అధికారం ఉంటే చట్టమెందుకు? | Why authorized by law? | Sakshi
Sakshi News home page

అధికారం ఉంటే చట్టమెందుకు?

Published Wed, Nov 30 2016 1:43 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

అధికారం ఉంటే చట్టమెందుకు? - Sakshi

అధికారం ఉంటే చట్టమెందుకు?

పెద్ద నోట్ల రద్దుపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం
- తదుపరి విచారణ డిసెంబర్ 8కి వారుుదా
- మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరణ
 
 సాక్షి, హైదరాబాద్:  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) చట్టంలోని సెక్షన్ 26(2) కింద నోట్ల రద్దుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసే అధికారం కేంద్రానికి ఉన్నప్పుడు, 1978లో ప్రత్యేక చట్టం ఎందుకు తీసుకొచ్చారని హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చట్టం ద్వారానే నోట్లను రద్దు చేయాలే తప్ప, సెక్షన్ 26(2) కింద కాదని పిటిషనర్లు చెబుతున్నారని, ఈ విషయంలో న్యాయస్థానాన్ని సంతృప్తిపరిచేలా సమాధానం చెప్పాలని పేర్కొంది. నోట్ల రద్దు విషయంలో ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ కేంద్రానికి చేసిన ప్రతిపాదనల వివరాలను కూడా తెలిపాలంది. నోట్ల మార్పిడి, డిపాజిట్ల విషయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు (డీసీసీబీ) అవకాశం ఇవ్వకపోవడానికి గల కారణాలను కూడా తెలియచేయాలని స్పష్టం చేసింది. నోట్ల రద్దు వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

 నోట్ల రద్దు నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ధర్మాసనం నిరాకరించింది. అలా చేస్తే పరిస్థితి అల్లకల్లోలంగా మారుతుందని, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది. కేంద్రం, ఆర్‌బీఐ దాఖలు చేసే కౌంటర్లను పరిశీలించిన తరువాత ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని తేలుస్తామని వెల్లడించింది. పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబరు 8వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వరరావు, న్యాయవాది కె.శ్రీనివాస్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే నగదు ఉపసంహరణ పరిమితులను సవాలు చేస్తూ మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటినీ ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది.

 ఎందుకు జత చేశారు?
 సెక్షన్ 26(2) కింద ప్రభుత్వానికి అధికారం ఉంటే, మరి 1956లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు సెక్షన్ 26కు ‘ఎ’ను ఎందుకు జత చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. 1946 జనవరి 13కు ముందున్న పెద్ద నోట్ల చెల్లుబాటు కావన్నది సెక్షన్ 26ఎ సారాంశమని, అప్పటి పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునని నటరాజ్ చెప్పారు. సెక్షన్ 26(2), 26ఎలను వేర్వేరుగా చూడాలన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడంతోపాటు, డిసెంబర్ 31 వరకు మాత్రమే ఆ నోట్లు చెల్లుబాటు అవుతాయంటూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉందని పిటిషనర్లు చెబుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
 
 మేమే ఈ వ్యాజ్యాలను వింటాం...
 ప్రాథమిక హక్కులను హరించడం లేదని, సెక్షన్ 26(2) కింద ఉన్న అధికారాన్ని ఉపయోగించే కేంద్రం ఆ నిర్ణయం తీసుకుందని నటరాజ్ సమాధానమిచ్చారు. అధికారం ఉన్నప్పుడు 1978లో నోట్లను రద్దు చేసినప్పుడు ప్రత్యేక చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాక సుప్రీంకోర్టు తమ వద్ద వ్యాజ్యాలను బదిలీ చేసుకుంటే తప్ప ఈ వ్యాజ్యాలపై తాము విచారణ చేపట్టి తీరుతామని తేల్చి చెప్పింది. డీసీసీబీ వ్యవహారాలను కొంతకాలంగా ఆర్‌బీఐ సరిగ్గా పర్యవేక్షించడం లేదని, ఆ కారణం వల్లనో లేక డీసీసీబీలకు లెసైన్సులు లేకపోవడం వల్లో నగదు డిపాజిట్ల విషయంలో వాటికి అవకాశం ఇవ్వకపోవచ్చని, అసలు కారణాలను కోర్టు ముందుంచుతానని నటరాజ్ తెలిపారు.
 
 వాటిని రద్దు చేయవచ్చు
 కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (సదరన్ జోన్) కె.ఎం.నటరాజ్ వాదనలు వినిపిస్తూ... నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ ఒకే చోటుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై డిసెంబర్ 2న విచారణ జరగనుందని తెలిపారు. నోట్ల రద్దును సమర్థిస్తూ మద్రాసు, కర్నాటక హైకోర్టులు తీర్పులు ఇచ్చాయని వివరించారు. దీంతో ధర్మాసనం ఆ తీర్పులను పరిశీలించింది. ఆ తీర్పుల్లో కేంద్ర ప్రభుత్వ అధికారం గురించి ప్రస్తావన లేకపోవడంతో వాటిని తాము పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. ‘‘ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) కింద నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ విషయంలో సెక్షన్ 26(2) కింద అనుసరించాల్సిన విధి విధానాలను కూడా అనుసరించలేదని చెబుతున్నారు. స్వతంత్ర చట్టం ద్వారానే నోట్లను రద్దు చేయాలే తప్ప, సెక్షన్ 26(2) కింద నోటిఫికేషన్ ద్వారా కాదని వారంటున్నారు. దీనిపై మీరేమంటారు?’ అని నటరాజ్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఆయన సెక్షన్ 26(2)ను చదివి వినిపించారు. అందులో ‘ఎనీ సిరీస్ ఆఫ్ నోట్స్’ అని ఉందని, దీని ప్రకారం ఏ సిరీస్ నోట్లనైనా రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉందని తెలిపారు.
 
 రూ.10 వేలకు చెక్కు పంపా.. తిప్పి పంపారు

 నగదు కష్టాలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందని ధర్మాసనం ఆరా తీసింది. తాను కూడా ఉదయం రూ.10 వేల చెక్కు పంపగా, బ్యాంక్ మేనేజర్ నగదు లేదని తిప్పి పంపారని ఏసీజే వ్యాఖ్యానించారు. సెక్షన్ 26 కింద కేంద్రానికి ప్రతిపాదనలు పంపే అధికారం ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డుకు లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల వెంకటరమణ అన్నారు. నోట్ల ముద్రణ తప్ప, మిగిలిన ఏ విషయంలోనూ ప్రతిపాదనలు పంపే అధికారం సెంట్రల్ బోర్డుకు లేదని చెప్పారు. తరువాత మరో న్యాయవాది పి.వి.కృష్ణయ్య కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
 
 ప్రజల ఇబ్బందులు నిజమే
 ‘‘మధ్యంతర ఉత్తర్వులా? ఈ ఉత్తర్వుల వల్ల కలిగే పరిణామాల గురించి తెలిసే అడుగుతున్నారా? నోటిఫికేషన్‌ను నిలిపేస్తే పరిస్థితి అల్లకల్లోలంగా మారుతుంది. మొత్తం స్తంభించిపోతుంది. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులిస్తాం. అంతిమంగా మీరు ఈ కేసులో ఓడిపోతే. ఈ మధ్యలో జరిగే నష్టానికి, ప్రజల కష్టానికి బాధ్యులెవరు?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. అంతకు ముందు మైసూరారెడ్డి తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపిస్తూ... నగదు ఉపసంహరణ పరిమితుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement