్నారు. మాకు ఆసరా కూడా వచ్చింది.     
    – దేవిశెట్టి శారదాదేవి, లబ్ధిదారు, కొవ్వూరు, కాకినాడ రూరల్‌ మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement