గురువారం బ్యాంకర్ల సమితి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.42,494 కోట్ల పంట రుణాలివ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. గతేడాది లక్ష్యం కంటే ఇది రూ.2,741 కోట్లు అదనం. ఈ మేరకు 2018–19 రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని రంగాలకు కలిపి మొత్తం రూ.1.36 లక్షల కోట్ల బ్యాంకు రుణాలివ్వాలని ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా 42.47 శాతం, అంటే రూ.58,063 కోట్లు వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇస్తారు.
ఇందులో పంట రుణాలు రూ. 42,494 కోట్లు. ఇందులో 60 శాతం ఖరీఫ్‌లో, 40 శాతం రబీలో ఇస్తారు. రూ.15,569 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, రూ.1,798 కోట్ల విద్యా రుణాలు, రూ.6,011 కోట్ల గృహ రుణాలు కూడా ఇస్తారు. పంట రుణాల్లో అధికంగా వరికి 19.52 లక్షల రైతులకు రూ.18,796 కోట్లిస్తారు. 8.09 లక్షల మంది పత్తి రైతులకు రూ.8,279 కోట్లు, 1.44 లక్షల మిరప రైతులకు రూ.1,141 కోట్లు, 3.86 లక్షల మొక్కజొన్న రైతులకు రూ.3 వేల కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 96 వేల మందికి రూ.2,639 కోట్లు, ఉద్యాన పంటల సాగు, మొక్కల పెంపకానికి రూ.1,140 కోట్లు, కోళ్ల పరిశ్రమకు రూ.846 కోట్లు ఇస్తారు.
గత యాసంగిలో 65 శాతమే
గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌లో పంట రుణాల లక్ష్యం రూ.23,851 కోట్లు కాగా బ్యాంకులు రూ.21,025 కోట్లు (88.15 శాతం) ఇచ్చాయి. 88 శాతం, రబీలో 65 శాతం రుణాలిచ్చినట్టు వెల్లడించారు. గతేడాది వానాకాలం కానీ యాసంగిలో మాత్రం రూ.15,901 కోట్లకు గాను రూ.10,384 కోట్లే (65 శాతం) రైతులకు అందినట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. దాంతో రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. రూ.10,714 కోట్ల వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలకు రూ.7320.07 కోట్లు (68.32 శాతం) ఇచ్చారు. వ్యవసాయ మౌలిక వసతుల రుణాల లక్ష్యం రూ.1,323.03 కోట్లయితే రూ.391 కోట్లతో బ్యాంకులు సరిపెట్టాయి.
రాష్ట్రానికి అగ్రస్థానంలో బ్యాంకర్లకూ పాత్ర: ఈటల
రైతుబంధు పథకంతో రైతులందరినీ బీమా పరిధిలోకి తెచ్చామని ఈటల అన్నారు. రుణ ప్రణాళికను విడుదల చేశాక ఆయన మాట్లాడారు. ఇప్పటికే గ్రామాల్లోని గీత కార్మికులు, ఇతర వర్గాలకూ బీమా ఉందని గుర్తు చేశారు. గ్రామాల్లోని ఇతర పేదలకూ జీవిత బీమా అందేలా మరో పథకాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు. ‘‘రైతు బంధుతో బ్యాంకుల్లో నగదు కొరత కాస్త తగ్గింది. దేశంలో ఈ పథకం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. కొత్త రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించి నంబర్‌వన్‌గా నిలవడంలో బ్యాంకర్ల పాత్ర కూడా ఉంది. వారికి ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు. రూ.5 వేల కోట్లు అందుబాటులో ఉంచాలని కేందాన్ని కోరితే రూ.3 వేల కోట్లే ఇచ్చారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో ఢిల్లీకి పోతే స్పందన ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. గతంలో దేశానికి గుజరాత్ రోల్ మోడల్ అనేవారు.
ఇప్పుడు ఆ స్థానంలో తెలంగాణ ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ముందుందని కాగ్ కూడా ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుంది. ఈ ఏడాది 10 లక్షల ఎకరాల స్థిర ఆయకట్టు ఇస్తాం. గతంలో రైస్ బౌల్ ఆఫ్ ఏపీ అనేవారు, ఇప్పుడు తెలంగాణ అంటున్నారు. ఏపీలో 43 లక్షల టన్నుల వరి పండితే, తెలంగాణలో 55 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది’’అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో శాఖలను పెంచాలని బ్యాంకర్లను కోరారు. వాటిల్లో ఉద్యోగుల సంఖ్యనూ పెంచాలన్నారు. ‘‘గ్రామీణ యువతకు గ్యారంటీ లే కుండా రుణాలివ్వండి. అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. చిన్న పరిశ్రమలకు బ్యాంక్ డిపాజిట్ లేకుండా రుణాలివ్వండి. కుల వృత్తులకు రుణాలివ్వండి. చిన్న వృత్తులకు రూ.1,500 కోట్ల సబ్సిడీ ఇవ్వబోతున్నాం. వారి కి బ్యాంకులు రూ. 2–3 వేల కోట్లివ్వాలి’’అని కోరారు. మోకాలి చికిత్స వల్ల ఆస్పత్రిలో ఉన్న వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడా రు. ‘రైతుబంధు’లో సహకరించిన బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment