సాగు ఖర్చు తగ్గింపునకు మార్గదర్శకాలు
రాష్ట్రాలకు పంపిన కేంద్ర వ్యవసాయశాఖ
- వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని సూచన
- సన్న, చిన్నకారు రైతులకు సకాలంలో రుణాలు
- వర్షాభావ ప్రాంతాల్లో వరి ఉత్పత్తి, ఉత్పాదకతలపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: పంటల సాగు ఖర్చు తగ్గింపుపై కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. రైతు సంక్షేమం దృష్ట్యా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. సాగు ఖర్చు పెరగడం వల్లే రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారని, అందువల్ల వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలు పంపింది. భూసార కార్డుల ఆధారంగా ఎరువులను, సేంద్రియ ఎరువులను వాడేవిధంగా రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల అనవసర ఎరువుల వాడకం తగ్గి సాగు ఖర్చు తగ్గుతుంది. సాగునీటి యాజ మాన్య పద్ధతులు పాటించాలి. సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించాలి.
రైతులకు సకాలంలో రుణాలు అందేలా చూడాలి. కౌలురైతులకూ రుణాలు అందజేయాలి. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని, దీనివల్ల సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. అందుకోసం కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి రైతులకు తక్కువ అద్దెకు వ్యవసాయ యంత్రాలను సరఫరా చేయాలని స్పష్టం చేసింది. వచ్చే ఖరీఫ్ నుంచి అమలయ్యే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)పై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి.
కేంద్ర వ్యవసాయశాఖ మార్గదర్శకాలివే...
► పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలంటే తక్కువ కాలపరిమితి వరి రకాలను ప్రోత్సహించాలి. ఒకే సీజన్‌లో రెండు రకాల పంటలను సాగు చేయవచ్చు.
► జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతుక్షేత్రాల్లో నీటి కుంటలను తవ్వించాలి.
► వర్షాభావ ప్రాంతాలు, వరదలు వచ్చే ప్రాంతాల్లో వరి ఉత్పత్తి, ఉత్పాదకతలపై దృష్టి సారించాలి. వరదల్లో మునిగిపోయినా తట్టుకోగలిగే వరి విత్తన రకాలను రైతులకు అందించాలి.
► తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు చేపట్టాలి.
► ఉద్యానవన సాగులో హైబ్రీడ్ టెక్నాలజీని ప్రోత్సహించాలి.
► ఉద్యాన పంటల్లో సూక్ష్మ పోషకాలను ప్రోత్సహించాలి.
► గడ్డిసాగును ప్రోత్సహించాలి. బై బ్యాక్ పద్ధతిన రైతుల నుంచి కొనాలి.
► రైతుల వద్దకు మొబైల్ వెటర్నరీ సేవలను అందించాలి. తద్వారా వారి పశువుల ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వాలి.