రైతులకు ఇబ్బంది లేదు
డీసీసీబీ, పీఏసీఎస్‌లకు రుణాల చెల్లింపునకు వెసులుబాటు
- ఏ వాణిజ్య బ్యాంకులోనైనా సులభంగా ఖాతా తెరవచ్చు
- ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా రుణ మొత్తాన్ని డీసీసీబీలకు బదలాయించవచ్చు
- ప్రజా ప్రయోజనాల కోసమే డీసీసీబీలపై నిషేధం విధించాం
- హైకోర్టుకు ఆర్‌బీఐ నివేదన
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వ్యవసాయ రుణాల చెల్లింపునకు సంబంధించి రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు రైతులకు తగిన వెలుసుబాటు ఉందని, ఈ విషయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసు కుంటున్నామని వివరించింది. తాము అనుమ తించిన ఏ బ్యాంకులోనైనా రైతులు అత్యంత సులభంగా బ్యాంకు ఖాతా తెరవచ్చునని, ఆ ఖాతాలో రద్దు చేసిన నోట్లను డిపాజిట్ చేసి ఆ మొత్తాన్ని రుణం తీసుకున్న డీసీసీబీ, పీఏసీ ఎస్‌లకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (ఎన్‌ఈఎఫ్‌టీ) ద్వారా బదలాయింపు చేయవచ్చునంది.
ఏ ఖాతాకైతే డబ్బు బదలా యించాలో ఆ బ్యాంకులో ఖాతా లేకపోయి నప్పటికీ, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను చూపి రూ.50 వేల వరకు బదలా యింపు చేసుకునే అవకాశం ఇచ్చామని తెలిపింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు (డీసీసీబీ) అనుబంధంగా ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నుంచి రుణాలు తీసుకున్నామని, నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్‌బీఐ సర్క్యూలర్ వల్ల రుణా లు చెల్లించలేకపోతున్నామంటూ కృష్ణా జిల్లాకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయిం చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఈ ఆదేశాల మేరకు ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మనభంజన్ మిశ్రా కౌంటర్ దాఖలు చేశారు. ప్రజా ప్రయోజనాలు, డిపాజిటర్ల ప్రయోజనాలు, బ్యాంకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే డీసీసీబీల్లో రద్దు చేసిన నోట్ల డిపాజిట్, మార్పిడిని నిషేధించామని ఆయన వివరించారు. రైతులకు రబీ సాగు నిమిత్తం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన నగదు నిల్వలను సిద్ధంగా ఉంచాలని బ్యాంకులకు స్పష్టం చేశామన్నారు. ‘వారానికి రూ.10వేల కోట్ల చొప్పున రైతులకు రుణాల కింద అందచేసేందుకు డీసీసీబీలకు రూ.35వేల కోట్లు అవసరం అవుతాయి. అంతేకాక పీఏసీఎస్‌లు, రైతులకు అవసరమైన రుణాలను డీసీసీబీలు అందచేసేందుకు వీలుగా నాబార్డ్ రూ.23వేల కోట్ల సొంత నిధులను సిద్ధం చేసింది.
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, వారికి ఖాతాలు తెరిపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఇప్పటికే స్పష్టమైన సూచనలిచ్చాం. నకిలీ నోట్లను గుర్తించేందుకు నోట్ల లెక్కింపు యంత్రాలను ఉపయోగిస్తున్నాం. అయితే డీసీసీబీలకు నకిలీ నోట్లను గుర్తించే యంత్ర సామర్థ్యం, నిపుణులైన సిబ్బంది కొరత ఉంది. ఈ పరిస్థితుల్లో డీసీసీబీల్లో రద్దు చేసిన నోట్ల మార్పిడి, డిపాజిట్లపై నిషేధం విధించాం. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయండి’ అని మిశ్రా కోర్టును కోరారు.